YouVersion Logo
Search Icon

1 సమూయేలు 14

14
1ఆ రోజు సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పకుండా, తన ఆయుధాలను మోసే యువకుని పిలిచి, “అవతల ఉన్న ఫిలిష్తీయుల పహారా కాచే సైన్యాన్ని చంపడానికి వెళ్దాం రా” అని అన్నాడు.
2సౌలు గిబియా పొలిమేరల్లో మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద ఉన్నాడు, అతనితో పాటు సుమారు ఆరువందలమంది ఉన్నారు. 3అహీయా ఏఫోదు ధరించుకొని వారి మధ్య ఉన్నాడు. అతడు షిలోహులో యెహోవాకు యాజకుడైన ఏలీ కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదుకు సోదరుడైన అహీటూబుకు పుట్టాడు. యోనాతాను వెళ్లిన సంగతి ఎవరికీ తెలియలేదు.
4ఫిలిష్తీయుల సైనిక స్థావరాలను చేరడానికి యోనాతాను వెళ్లవలసిన దారికి ఇరువైపులా అటు ఒక చిన్న కొండ ఇటు ఒక చిన్న కొండ ఉన్నాయి. వాటిలో ఒకదాని పేరు బొసేసు రెండవ దాని పేరు సెనే. 5మిక్మషుకు ఉత్తరం వైపు ఒక కొండ శిఖరం, గెబాకు దక్షిణం వైపు రెండవ కొండ శిఖరం ఉన్నాయి.
6యోనాతాను తన ఆయుధాలను మోసే యువకునితో, “ఈ సున్నతిలేనివారి సైనిక స్థావరాల మీదికి వెళ్దాం రా, బహుశా యెహోవా మన కోసం కార్యం చేయవచ్చు. ఎక్కువ మంది నుండైనా కొద్దిమంది నుండైనా రక్షించడానికి యెహోవాకు ఏది అడ్డు కాదు” అని అన్నాడు.
7అందుకు ఆ యువకుడు, “మీ మనస్సులో ఏముందో అది చెయ్యండి; పదండి, మీ నిర్ణయమేదైనా నేను మీతోనే ఉంటాను” అన్నాడు.
8అప్పుడు యోనాతాను, “మనం వారి దగ్గరకు వెళ్లి వారు మనలను చూసేలా చేద్దాము. 9వారు మనలను చూసి, మేము మీ దగ్గరకు వచ్చేవరకు అక్కడ ఉండమని చెప్తే, వారి దగ్గరకు వెళ్లకుండా మనమున్న చోటనే ఉందాము. 10మా దగ్గరకు రండని వారు చెప్తే మనం పైకి ఎక్కుదాము. ఎందుకంటే యెహోవా వారిని మన చేతికి అప్పగించారనడానికి మనకు అదే గుర్తు” అన్నాడు.
11వీరిద్దరు కావాలనే ఫిలిష్తీయుల సైనిక స్థావరాలకు కనిపించారు. అప్పుడు ఫిలిష్తీయులు, “చూడండి, తాము దాక్కున్న గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వస్తున్నారు” అన్నారు. 12సైనిక స్థావరంలో నుండి ఒకడు యోనాతానును అతని ఆయుధాలను మోసేవాన్ని పిలిచి, “మీరైతే పైకి రండి, మీకు పాఠం నేర్పిస్తాం” అన్నాడు.
యోనాతాను తన ఆయుధాలను మోసేవానితో, “నా వెనుకనే నీవు పైకి ఎక్కు; యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించారు” అని చెప్పాడు.
13యోనాతాను, అతని ఆయుధాలను మోసేవాడు తమ చేతులు కాళ్లను ఉపయోగించి పైకి ఎక్కారు. యోనాతాను దెబ్బకు ఫిలిష్తీయులు పడిపోగా అతని వెనుక వస్తున్న అతని ఆయుధాలను మోసేవాడు వారిని చంపాడు. 14యోనాతాను, అతని ఆయుధాలను మోసేవాడు చేసిన ఆ మొదటి దాడిలో దాదాపుగా ఇరవైమంది చనిపోయారు; అర ఎకరం నేలలో అది జరిగింది.
ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను వెళ్లగొట్టుట
15శిబిరంలో పొలంలో ఉన్న సైన్యమంతటిలో భయాందోళనలు అలుముకున్నాయి. సైనిక స్థావరంలో ఉన్నవారు, దోచుకునేవారు భయపడ్డారు, భూమి కంపించింది. అది దేవుని వలన కలిగిన భయము.
16బెన్యామీనులోని గిబియాలో ఉన్న సౌలు గూఢాచారులు సైన్యం అన్నివైపులకు చెదిరిపోవడం చూశారు. 17సౌలు తనతో ఉన్న ప్రజలతో, “మన బలగంలో ఎవరు లేరో చూడండి” అన్నాడు. యోనాతాను, అతని ఆయుధాలను మోసేవాడు లేరని వారు తెలుసుకున్నారు.
