YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 21

21
పౌలు యెరూషలేముకు వచ్చుట
1మేము ఎఫెసు సంఘ పెద్దలను విడిచిపెట్టిన తర్వాత ఓడను ఎక్కి నేరుగా కోసు వెళ్లి, మరుసటిరోజు రొదు పట్టణానికి, ఆ తర్వాత అక్కడినుండి పతర చేరుకొన్నాము. 2అక్కడ ఫేనీకేకు వెళ్లే ఒక ఓడను చూసి దానిలో ఎక్కి బయలుదేరాము. 3కుప్ర కనపడగా దాని దక్షిణ వైపు నుండి సిరియాకు వెళ్లాము. తూరు పట్టణ తీరాన మేమున్న ఓడలోని సరుకులను దించవలసి వచ్చింది. 4కాబట్టి మేము అక్కడి శిష్యులను కలిసి వారితో ఏడు రోజులు ఉన్నాము. నీవు యెరూషలేముకు వెళ్లవద్దని ఆత్మ ద్వారా వారు పౌలును బ్రతిమలాడారు. 5మేము బయలుదేరే సమయం వచ్చినప్పుడు, మేము మా ప్రయాణాన్ని కొనసాగించాము. అప్పుడు వారందరు తమ భార్యా పిల్లలతో కలిసి పట్టణం బయటి వరకు మాతో కూడా వచ్చారు, మేము అందరం సముద్రపు తీరాన మోకరించి ప్రార్థించాము. 6మేము ఒకరికి ఒకరం వీడ్కోలు చెప్పిన తర్వాత ఓడను ఎక్కాము, వారు తమ ఇళ్ళకు తిరిగి వెళ్లారు.
7మేము తూరు పట్టణం నుండి మా ప్రయాణం కొనసాగించి తొలెమాయి పట్టణంలో దిగి అక్కడ ఉన్న సహోదర సహోదరీలను పలకరించి వారితో ఒక రోజు గడిపాము. 8మరుసటిరోజు బయలుదేరి కైసరయ ప్రాంతానికి చేరి, మొదట్లో ఎన్నుకున్న ఏడుగురిలో ఒకడైన ఫిలిప్పు అనే సువార్తికుని ఇంట్లో ఉన్నాము. 9అతనికి ప్రవచన వరం కలిగిన పెళ్ళికాని నలుగురు కుమార్తెలున్నారు.
10మేము అక్కడ చాలా రోజులు ఉన్నప్పుడు, యూదయ ప్రాంతం నుండి అగబు అనే ప్రవక్త వచ్చాడు. 11అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు నడికట్టును తీసుకుని దానితో తన చేతులను, కాళ్లను కట్టుకుని, “ ‘యెరూషలేములోని యూదా నాయకులు ఈ నడికట్టు కల వానిని ఈ విధంగా బంధించి యూదేతరుల చేతికి అప్పగిస్తారు’ అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు” అని అన్నాడు.
12ఈ మాట విన్న తర్వాత మేము, అక్కడ కూడిన ప్రజలు పౌలును యెరూషలేముకు వెళ్లవద్దని బ్రతిమాలాము. 13అప్పుడు పౌలు, “ఎందుకు మీరు ఏడుస్తూ నా గుండెను బద్దలు చేస్తున్నారు? ప్రభువైన యేసు పేరు కోసం నేను బందీని అవ్వడమే కాదు యెరూషలేములో చనిపోడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని చెప్పాడు. 14అతడు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు కాబట్టి, “దేవుని చిత్తం జరుగును గాక” అని మౌనంగా ఉండిపోయాము.
15ఆ తర్వాత, మేము యెరూషలేముకు బయలుదేరాము. 16కైసరయ ప్రాంతం నుండి మాతో కొందరు శిష్యులు వెంట వచ్చి, మొదటి శిష్యులలో ఒకడైన కుప్రకు చెందిన మ్నాసోను ఇంటికి తీసుకెళ్లి, అక్కడ మేము ఉండడానికి ఏర్పాట్లు చేశారు.
యెరూషలేము చేరుకొన్న పౌలు
17మేము యెరూషలేముకు చేరిన తర్వాత, సహోదరి సహోదరులు మమ్మల్ని సంతోషంగా చేర్చుకున్నారు. 18మరుసటిరోజు పౌలు మేము కలిసి యాకోబును చూడటానికి వెళ్లాము, అక్కడ సంఘ పెద్దలందరు ఉన్నారు. 19పౌలు వారిని పలకరించి, యూదేతరుల మధ్యలో తన పరిచర్య ద్వారా దేవుడు చేసిన కార్యాలన్నింటిని వివరంగా తెలియజేశాడు.
20వారు వాటిని విని దేవుని స్తుతించారు. ఆ తర్వాత వారు పౌలుతో, “సహోదరుడా, చూడు, యూదులలో ఎన్ని వేలమంది విశ్వసించారో, వారందరు ధర్మశాస్త్రం కోసం ఆసక్తి కలిగి ఉన్నారు. 21యూదేతరుల మధ్యలో నివసిస్తున్న యూదులకు వారి పిల్లలకు సున్నతి చేయించవద్దని, మన ఆచారాల ప్రకారం జీవించవద్దని, మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నావని వారు తెలియజేశారు. 22నీవు ఇక్కడ వచ్చావన్న సంగతి వారు ఖచ్చితంగా వింటారు. 23కాబట్టి మేము చెప్పినట్లు నీవు చేయాలి. అది ఏంటంటే, మాతో నలుగురు మ్రొక్కుబడి చేసుకొన్నవారు ఉన్నారు. 24వారిని తీసుకెళ్లి, వారి శుద్ధీకరణ సంస్కారంలో పాల్గొని, వారు తమ తల వెంట్రుకలను తీయించుకోవడానికి అయ్యే ఖర్చులను భరించు. అప్పుడు నీ గురించి తెలిసినదానిలో సత్యం లేదని, నీవు కూడా ధర్మశాస్త్రానికి లోబడే జీవిస్తున్నావని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. 25అయితే యూదేతరుల విశ్వాసులు, ‘విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి’ అనే మా నిర్ణయాన్ని వారికి వ్రాసి తెలిపాం” అన్నారు.
