YouVersion Logo
Search Icon

రోమా 8

8
ఆత్మ ద్వారా జీవము
1కాబట్టి, ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నారో వారికి శిక్షావిధి లేదు, 2ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని అనుగ్రహించే ఆత్మ నియమం మిమ్మల్ని#8:2 గ్రీకులో ఏకవచనము; కొన్ని ప్రతులలో నన్ను పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది. 3శరీరాన్ని#8:3 శరీరాన్ని సూచించే గ్రీకు పదం మానవుల పాపస్ధితిని తెలియచేస్తుంది. బట్టి ధర్మశాస్త్రం బలహీనమై దేన్ని చేయడానికి శక్తిహీనంగా ఉండిందో, దాన్ని చేయడానికి దేవుడు పాపపూరితమైన శరీర రూపంలో పాపపరిహారార్థ బలిగా ఉండడానికి తన సొంత కుమారున్ని పంపించారు. అప్పుడు ఆయన శరీరంలో ఉన్న పాపానికి శిక్ష విధించారు, 4శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించే మనలో ధర్మశాస్త్రం యొక్క నీతినియమాలు నెరవేరబడాలని ఇలా జరిగింది.
5శరీరానుసారంగా జీవించేవారి మనస్సు శారీరక ఆశలపైనే ఉంటుంది. కాని ఆత్మానుసారంగా జీవించేవారి మనస్సు ఆత్మ సంబంధమైన ఆశలపైన ఉంటుంది. 6శరీరంచే పాలించబడే మనస్సు మరణము, కాని ఆత్మచే పాలించబడే మనస్సు జీవం మరియు సమాధానమై ఉన్నది. 7శరీరంచే పాలించబడే మనస్సు దేవునికి విరుద్ధమైనది; అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండదు, దాని ప్రకారం నడుచుకోదు. 8శరీరం యొక్క యేలుబడిలో ఉన్నవారు దేవుని స్తుతించలేరు.
9అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ ఆధీనంలో ఉంటారు, కనుక శరీరం యొక్క యేలుబడిలో ఉండరు. క్రీస్తు ఆత్మ లేనివారు, క్రీస్తుకు చెందినవారు కారు. 10క్రీస్తు మీలో ఉన్నట్లైతే పాపాన్ని బట్టి మీ శరీరం మరణించినా, నీతిని బట్టి ఆత్మ జీవిస్తుంది#8:10 జీవిస్తుంది లేదా పాపం వలన మీ శరీరం మరణించినా మీ ఆత్మ జీవించి ఉండును. 11యేసును మరణం నుండి సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, క్రీస్తును మరణం నుండి సజీవంగా లేపిన ఆయన, నాశనమయ్యే మీ శరీరాలకు కూడా జీవాన్ని ఇవ్వగలడు, ఎందుకంటే ఆయన ఆత్మ మీలో నివసిస్తున్నాడు.
12కాబట్టి సహోదరి సహోదరులారా, మనకు ఒక బాధ్యత ఉంది, మనం దాని ప్రకారం జీవించాలి, కాని అది శరీరానుసారమైనది కాదు. 13మీరు శరీరానుసారంగా జీవిస్తే, మీరు మరణిస్తారు, కాని ఒకవేళ ఆత్మ ద్వారా శరీర సంబంధమైన చెడ్డక్రియలను చంపివేస్తే, మీరు బ్రతుకుతారు.
14ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. 15మీరు మరలా భయంలో జీవించడానికి, మీరు పొందిన ఆత్మ మిమ్మల్ని బానిసలుగా చేయదు కాని మీరు పొందిన ఆత్మ ద్వారా దత్తపుత్రులుగా చేయబడతారు, అప్పుడు ఆయన ద్వారా మనం “అబ్బా, తండ్రీ” అని మొరపెడుతున్నాం. 16మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు. 17మనం పిల్లలమైతే వారసులం అవుతాము అంటే దేవుని వారసులం; క్రీస్తు మహిమను మనం కూడా పొందేలా ఆయన శ్రమల్లో మనం పాలుపంచుకొంటే క్రీస్తుతో సహ వారసులం అవుతాము.
ప్రస్తుత శ్రమ మరియు భవిష్యత్ మహిమ
18మనలో ప్రత్యక్షం కాబోయే మహిమతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎంత మాత్రం పోల్చదగినవి కావని నేను భావిస్తాను. 19దేవుని బిడ్డలు ప్రత్యక్షపరచబడాలని సృష్టి అంతా ఆతురతతో ఎదురుచూస్తూ ఉంది. 20సృష్టి నిరాశకు గురైనది, అది తన ఇష్ట ప్రకారం కాదు గాని అప్పగించినవాని చిత్తప్రకారం, నిరీక్షణ కలిగినదై అప్పగించబడింది. 21సృష్టి నశించిపోవడమనే దాస్యం నుండి విడిపించబడి, దేవుని బిడ్డల మహిమలోనికి స్వాతంత్ర్యంలోనికి తీసుకురాబడుతుందనే ఆ నిరీక్షణ.
