YouVersion Logo
Search Icon

ద్వితీయో 28

28
విధేయతకు దీవెనలు
1మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటూ, నేను ఈ రోజు మీకిచ్చే ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరిస్తే, మీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త దేశాల కంటే పైగా మిమ్మల్ని హెచ్చిస్తారు. 2మీ దేవుడైన యెహోవాకు మీరు లోబడితే, ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి, మిమ్మల్ని వెంబడిస్తాయి:
3మీరు పట్టణంలో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు.
4మీ గర్భఫలం దీవించబడుతుంది, భూ పంటలు, పశువుల మందల్లోని దూడలు గొర్రెల మందల్లోని గొర్రెపిల్లలు దీవించబడతాయి.
5మీ గంప, మీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది.
6మీరు లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్లినప్పుడు దీవించబడతారు.
7శత్రువులు మీ మీదికి లేచినప్పుడు, యెహోవా వారిని మీ ముందు ఓడిపోయేలా చేస్తారు. వారు ఒకవైపు నుండి మీ దగ్గరకు వస్తారు కాని నీ దగ్గరి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు.
8మీ కొట్ల మీదకు మీ ప్రయత్నాలన్నిటి మీదకు యెహోవా దీవెనలు పంపుతారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
9మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించి, ఆయన మార్గంలో మీరు నడుచుకుంటే, యెహోవా ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసినట్లుగా, యెహోవా మిమ్మల్ని తన పరిశుద్ధ ప్రజలుగా స్థాపిస్తారు. 10అప్పుడు భూమి మీద ఉన్న జనాంగాలందరూ మీరు యెహోవా పేరుతో పిలువబడ్డారని చూసి, వారు మీకు భయపడతారు. 11యెహోవా మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భ ఫలంలో, మీ పశువుల పిల్లల్లో, మీ నేల పంటల్లో మీకు సమృద్ధిగా వృద్ధిని ఇస్తారు.
12కాలానుగుణంగా మీ భూమిపై వర్షం కురిపించడానికి, మీ చేతి పనులన్నింటినీ దీవించడానికి యెహోవా తన ఆకాశ గిడ్డంగులను తెరుస్తారు. మీరు అనేక దేశాలకు అప్పు ఇస్తారు, కానీ ఎవరినుండి అప్పు తీసుకోరు. 13యెహోవా మిమ్మల్ని తలగా చేస్తారు, తోకగా కాదు. ఈ రోజు నేను మీకు ఇచ్చే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు శ్రద్ధగా గమనించి, వాటిని జాగ్రత్తగా పాటిస్తే, మీరు పై వారిగా ఉంటారు, క్రింది వారిగా ఉండరు. 14ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, వారిని సేవిస్తూ, ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆజ్ఞల నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగవద్దు.
అవిధేయతకు శాపాలు
15అయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయత చూపక, నేను ఈ రోజు మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని, శాసనాలను జాగ్రత్తగా పాటించకపోతే, ఈ శాపాలన్నీ మీపైకి వచ్చి మిమ్మల్ని ముంచేస్తాయి.
16మీరు పట్టణంలో శపించబడతారు, పొలంలో శపించబడతారు.
17మీ గంప, పిండి పిసికే తొట్టి శపించబడతాయి.
18మీ గర్భఫలం శపించబడుతుంది, మీ భూమి పంటలు, మీ పశువుల దూడలు, మీ మందల గొర్రెపిల్లలు శపించబడతాయి.
19మీరు లోపలికి వచ్చినప్పుడు శపించబడతారు, బయటకు వెళ్లినప్పుడు శపించబడతారు.
