ద్వితీయో 11
11
యెహోవాను ప్రేమించి ఆయనకు లోబడండి
1మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మీకు చెప్పేవాటన్నిటిని, ఆయన శాసనాలను, ఆయన చట్టాలను, ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాలి. 2మీ దేవుడైన యెహోవా క్రమశిక్షణను చూసింది, అనుభవించింది మీ పిల్లలు కాదని ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి: ఆయన మహిమను, ఆయన బలమైన హస్తాన్ని, ఆయన చాచిన చేయిని; 3ఈజిప్టులో, ఈజిప్టు రాజైన ఫరోకు అతని దేశమంతటికి ఆయన చేసిన అసాధారణ గుర్తులు; 4ఈజిప్టు సైన్యానికి, దాని గుర్రాలకు రథాలకు ఆయన చేసింది, వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్ర సముద్రపు నీటితో వారిని కప్పివేయడం, యెహోవా వారిపై నిత్య నాశనం ఎలా తెచ్చారో మీరు చూశారు. 5మీరు ఈ చోటికి చేరుకునేవరకు అరణ్యంలో ఆయన మీ కోసం ఏమి చేశారో చూసింది మీ పిల్లలు కాదు. 6ఆయన రూబేనీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములకు చేసిన దానిని అనగా ఇశ్రాయేలీయులందరి మధ్యలో భూమి నోరు తెరిచి వారిని వారు కుటుంబాలను వారి గుడారాలను వారికి చెందిన ప్రతి జీవిని మ్రింగివేసిన విధానాన్ని మీరు చూశారు. 7యెహోవా చేసిన ఈ గొప్ప కార్యాలన్నిటిని చూసింది మీ సొంత కళ్లు.
8కాబట్టి ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటిని పాటించండి, అప్పుడు మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటి వెళ్తున్న ఆ దేశంలోనికి వెళ్లడానికి బలం కలిగి ఉంటారు, 9తద్వార వారికి వారి సంతానానికి ఇస్తానని యెహోవా మీ పూర్వికులతో వాగ్దానం చేసిన దేశంలో అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు అధిక కాలం జీవిస్తారు. 10మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఈజిప్టు దేశం వంటిది కాదు; అక్కడ మీరు విత్తనాలు విత్తి కూరతోటలలో చేసినట్లు వాటికి కాళ్లతో నీరు పెట్టారు. 11మీరు యొర్దాను దాటి వెళ్లి స్వాధీనం చేసుకోబోయే దేశం ఆకాశపు వర్షాన్ని త్రాగే పర్వతాలు లోయలు ఉన్న దేశము. 12అది మీ దేవుడైన యెహోవా సంరక్షించే దేశము; సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దేవుడైన యెహోవా దృష్టి దాని మీద నిలిచి ఉంటుంది.
13కాబట్టి ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలకు నమ్మకంగా లోబడితే, మీరు మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలి. 14అప్పుడు మీ దేశంలో సకాలంలో తొలకరి కడవరి వర్షాలు కురిపిస్తాను. అప్పుడు మీరు ధాన్యాన్ని క్రొత్త ద్రాక్షరసాన్ని, ఒలీవ నూనెను సమకూర్చుకోవచ్చు. 15మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను; మీరు తిని తృప్తి చెందుతారు.
16జాగ్రత్తపడండి, లేదా మీరు మోసపోయి ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని పూజించి సేవిస్తారు. 17అప్పుడు యెహోవా కోపం మీమీద రగులుకొని ఆయన ఆకాశాన్ని మూసేస్తారు, అప్పుడు వాన కురవదు, భూమి పండదు, యెహోవా మీకు ఇవ్వబోయే ఆ మంచి దేశంలో ఉండకుండా మీరు త్వరలోనే నశించిపోతారు. 18ఈ నా మాటలు మీ మనస్సులో హృదయంలో ఉంచుకోండి; వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి. 19వాటిని మీ పిల్లలకు నేర్పించండి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు మీరు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి. 20మీ ఇంటి ద్వారబంధాల మీద ద్వారాల మీద వాటిని వ్రాయండి, 21తద్వార యెహోవా మీ పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో మీరు, మీ పిల్లలు ఎక్కువ రోజులు అనగా భూమిపై ఆకాశం ఉన్నంత కాలం మీరు జీవిస్తారు.
22మీరు పాటించాలని నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రతగా పాటిస్తే అనగా మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనను అంటిపెట్టుకుని ఉండాలి. 23అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జనాంగాలన్నిటిని వెళ్లగొడతారు. మీకంటే విస్తారమైన, బలమైన దేశాలను మీరు వెళ్లగొడతారు. 24మీరు అడుగుపెట్టే ప్రతి చోటు మీదే అవుతుంది: ఎడారి నుండి లెబానోను వరకు, యూఫ్రటీసు నది నుండి మధ్యధరా సముద్రం వరకు మీ సరిహద్దులు వ్యాపిస్తాయి. 25మీకు ఎదురుగా ఎవరు నిలబడలేరు. ఆయన మీకు వాగ్దానం చేసిన ప్రకారం మీ దేవుడైన యెహోవా మీరు వెళ్లే దేశమంతటికి మీరంటే వణుకును భయాన్ని పుట్టిస్తారు.
26చూడండి, ఈ రోజు నేను మీ ముందు దీవెనను శాపాన్ని ఉంచుతున్నాను. 27ఈ రోజు నేను మీకు ఇచ్చే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడితే మీకు దీవెన; 28మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడకుండా, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం. 29మీరు స్వాధీనం చేసుకోబోతున్న దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చేర్చిన తర్వాత, గెరిజీము పర్వతం మీద దీవెనను ఏబాలు పర్వతంమీద శాపాన్ని ప్రకటించాలి. 30మీకు తెలిసినట్లు, ఈ పర్వతాలు యొర్దాను అవతల సూర్యుడు అస్తమించే దిక్కుకు వెనుక మోరె లోని సింధూర వృక్షాల దగ్గర గిల్గాలు ప్రాంతంలో ఉన్న అరాబాలో నివసించే కనానీయుల సరిహద్దులో ఉన్నాయి. 31మీ దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోతున్న దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మీరు యొర్దాను నది దాటబోతున్నారు. మీరు దానిని స్వాధీనం చేసుకుని దానిలో నివసించినప్పుడు, 32ఈ రోజు నేను మీ ముందు ఉంచిన అన్ని శాసనాలను చట్టాలను తప్పనిసరిగా పాటించండి.
Currently Selected:
ద్వితీయో 11: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.