22నేటి వరకు సృష్టి అంతా ప్రసవ వేదన పడుతున్నట్లుగా మూల్గుతున్నదని మనకు తెలుసు. 23అది మాత్రమే కాదు, ఆత్మలో ప్రథమఫలం పొందిన మనం కూడా దత్తపుత్రులంగా అవ్వడానికి మన శరీరాల విమోచన కొరకు ఆతురతగా ఎదురుచూస్తూ మన లోలోపల మూలుగుతున్నాము. 24ఈ నిరీక్షణలోనే మనం రక్షించబడ్డాము. అయితే కనబడే నిరీక్షణ ఎంత మాత్రం నిరీక్షణ కాదు. అప్పటికే కలిగివున్న వాటికొరకు ఎవరు నిరీక్షిస్తారు? 25అయితే మన దగ్గర లేని దాని కొరకు మనం నిరీక్షిస్తే, మనం ఓపికగా ఎదురుచూడగలము.
26అదే విధంగా మన బలహీనతల్లో ఆత్మ మనకు సహాయం చేస్తాడు. దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియదు కాని, మనకొరకు ఆత్మ తానే మాటల్లేని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు. 27మన హృదయాలను పరిశోధించే ఆయనకు ఆత్మ యొక్క మనస్సు తెలుసు, ఎందుకనగా దేవుని ప్రజల కొరకు దేవుని చిత్తప్రకారం ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు.
28దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి కొరకు అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు. 29అనేకులైన సహోదరి సహోదరుల మధ్యలో ఆయన ప్రథమ సంతానంగా ఉండాలని దేవుడు తాను ముందుగానే ఎరిగినవారిని తన కుమారుని స్వరూపానికి అనుగుణంగా ఉండేలా వారిని ముందుగానే నిర్ణయించారు. 30ఎవరిని ముందుగా నిర్ణయించారో, వారిని ఆయన పిలిచారు; ఆయన పిలిచిన వారిని, ఆయన నీతిమంతులుగా తీర్చారు; ఆయన నీతిమంతులుగా తీర్చిన వారిని, ఆయన మహిమపరిచారు.
జయించినవారి కన్నా అధికులు
31అయితే ఈ విషయాలకు ప్రతిస్పందనగా మనం ఏం చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపుంటే, మనకు విరోధంగా ఎవరుండగలరు? 32దేవుడు తన సొంత కుమారుని విడిచిపెట్టలేదు, మనందరి కొరకు ఆయనను వదులుకున్నాడు, అలాంటప్పుడు తన కుమారునితో పాటు మనందరికి అన్ని సమృద్ధిగా ఇవ్వకుండా ఎలా ఉండగలడు? 33దేవుడు ఏర్పరచుకొన్నవారికి వ్యతిరేకంగా ఆరోపణ చేసేవారు ఎవరు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే గదా! 34అయితే శిక్షను విధించేవారు ఎవరు? సజీవంగా తిరిగి లేచి, దేవుని కుడి వైపున కూర్చుండి మనకొరకు దేవుని వేడుకొనే యేసు క్రీస్తు తప్ప మరి ఎవరూ కాదు. 35క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరుచేయగలవారు ఎవరు? ఇబ్బంది లేక కష్టం లేక కరువు లేక దిగంబరత్వం లేక ఆపద లేక ఖడ్గం ఏది వేరుచేయగలదు? 36లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది:
“నీ కొరకు మేము దినమంతా మరణాన్ని ఎదుర్కొన్నాము,
వధించబడబోయే గొర్రెలా మేము ఎంచబడ్డాము.”#8:36 కీర్తన 44:22
37ఏది కాదు, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము. 38మరణమైనా జీవమైనా, దేవదూతలైనా దయ్యాలైనా, నేడైనా రేపైనా, ఎటువంటి శక్తులైనా, 39ఎత్తైనా లోతైనా, సృష్టిలో ఉన్న ఏదైనా మన ప్రభువైన క్రీస్తుయేసులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనలను వేరుచేయలేవని నేను ఒప్పుకుంటున్నాను.

Currently Selected:

రోమా 8: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in