20మీరు ఆయనను విడిచిపెట్టి చేసిన చెడు కారణంగా, అకస్మాత్తుగా నాశనమయ్యే వరకు, యెహోవా మీరు చేయి వేసిన ప్రతి దాని మీదికి శాపాలు, నిరాశను, నిరుత్సాహాన్ని పంపుతారు. 21మీరు స్వాధీనపరచుకోడానికి ప్రవేశిస్తున్న దేశంలో ఉండకుండ మిమ్మల్ని నాశనం చేసే వరకు యెహోవా మిమ్మల్ని రోగాలతో తెగులుతో బాధిస్తారు. 22యెహోవా వ్యాధితో, జ్వరం, వాపు, తీవ్రమైన వేడి, ఖడ్గంతో,#28:22 లేదా కరువుతో ముడత, బూజుతో మీమీద దాడి చేస్తారు, మీరు నశించే వరకు ఇది తెగులుగా మిమ్మల్ని వేధిస్తుంది. 23మీ తలమీద ఆకాశం ఇత్తడిలా మీ క్రింద నేల ఇనుములా ఉంటాయి. 24యెహోవా మీ దేశపు వర్షాన్ని దుమ్ము, పొడిగా మారుస్తారు; మీరు నాశనం అయ్యేవరకు అది ఆకాశాల నుండి దిగి వస్తుంది.
25మీ శత్రువుల చేతిలో యెహోవా మిమ్మల్ని ఓడిపోయేలా చేస్తారు.మీరు వారి దగ్గరకు ఒకవైపు నుండి వస్తారు, కాని వారి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు. మీరంటే అన్ని రాజ్యాలకు భయం కలుగుతుంది. 26మీ కళేబరాలు ఆకాశపక్షులకు అడవి మృగాలకు ఆహారమవుతాయి, వాటిని వెళ్లగొట్టే వారెవరూ ఉండరు. 27యెహోవా మిమ్మల్ని నయం కాలేని ఈజిప్టు కురుపులు, గడ్డలు, చీముపట్టిన పుండ్లు, దురదతో బాధిస్తారు. 28యెహోవా మిమ్మల్ని వెర్రితనంతో, గ్రుడ్డితనంతో, మానసిక ఆందోళనతో బాధిస్తారు. 29మధ్యాహ్న సమయంలో మీరు చీకటిలో గ్రుడ్డివానిలా తడుముకుంటారు. మీరు చేసే ప్రతీ పనిలో మీరు విఫలమవుతారు; రోజు రోజుకు మీరు అణచివేయబడతారు, దోచుకోబడతారు, మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ ఉండరు.
30మీకు ఒక స్త్రీతో పెళ్ళి నిశ్చయమవుతుంది, కానీ మరొకరు ఆమెను తీసుకెళ్లి పాడుచేస్తారు. మీరు ఇల్లు కట్టుకుంటారు, కానీ మీరు అందులో నివసించరు. మీరు ద్రాక్షతోటను నాటుతారు, కానీ మీరు దాని ఫలాలను తినరు. 31మీరు చూస్తూ ఉండగానే మీ ఎద్దు వధించబడుతుంది, కానీ మీరు దాంట్లో నుండి ఏమి తినరు. మీ గాడిద బలవంతంగా తీసుకెళ్తారు, మళ్ళీ మీకివ్వరు. మీ గొర్రెలు మేకలు శత్రువుల వశమవుతాయి, వాటిని ఎవ్వరూ రక్షించరు. 32మీ కుమారులు కుమార్తెలు వేరొక దేశానికి ఇవ్వబడతారు, దినదినం వారి కోసం ఎదురుచూసి మీ కళ్లు అలసిపోతాయి, చేయి ఎత్తడానికి కూడా శక్తి ఉండదు. 33మీకు తెలియని ప్రజలు మీ భూమి, మీ శ్రమ ఉత్పత్తి చేసే వాటిని తింటారు, మీ జీవితమంతా క్రూరమైన అణచివేత తప్ప మీకు ఏమీ ఉండదు. 34మీరు చూసే దృశ్యాలు మిమ్మల్ని పిచ్చివారిని చేస్తాయి. 35యెహోవా మీ మోకాళ్లను, కాళ్లను నయం చేయలేని బాధాకరమైన కురుపులతో బాధిస్తారు, అవి మీ అరికాళ్ల నుండి నడినెత్తి వరకు వ్యాపిస్తాయి.
36మీకు, మీ పూర్వికులకు తెలియని దేశానికి యెహోవా మిమ్మల్ని మీరు నియమించుకున్న రాజును తోలివేస్తారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళు, చెక్క, రాతి దేవుళ్ళను సేవిస్తారు. 37యెహోవా మిమ్మల్ని నడిపించే ప్రజలందరి మధ్య మీరు భయానకమైన, ఒక సామెతగా హేళనకు కారణంగా మారతారు.
