YouVersion Logo
Search Icon

1 సమూయేలు 12

12
సమూయేలు వీడ్కోలు మాటలు
1అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో, “మీరు నాతో చెప్పిన వాటన్నిటిని నేను విని మీమీద ఒకరిని రాజుగా నియమించాను. 2మిమ్మల్ని ముందుండి నడిపించడానికి మీకు ఒక రాజు ఉన్నాడు. నేనైతే తలనెరిసి ముసలివాడినయ్యాను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. చిన్ననాటి నుండి ఈ రోజు వరకు నేను మిమ్మల్ని నడిపించాను. 3ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎవరి ఎద్దునైనా తీసుకున్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకున్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధ పెట్టానా? న్యాయాన్ని చూడకుండ కళ్లు మూసుకోవడానికి ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా? నేను అలా చేసి ఉంటే యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వారు నా మీద సాక్ష్యం చెప్పండి, అప్పుడు నేను మీకు వాటిని తిరిగి ఇచ్చేస్తాను” అన్నాడు.
4అందుకు వారు, “నీవు మాకు ఏ అన్యాయం చేయలేదు ఏ బాధ కలిగించలేదు; ఎవరి దగ్గర నుండి నీవు దేన్ని తీసుకోలేదు” అని చెప్పారు.
5అప్పుడు సమూయేలు వారితో, “అటువంటిది నా దగ్గర ఏదీ మీకు దొరకదని యెహోవా ఆయన అభిషేకం చేయించిన వాడు ఈ రోజు మీమీద సాక్షులుగా ఉన్నారు” అన్నాడు.
“యెహోవాయే సాక్షి” అని వారు జవాబిచ్చారు.
6అప్పుడు సమూయేలు ప్రజలతో ఇలా అన్నాడు, “మోషేను అహరోనును నియమించి మీ పూర్వికులను ఈజిప్టు దేశంలో నుండి తీసుకువచ్చింది యెహోవాయే గదా. 7కాబట్టి యెహోవా మీకు మీ పూర్వికులకు చేసిన నీతి కార్యాలను బట్టి యెహోవా సన్నిధిలో నేను మీతో వాదించడానికి మీరు ఇక్కడే ఉండండి.
8“యాకోబు ఈజిప్టుకు వచ్చిన తర్వాత, వారు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టగా యెహోవా మోషే అహరోనులను పంపారు. వారు మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చి ఈ స్థలంలో స్థిరపరిచారు.
9“అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు; ఆయన వారిని హాసోరు సేనాధిపతియైన సీసెరా చేతికి ఫిలిష్తీయుల చేతికి మోయాబు రాజు చేతికి అప్పగించినప్పుడు వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. 10అప్పుడు వారు, ‘మేము యెహోవాను వదిలిపెట్టి బయలు, అష్తారోతు ప్రతిమలను పూజించి పాపం చేశాము. మా శత్రువుల చేతిలో నుండి మీరు మమ్మల్ని విడిపించండి, మేము మిమ్మల్ని సేవిస్తాం’ అని యెహోవాకు మొరపెట్టారు. 11అప్పుడు యెహోవా యెరుబ్-బయలు,#12:11 యెరుబ్-బయలు అంటే గిద్యోను బెదాను,#12:11 బెదాను కొ. ప్రా. ప్ర.లలో బారాకు యెఫ్తా సమూయేలు#12:11 సమూయేలు కొ. ప్రా. ప్ర. లలో సంసోను అనే వారిని పంపి, మీ చుట్టూ ఉన్న మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడం వలన మీరు నిర్భయంగా నివసిస్తున్నారు.
12“అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి రావడం మీరు చూసినప్పుడు, మీ దేవుడైన యెహోవా మీకు రాజుగా ఉన్నప్పటికీ, ‘ఆయన కాదు, మమ్మల్ని పాలించడానికి ఒక రాజు మాకు కావాలని’ మీరు నాతో చెప్పారు. 13కాబట్టి మీరు అడిగిన మీరు ఎంచుకున్న రాజు ఇక్కడ ఉన్నాడు. యెహోవా ఇతనిని మీమీద రాజుగా నిర్ణయించారు. 14మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనకు లోబడి ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా మీరు మిమ్మల్ని పరిపాలించే రాజు మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మీరు వృద్ధిచెందుతారు. 15అలా కాకుండా మీరు యెహోవాకు లోబడకుండా ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే యెహోవా హస్తం మీ పూర్వికులకు వ్యతిరేకంగా ఉన్నట్లే మీకు కూడా వ్యతిరేకంగా ఉంటుంది.
16“మీ కళ్ళెదుట యెహోవా జరిగించే ఈ గొప్ప పనులను మీరు నిలబడి చూడండి. 17గోధుమ కోతకాలం ఇది కాదా? ఉరుములు వర్షం పంపమని నేను యెహోవాను వేడుకుంటున్నాను. అప్పుడు మీరు రాజును ఏర్పాటు చేయమని అడిగి యెహోవా దృష్టిలో ఎంత పెద్ద పాపం చేశారో మీరు గ్రహిస్తారు.”
18సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములను వర్షాన్ని పంపారు. అప్పుడు ప్రజలందరు యెహోవాకు సమూయేలుకు ఎంతో భయపడ్డారు.
19ప్రజలందరు సమూయేలుతో, “మేము రాజు కావాలని అడిగి మా పాపాలన్నిటి కంటే ఎక్కువ చెడు చేశాం కాబట్టి మేము చనిపోకుండా నీ సేవకులమైన మాకోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి” అన్నారు.
20అప్పుడు సమూయేలు ప్రజలతో, “భయపడకండి, మీరు ఈ చెడు చేశారనేది నిజమే కాని యెహోవాను విడిచిపెట్టకుండా మీ పూర్ణహృదయంతో యెహోవాను సేవించండి. 21వ్యర్థమైన విగ్రహాలవైపు తిరుగకండి. అవి మీకు ఏ మేలు చేయలేవు, మిమ్మల్ని విడిపించలేవు ఎందుకంటే అవి పనికిరాని విగ్రహాలు. 22యెహోవా మిమ్మల్ని తన సొంత ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి తన గొప్ప నామం కోసం యెహోవా తన ప్రజలను విడిచిపెట్టరు. 23నాకైతే, నేను మీ కోసం ప్రార్ధన చేయడంలో విఫలమవ్వడం వలన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినవాడనవుతాను. అది నాకు దూరమవ్వాలి. మంచిదైన సరియైన మార్గాన్ని నేను మీకు బోధిస్తాను. 24అయితే మీరు ఖచ్చితంగా యెహోవా పట్ల భయభక్తులు కలిగి నమ్మకంగా మీ పూర్ణహృదయంతో ఆయనను సేవించాలి. ఆయన మీ కోసం చేసిన గొప్ప పనులను జ్ఞాపకం చేసుకోండి. 25అయినప్పటికీ మీరు చెడు చేయడం కొనసాగిస్తే మీరు, మీ రాజు నాశనమవుతారు.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for 1 సమూయేలు 12