18సౌలు అహీయాతో, “దేవుని మందసాన్ని ఇక్కడకు తీసుకురా” అని చెప్పాడు. ఆ సమయంలో దేవుని మందసం ఇశ్రాయేలీయుల దగ్గరే ఉంది. 19సౌలు యాజకునితో మాట్లాడుతుండగా ఫిలిష్తీయుల శిబిరంలో గందరగోళం మరి ఎక్కువ అయ్యింది. కాబట్టి సౌలు యాజకునితో, “నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పాడు.
20సౌలు, అతని దగ్గర ఉన్నవారంతా కలిసి యుద్ధానికి వెళ్లారు. అక్కడ ఫిలిష్తీయులు ఎంతో కలవరపడి తమ కత్తులతో ఒకరినొకరు చంపుకోవడం చూశారు. 21అంతకుముందు ఫిలిష్తీయుల స్వాధీనంలో ఉన్నవారు, వారితో పాటు శిబిరానికి వచ్చిన హెబ్రీయులు సౌలు యోనాతానులతో ఉన్న ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చి వారితో కలిసిపోయారు. 22అంతేకాక ఎఫ్రాయిం కొండ ప్రాంతంలో దాక్కున్న ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు పారిపోయారని విని వారిని తరమడానికి యుద్ధంలో చేరారు. 23ఆ రోజే యెహోవా ఇశ్రాయేలీయులను రక్షించారు, యుద్ధం బేత్-ఆవెను అవతల వరకు సాగింది.
తేనె తిన్న యోనాతాను
24“సాయంత్రం అయ్యేవరకు, నేను నా శత్రువుల మీద పగతీర్చుకునే వరకు ఎవరైనా భోజనం చేస్తే వారు శపించబడతారు” అని సౌలు ప్రజలచేత ప్రమాణం చేయించాడు. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలీయులందరు ఏమీ తినలేదు.
25సైన్యమంతా అడవిలోకి వచ్చినప్పుడు అక్కడ నేల మీద తేనె కనపడింది. 26వారు ఆ అడవిలోకి వెళ్లగా తేనె ధారలుగా కారుతూ ఉంది కాని ప్రజలు తాము చేసిన ప్రమాణానికి భయపడి ఒకరు కూడా చేయి నోటిలో పెట్టుకోలేదు. 27అయితే యోనాతాను తన తండ్రి ప్రజలతో చేయించిన ప్రమాణాన్ని వినలేదు కాబట్టి తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని అంచును తేనెతెట్టెలో ముంచి తన చేయి నోటిలో పెట్టుకున్నప్పుడు అతని కళ్లు ప్రకాశించాయి.#14:27 కళ్లు ప్రకాశించాయి అంటే శక్తి నూతన పరచబడినది 28అప్పుడు ఒక సైనికుడు అతనితో, “ ‘ఈ రోజు భోజనం చేసినవారు శపించబడతారు’ అని మీ తండ్రి సైన్యంతో ఖచ్చితమైన ప్రమాణాన్ని చేయించాడు; అందుకే ప్రజలంతా అలసిపోయి ఉన్నారు” అని చెప్పాడు.
29అందుకు యోనాతాను, “దేశం కష్టపడడానికి నా తండ్రి కారణమయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్లు ఎంత ప్రకాశిస్తున్నాయో చూడు. 30ప్రజలు తమ శత్రువుల నుండి దోచుకున్న దానిలో నుండి కొంచెం తిని ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు మనం ఇంకా ఎక్కువ మంది ఫిలిష్తీయులను జయించేవారం కదా!” అన్నాడు.
31ఆ రోజు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు చంపి చాలా అలసిపోయారు. 32ప్రజలు దోపుడుసొమ్ము మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను దూడలను తీసుకుని నేల మీద పడవేసి వధించి రక్తంతో కలిపి తిన్నారు. 33అప్పుడు ఒకడు సౌలుతో, “ప్రజలు రక్తంతో ఉన్న మాంసాన్ని తిని యెహోవా దృష్టిలో పాపం చేస్తున్నారు” అని చెప్పాడు.
సౌలు, “మీరు విశ్వాసఘాతకులయ్యారు; ఒక పెద్ద రాయిని నా దగ్గరకు దొర్లించి తీసుకురండి.” 34తర్వాత అతడు, “మీరు ప్రజల మధ్యకు వెళ్లి, ‘మీలో ప్రతి ఒక్కరు తమ ఎద్దులను గొర్రెలను నా దగ్గరకు తీసుకువచ్చి ఇక్కడే వధించి వాటిని తినాలి. రక్తంతో ఉన్న మాంసం తిని యెహోవా దృష్టిలో పాపం చేయకూడదని వారితో చెప్పండి’ ” అని చెప్పి కొందరిని పంపించాడు.
కాబట్టి ప్రజలందరు ఆ రాత్రి తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించారు. 35అప్పుడు సౌలు యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టించాడు. అతడు యెహోవాకు కట్టించిన మొదటి బలిపీఠం అదే.
36ఆ తర్వాత సౌలు, “మనం ఈ రాత్రి ఫిలిష్తీయులను వెంటాడుతూ వెళ్లి తెల్లవారే వరకు వారిని దోచుకొని, వారిలో ఎవరూ ప్రాణాలతో మిగులకుండా చేద్దాం రండి” అన్నాడు.