38మీరు పొలంలో చాలా విత్తనాలు విత్తుతారు, కానీ మిడుతలు దాన్ని మ్రింగివేస్తాయి కాబట్టి మీరు కొద్దిగా పంట కోస్తారు. 39మీరు ద్రాక్షతోటలు నాటి వాటిని శ్రమపడి సేద్యం చేస్తారు కాని ద్రాక్షరసం త్రాగరు, ద్రాక్షపండ్లు ఏరుకోరు, కారణం పురుగులు వాటిని తినేస్తాయి. 40మీకు ఒలీవచెట్లు ఉంటాయి గాని మీరు నూనె వాడరు, ఎందుకంటే ఒలీవలు రాలిపోతాయి. 41మీకు కుమారులు, కుమార్తెలు ఉంటారు, కానీ వారు మీ దగ్గర ఉండరు, ఎందుకంటే వారు చెరలోకి వెళ్లిపోతారు. 42మీ చెట్లను మీ పొలం పంటలను మిడతల గుంపులు వచ్చి ఆక్రమించుకుంటాయి.
43మీ మధ్య నివసించే విదేశీయులు మీకంటే అంతకంతకు పైకి ఎదుగుతారు, కానీ మీరు అంతకంతకు దిగజారిపోతారు. 44వారు మీకు అప్పిస్తారు గాని, మీరు వారికి అప్పు ఇవ్వరు. వారు తలగా ఉంటారు, మీరు తోకగా ఉంటారు.
45ఈ శాపాలన్నీ మీ మీదికి వస్తాయి. మీరు నాశనమయ్యే వరకు వారు మిమ్మల్ని వెంటాడి, మిమ్మల్ని అధిగమిస్తారు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయత చూపలేదు, ఆయన మీకు ఇచ్చిన ఆజ్ఞలను, శాసనాలను మీరు పాటించలేదు. 46అవి మీకు, మీ వారసులకు ఎప్పటికీ సూచనలుగా ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. 47ఎందుకంటే మీరు సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ మీ దేవుడైన యెహోవాకు సంతోషంగా, ఆనందంగా సేవ చేయలేదు. 48అందువల్ల ఆకలి, దాహం, నగ్నత్వం, పేదరికంలో, యెహోవా మీకు వ్యతిరేకంగా పంపే శత్రువులకు మీరు సేవ చేస్తారు. మిమ్మల్ని నాశనం చేసే వరకు ఆయన మీ మెడ మీద ఇనుప కాడి మోపుతాడు.
49యెహోవా మీకు వ్యతిరేకంగా దూర ప్రాంతాల నుండి, భూమి చివర్ల నుండి, ఒక గ్రద్ద దూసుకు వస్తున్నట్లుగా, మీకు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే ఒక దేశాన్ని తెస్తారు. 50అది వృద్ధుల పట్ల గౌరవం గాని చిన్నవారి పట్ల జాలి గాని లేని క్రూరంగా కనిపించే దేశము. 51మీరు నాశనమయ్యే వరకు వారు మీ పశువుల పిల్లలను, మీ భూమిలోని పంటలను మ్రింగివేస్తారు. మీరు నాశనమయ్యే వరకు వారు మీకు ధాన్యం గాని, క్రొత్త ద్రాక్షరసం గాని, ఒలీవనూనె గాని, మీ పశువుల దూడలను గాని, మీ మందల గొర్రెపిల్లలను వదిలిపెట్టరు. 52మీరు నమ్మే ఎత్తైన కోటగోడలు కూలిపోయే వరకు వారు మీ దేశంలోని అన్ని పట్టణాలను ముట్టడిస్తారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని అన్ని పట్టణాలను వారు ముట్టడిస్తారు.
