1 తిమోతి పత్రిక 4
4
1చివరి దినాల్లో కొందరు విశ్వాసాన్ని విడిచిపెట్టి మోసపరచే ఆత్మలను, దయ్యాలచే బోధించబడే వాటిని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 2కాలుతున్న ఇనుము చేత కాల్చబడిన మనస్సాక్షి కలిగిన వంచకులైన అబద్ధికుల నుండి అలాంటి బోధలు వస్తాయి. 3వారు ప్రజలను పెళ్ళి చేసుకోవద్దని నిషేధిస్తారు, సత్యాన్ని తెలుసుకున్నవారు, నమ్మినవారు కృతజ్ఞతా పూర్వకంగా తినడానికి దేవుడు సృజించిన ఆహారపదార్థాలలో కొన్నిటిని తినకూడదని వారు ఆజ్ఞాపిస్తారు. 4కాని, దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే, కాబట్టి మీరు కృతజ్ఞతలు చెల్లించి తీసుకుంటే దేన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు. 5ఎందుకంటే దేవుని వాక్యం వలన కృతజ్ఞతా ప్రార్థనల వలన అది పవిత్రపరచబడింది.
6ఈ విషయాలను సహోదరి సహోదరులకు తెలియజేసినట్లైతే, నీవు అనుసరించిన విశ్వాస సంబంధమైన సత్యాలు మంచి బోధలలో పోషించబడి క్రీస్తు యేసుకు మంచి సేవకునిగా ఉంటావు. 7నిరాధారమైన కల్పితకథలకు, ముసలమ్మల ముచ్చట్లకు దూరంగా ఉండి, దైవభక్తిలో నీకు నీవే శిక్షణ ఇచ్చుకో. 8శారీరక వ్యాయామం వలన కొంతవరకు లాభం కలుగుతుంది, అయితే ప్రస్తుత జీవితానికి రాబోవు జీవితానికి సంబంధించిన వాగ్దానంతో కూడిన దైవభక్తి అన్ని విషయాల్లో విలువైనది. 9ఈ మాట నమ్మదగింది పూర్తిగా అంగీకరించదగింది. 10అందుకే మనుష్యులందరికి, మరి ముఖ్యంగా విశ్వసించిన వారందరికి రక్షకుడైన సజీవ దేవునిలో మా నిరీక్షణ ఉంచి, మేము ప్రయాసపడుతూ గట్టిగా కృషి చేస్తున్నాము.
11ఈ విషయాలను ఆజ్ఞాపించి బోధించు. 12నీవు యవ్వనస్థుడవని ఎవరు నిన్ను చులకన చేయకుండా ఉండడానికి నీ మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా నడుచుకో. 13నేను అక్కడికి వచ్చేవరకు నీవు సంఘంలో పరిశుద్ధ వాక్యాన్ని బిగ్గరగా చదువుతూ, హెచ్చరిస్తూ, బోధించడం మానకుండ జాగ్రత్తగా చూసుకో. 14సంఘపెద్దలు తమ చేతులను నీపై ఉంచినప్పుడు ప్రవచనం ద్వారా నీకు అనుగ్రహించబడిన వరాన్ని నిర్లక్ష్యం చేయకు.
15ఈ విషయాల్లో నీవు జాగ్రత్తగా ఉండు; నీ అభివృద్ధి అందరికి స్పష్టంగా కనబడేలా నీవు వాటిని పూర్తిగా ఆచరించు. 16నీ జీవితాన్ని ఉపదేశాన్ని జాగ్రత్తగా చూసుకో. ఈ విధంగా చేస్తే, నిన్ను నీ బోధలు వినేవారిని కూడా నీవు రక్షించుకుంటావు.
Currently Selected:
1 తిమోతి పత్రిక 4: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.