ద్వితీయో 26
26
ప్రథమ ఫలాలు, దశమభాగాలు
1మీరు మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశంలోకి ప్రవేశించినప్పుడు దానిని స్వాధీనం చేసుకుని దానిలో స్థిరపడాలి. 2మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న భూమి నేల నుండి మీరు ఉత్పత్తి చేసే అన్ని ఫలాలను తీసుకుని వాటిని బుట్టలో ఉంచండి, తర్వాత మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాసంగా ఎన్నుకునే ప్రదేశానికి వెళ్లి, 3ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న యాజకునికి, “మాకు ఇస్తానని యెహోవా మా పూర్వికులకు ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చానని ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు ప్రకటిస్తున్నాను” అని చెప్పండి. 4యాజకుడు మీ చేతుల్లో నుండి ఆ గంపను తీసుకుని మీ దేవుడైన యెహోవా బలిపీఠం ముందు క్రింద పెట్టాలి. 5అప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా ఎదుట ఇలా ప్రకటించాలి: “నా తండ్రి సంచరించే అరామీయుడు, అతడు కొద్దిమంది వ్యక్తులతో ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించి, శక్తివంతమైన, అసంఖ్యాకమైన గొప్ప దేశంగా అయ్యాడు. 6కాని ఈజిప్టువారు మనలను హింసించి, బాధపెట్టి, మనలను కఠినమైన శ్రమకు గురి చేశారు. 7మనం మన పూర్వికుల దేవుడైన యెహోవాకు మొరపెట్టుకున్నాము. యెహోవా మన మొర విని, మన బాధ, ప్రయాస, మనకు కలిగిన హింసను చూశారు. 8యెహోవా తన బలమైన హస్తంతో చేయి చాపి మహా భయంకరమైన విధంగా చర్య తీసుకున్నాడు, అసాధారణ గుర్తులను, అద్భుతాలను చూపించారు. 9ఈ స్థలానికి మనలను తెచ్చి పాలు తేనెలు నదులైపారే ఈ దేశాన్ని మనకిచ్చారు. 10యెహోవా, మీరు నాకు ఇచ్చిన భూమిలోని మొదటి ఫలాలను ఇప్పుడు తెస్తున్నాను.” ఆ గంపను మీ దేవుడైన యెహోవా ముందు పెట్టి ఆయన ముందు నమస్కరించాలి. 11నీకు మీ ఇంటివారికి మీ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మేలును బట్టి మీరూ లేవీయులు అలాగే మీ మధ్య ఉన్న విదేశీయులు కలిసి సంతోషించాలి.
12పదవ భాగం ఇచ్చే సంవత్సరం, అనగా మూడవ సంవత్సరం మీ రాబడిలో దశమభాగం చెల్లించి, అది లేవీయులకు విదేశీయులకు తండ్రిలేనివారికి విధవరాండ్రకు ఇవ్వాలి. వారు మీ గ్రామాల్లో వీరంతా తిని తృప్తి పొందాలి. 13అప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఇలా చెప్పాలి: “మీరు ఆజ్ఞాపించిన ప్రకారము నేను ప్రతిష్ఠితమైన దాన్ని నా ఇంటి నుండి తీసివేసి లేవీయులకు విదేశీయులకు, తండ్రిలేనివారికి విధవరాండ్రకు ఇచ్చాను. నేను మీ ఆజ్ఞలను ప్రక్కన పెట్టలేదు వాటిలో దేన్ని నేను మరచిపోలేదు. 14నేను దుఃఖంలో ఉన్నప్పుడు ప్రతిష్ఠితమైన దానిలోనిది ఏదీ తినలేదు, నేను అపవిత్రంగా ఉన్న సమయంలో అందులో ఏదీ తీసివేయలేదు, చనిపోయినవారి కోసం దాన్ని అర్పించలేదు.నేను నా దేవుడైన యెహోవాకు లోబడ్డాను; మీరు ఆజ్ఞాపించిన ప్రతిదీ నేను చేశాను. 15మీ పవిత్ర నివాసమైన ఆకాశం నుండి క్రిందికి చూడండి మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లుగా మీ ప్రజలైన ఇశ్రాయేలీయులను, మీరు మాకు ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించే ఈ భూమిని ఆశీర్వదించండి.”
యెహోవా ఆజ్ఞలను అనుసరించుట
16మీ దేవుడైన యెహోవా ఈ రోజున మీకాజ్ఞాపిస్తున్న ఈ శాసనాలు చట్టాలు మీరు పాటించాలి; మీ పూర్ణహృదయంతో, మీ ప్రాణమంతటితో మీరు జాగ్రత్తగా వాటిని పాటించాలి. 17మీరు ఈ రోజు యెహోవాయే మీ దేవుడని మీరు ఆయనకు విధేయులై నడుస్తారని, మీరు ఆయన శాసనాలను, ఆజ్ఞలను, చట్టాలను పాటిస్తారని, ఆయన మార్గంలో నడుస్తారని మీరు ప్రకటించారు. 18యెహోవా ఈ రోజున మీరు ఆయన ప్రజలని, ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు ఆయన స్వంత ప్రజలుగా ఉంటూ ఆయన ఆజ్ఞలన్నిటిని పాటించాలని ప్రకటించారు. 19ఆయన తాను చేసిన అన్ని దేశాల కంటే మిమ్మల్ని హెచ్చిస్తారని, అప్పుడు మీరు ప్రశంసలు, కీర్తి, గౌరవం పొందుకుంటారని, ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలుగా ఉంటారని ఆయన ప్రకటించారు.
Currently Selected:
ద్వితీయో 26: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.