53ముట్టడి సమయంలో మీ శత్రువు మీకు కలిగించే బాధల కారణంగా, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన గర్భఫలం, కుమారులు కుమార్తెల మాంసాన్ని మీరు తింటారు. 54మీలో అత్యంత సౌమ్యుడైన, సున్నితమైన పురుషునికి కూడా తన సొంత సోదరునిపై గాని లేదా తాను ప్రేమించే భార్యపై గాని లేదా మిగిలి ఉన్న పిల్లలపై గాని కనికరం ఉండదు. 55అతడు తినే తన పిల్లల మాంసంలో కొంచెమైనా అతడు వారికి ఇవ్వడు. ఎందుకంటే మీ పట్టణాలన్ని ముట్టడి చేయబడిన సమయంలో మీ శత్రువు మీకు కలిగించిన బాధను బట్టి అతనికి మిగిలింది అదే. 56మీలో అత్యంత సౌమ్యమైన సున్నితమైన స్త్రీ తన పాదం కూడా నేలమీద మోపే సాహసం చేయని స్త్రీ తాను ప్రేమించిన భర్తను, తన సొంత కుమారుడు లేదా కుమార్తెను వేధిస్తుంది. 57మీ పట్టణాలు ముట్టడి చేయబడిన సమయంలో మీ శత్రువు మిమ్మల్ని పెట్టే బాధను బట్టి ఆమె వేరే దారి లేక ఆమె గర్భం నుండి స్రవించే మావిని, కనిన పిల్లలను రహస్యంగా తినాలని అనుకుంటుంది.
58ఈ గ్రంథంలో వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర మాటలన్నిటిని ఒకవేళ మీరు జాగ్రత్తగా పాటించక, మీ దేవుడైన యెహోవా మహిమగల అద్భుతమైన నామానికి మీరు భయపడకపోతే, 59యెహోవా మీకు, మీ వారసులకు భయంకరమైన తెగుళ్ళు, కఠినమైన, సుదీర్ఘమైన విపత్తులు, తీవ్రమైన, దీర్ఘకాలిక అనారోగ్యాలను పంపుతారు. 60మీరు భయపడే ఈజిప్టు వ్యాధులన్నిటిని ఆయన మీ మీదికి తెస్తారు, అవి మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటాయి. 61మీరు నాశనం అయ్యేవరకు ఈ ధర్మశాస్త్ర పుస్తకంలో నమోదు చేయబడని ప్రతి విధమైన రోగాన్ని, విపత్తును కూడా యెహోవా మీపైకి తెస్తారు. 62ఆకాశంలోని నక్షత్రాల్లా అనేకమైన మీరు కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు. 63మీరు వృద్ధి చెందడం, సంఖ్య పెరగడం యెహోవాకు ఎంత సంతోషాన్ని కలిగించిందో, మిమ్మల్ని పతనం చేయడం, నాశనం చేయడం కూడా ఆయనను అంతే సంతోషపరుస్తుంది. మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశిస్తున్న దేశం నుండి మీరు పెరికివేయబడతారు.
64అప్పుడు యెహోవా భూమి యొక్క ఒక చివర నుండి మరొక చివర వరకు అన్ని దేశాల మధ్య మిమ్మల్ని చెదరగొడతారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళను మీకు గాని మీ పూర్వికులకు గాని తెలియని చెక్కతో రాతితో చేయబడిన దేవుళ్ళను సేవిస్తారు. 65ఆ దేశాల్లో మీకు విశ్రాంతి దొరకదు, మీ అరికాలుకు కూడా విశ్రాంతి స్థలం ఉండదు. అక్కడ యెహోవా మీకు మనోవేదన, ఎదురుచూపులతో మసకబారిన కళ్లను, కలవరపడుతున్న హృదయాన్ని ఇస్తారు. 66మీరు రాత్రి, పగలు దిగులుతో నిండుకొని, ఎప్పుడూ ప్రాణభయంతో జీవిస్తారు, మీరు బ్రతుకుతారన్న నమ్మకం మీకు ఉండదు. 67ఎందుకంటే మీ హృదయాలను నింపే భయం మీ కళ్లు చూసే దృశ్యాలను బట్టి మీరు ఉదయాన, “ఒకవేళ ఇది సాయంత్రం అయితే బాగుండు!” అని సాయంత్రం, “ఒకవేళ ఇది ఉదయం అయితే బాగుండు!” అని అంటారు. 68మీరు మళ్ళీ ఎన్నడూ ఈజిప్టుకు ప్రయాణం చేయకూడదని నేను చెప్పిన ఈజిప్టుకు యెహోవా మిమ్మల్ని ఓడలలో తిరిగి పంపుతారు. అక్కడ మీరు మగ, ఆడ బానిసలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరు అమ్మకానికి పెట్టుకుంటారు, కానీ ఎవరూ మిమ్మల్ని కొనరు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in