అందుకు వారు, “నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి” అన్నారు.
కాని యాజకుడు, “దేవుని దగ్గర విచారణ చేద్దాం” అన్నాడు.
37సౌలు, “నేను ఫిలిష్తీయుల వెనుక వెంటాడుతూ వెళ్లితే నీవు వారిని ఇశ్రాయేలీయు చేతికి అప్పగిస్తావా?” అని దేవుని అడిగాడు కాని దేవుడు అతనికి ఆ రోజు సమాధానం ఇవ్వలేదు.
38కాబట్టి సౌలు, “సైన్యాధిపతులు నా దగ్గరకు రండి, ఈ రోజు ఏ పాపం జరిగిందో మనం తెలుసుకుందాము. 39నా కుమారుడైన యోనాతాను వలన అది జరిగినా సరే వాడు తప్పక మరణించాలని ఇశ్రాయేలీయుల ప్రాణాలను రక్షించు సజీవుడైన యెహోవా పేరిట నేను ప్రమాణం చేస్తున్నాను” అన్నాడు. కాని ప్రజల్లో ఎవరు ఒక్క మాటకూడా మాట్లాడలేదు.
40అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరితో, “మీరందరు ఆ ప్రక్కన నిలబడండి; నేను నా కుమారుడైన యోనాతాను ఈ ప్రక్కన నిలబడతాం” అన్నాడు.
అందుకు వారు, “నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి” అన్నారు.
41అప్పుడు సౌలు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ఈ రోజు మీ దాసునికి నీవెందుకు సమాధానం చెప్పలేదు? ఒకవేళ నాలోగాని నా కుమారుడైన యోనాతానులో గాని లోపం ఉంటే ఊరీముతో, ఇశ్రాయేలు ప్రజల్లో దోషం ఉంటే తుమ్మీముతో జవాబు చెప్పండి” అని ప్రార్థించాడు. అప్పుడు సౌలు పేరిట యోనాతాను పేరిట చీటి వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలు నిర్దోషులుగా తప్పించుకున్నారు. 42“నాకు నా కుమారుడైన యోనాతానుకు చీట్లు వేయండి” అని సౌలు ఆజ్ఞ ఇవ్వగా యోనాతాను పేరిట చీటి వచ్చింది.
43అప్పుడు సౌలు, “నీవు ఏమి చేశావో నాకు చెప్పు” అని యోనాతానుతో అన్నాడు.
అందుకు యోనాతాను, “నా చేతికర్ర అంచుతో కొంచెం తేనె రుచి చూశాను. కాబట్టి నేను ఖచ్చితంగా చనిపోవలసిందే” అన్నాడు.
44అందుకు సౌలు, “యోనాతానూ, నీవు ఖచ్చితంగా చనిపోవాలి లేకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షిస్తారు” అన్నాడు.
45అయితే ప్రజలు సౌలుతో, “ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప విడుదల ఇచ్చిన యోనాతాను చనిపోవాలా? అలా ఎన్నటికి జరుగకూడదు. దేవుని సహాయంతోనే అతడు ఈ రోజు మనకు విజయాన్ని అందించాడు. సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అతని తలవెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదు” అని చెప్పి యోనాతాను మరణించకుండా ప్రజలు అతన్ని రక్షించారు.
46అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరమడం మానివేయగా వారు తమ స్వదేశానికి వెళ్లిపోయారు.
47సౌలు ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి అధికారం పొందిన తర్వాత, అన్నివైపులా ఉన్న వారి శత్రువులతో అనగా, మోయాబీయులతో అమ్మోనీయులతో ఎదోమీయులతో సోబాదేశపు రాజులతో ఫిలిష్తీయులతో అతడు యుద్ధం చేశాడు. ఎవరి మీదికి అతడు యుద్ధానికి వెళ్లాడో వారినందరిని ఓడించాడు. 48అతడు ధైర్యంగా పోరాడి అమాలేకీయులను హతం చేసి ఇశ్రాయేలీయులను దోచుకున్నవారి చేతిలో నుండి వారిని విడిపించాడు.
సౌలు కుటుంబం
49సౌలు కుమారుల పేర్లు యోనాతాను, ఇష్వీ, మల్కీ-షూవ. అతని పెద్దకుమార్తె పేరు మేరబు చిన్నదాని పేరు మీకాలు. 50సౌలు భార్యపేరు అహీనోయము. ఈమె అహిమయస్సు కుమార్తె. సౌలు సేనాధిపతి పేరు అబ్నేరు. అతడు నేరు కుమారుడు. నేరు సౌలు చిన్నాన్న. 51సౌలు తండ్రి కీషు, అబ్నేరు తండ్రి నేరు ఇద్దరూ అబీయేలు కుమారులు.
52సౌలు జీవించినంత కాలం ఫిలిష్తీయులతో తీవ్రమైన యుద్ధం జరుగుతూనే ఉంది. సౌలు తాను చూసిన బలవంతులను ధైర్యవంతులను తీసుకువచ్చి తనకు సేవ చేయడానికి పెట్టుకునేవాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in