26మరుసటిరోజు పౌలు ఆ మనుష్యులను తీసుకెళ్లి వారితో తాను కూడా శుద్ధి చేసుకున్నాడు. శుద్ధీకరణ రోజులు పూర్తియైన తర్వాత అందరి కోసం కానుకలను చెల్లిస్తానని చెప్పడానికి అతడు దేవాలయంలోనికి వెళ్లాడు.
పౌలు బంధించబడుట
27ఏడు రోజులు పూర్తి కావచ్చినప్పుడు, ఆసియా ప్రాంతం నుండి వచ్చిన కొందరు యూదులు దేవాలయంలో పౌలును చూసి, జనసమూహాన్ని రెచ్చగొట్టి అతన్ని పట్టుకున్నారు. 28వారు బిగ్గరగా, “తోటి ఇశ్రాయేలీయులారా, మాకు సహాయం చేయండి! ఈ వ్యక్తి మన ప్రజలకు మన ధర్మశాస్త్రానికి ఈ స్థలానికి వ్యతిరేకంగా ప్రతిచోట అందరికి బోధిస్తున్నాడు. అంతేకాక గ్రీసుదేశస్థులను ఈ దేవాలయంలోనికి తీసుకువచ్చి, ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేశాడు” అని కేకలు వేశారు. 29వారు అంతకుముందు ఎఫెసీయుడైన త్రోఫిముతో పౌలును పట్టణంలో చూశారు, కాబట్టి పౌలు అతన్ని దేవాలయంలోనికి తెచ్చాడని భావించారు.
30పట్టణం అంతా ఆందోళన రేగింది, అన్ని వైపుల నుండి ప్రజలు పరుగెత్తికొని వచ్చారు. వారు పౌలును పట్టుకుని, అతన్ని దేవాలయం నుండి బయటకు లాగి, వెంటనే దేవాలయ తలుపులు మూసేసారు. 31వారు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, యెరూషలేము పట్టణమంతా ఆందోళనగా మారిందనే వార్త రోమా ప్రధాన సైన్యాధికారికి చేరింది. 32అతడు వెంటనే కొందరు అధికారులను, సైనికులను వెంటపెట్టుకుని ఆ గుంపు దగ్గరకు పరుగెత్తుకొని వచ్చాడు. ఆ ఆందోళనకారులు అధిపతిని అతని సైనికులను చూసి, పౌలును కొట్టడం ఆపివేశారు.
33అధిపతి వచ్చి అతన్ని పట్టుకుని, రెండు గొలుసులతో బంధించమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత, “అతడు ఎవరు? ఏమి చేశాడు?” అని అడిగాడు. 34ఆ గుంపులో కొందరు ఒకదాని గురించి కేకలు వేస్తుంటే, మరికొందరు మరొకదాని గురించి కేకలు వేశారు, ఆ గందరగోళం వలన ఆ అధిపతికి నిజం ఏమిటని స్పష్టం కాలేదు, కాబట్టి పౌలును సైనిక కోటలోనికి తీసుకుని వెళ్లమని ఆజ్ఞాపించాడు. 35పౌలు మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు, అతనిపై ప్రజలు చాలా ఎక్కువగా దాడి చేస్తుండడంతో సైనికులు అతన్ని మోసుకొనివెళ్లారు. 36అక్కడ ఉన్న గుంపు, “అతన్ని చంపివేయండి!” అని మరి ఎక్కువగా కేకలువేస్తూ వారి వెంటబడ్డారు.
పౌలు గుంపుతో మాట్లాడుట
37సైనికులు పౌలును సైనిక కోటలోనికి తీసుకెళ్తున్నప్పుడు, పౌలు ఆ అధిపతిని, “నేను మీతో ఒక విషయం చెప్పడానికి అనుమతి ఉందా?” అని అడిగాడు.
అందుకు ఆ అధికారి, “నీకు గ్రీకుభాష తెలుసా?” అన్నాడు. 38“ఇంతకుముందు తిరుగుబాటును ఆరంభించి నాలుగు వేలమంది విప్లవకారులను అరణ్యంలోనికి నడిపించిన ఈజిప్టు వాడవు నీవేనా?” అని అడిగాడు.
39అందుకు పౌలు, “నేను కిలికియ ప్రాంతంలోని తార్సు పట్టణానికి చెందిన యూదుడను, ఆ గొప్ప పట్టణ పౌరుడిని. అయితే దయచేసి ప్రజలతో నన్ను మాట్లాడ నివ్వండి!” అన్నాడు.
40అధిపతి అనుమతితో, పౌలు మెట్ల మీద నిలబడి ప్రజలకు సైగ చేశాడు. వారందరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, హెబ్రీ భాషలో వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for అపొస్తలుల కార్యములు 21