YouVersion Logo
Search Icon

ప్రకటన 6

6
ముద్రలు
1వధించబడిన గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పుతున్నప్పుడు నేను చూసాను. ఆ నాలుగు ప్రాణులలో ఒక ప్రాణి ఉరిమే స్వరంతో “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. 2నేను చూస్తున్నప్పుడు ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద సవారీ చేసేవాని చేతిలో ఒక విల్లు ఉంది, అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది, అతడు జయించేవానిగా జయించడానికి బయలుదేరి వెళ్ళాడు.
3ఆ వధించబడిన గొర్రెపిల్ల రెండవ ముద్రను విప్పినప్పుడు, రెండవ ప్రాణి నాతో, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. 4అప్పుడు మండుచున్న ఎరుపు రంగు గల మరొక గుర్రం బయలుదేరింది; దాని మీద సవారీ చేసే వానికి భూమి మీద నుండి సమాధానం తీసివేయడానికి, ప్రజలు ఒకరిని ఒకరు చంపుకొనేలా చేయటానికి అధికారం ఇవ్వబడింది. అతనికి పెద్ద ఖడ్గం ఇవ్వబడింది.
5ఆ వధించబడిన గొర్రెపిల్ల మూడవ ముద్రను విప్పినప్పుడు, మూడవ ప్రాణి “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. నేను చూసినప్పుడు ఒక నల్లని గుర్రం కనబడింది. దాని మీద సవారీ చేసేవాడు చేతిలో ఒక త్రాసు పట్టుకుని ఉన్నాడు. 6ఆ నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, “ఒక రోజు జీతానికి ఒక కిలో గోధుమలు, ఒక రోజు జీతానికి మూడు కిలోల బార్లీ గింజలు, అయితే ఒలీవల నూనెను ద్రాక్షారసాన్ని పాడుచేయవద్దు!” అని చెప్పడం విన్నాను.
7ఆ వధించబడిన గొర్రెపిల్ల నాలుగవ ముద్రను విప్పినప్పుడు, నాలుగవ ప్రాణి “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. 8నేను చూసినప్పుడు బూడిద రంగు గుర్రం కనబడింది. దాని మీద సవారిచేసేవాని పేరు మృత్యువు, పాతాళం అతన్ని అతి సమీపంగా వెంబడిస్తుంది. భూమి నాలుగవ భాగాన్ని ఖడ్గంతో, కరువుతో, తెగుళ్ళతో ఇంకా భూమి మీద ఉండే క్రూర మృగాలతో ప్రజలను చంపేలా అతనికి అధికారం ఇవ్వబడింది.
9ఆ వధించబడిన గొర్రెపిల్ల ఐదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యం బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వధించబడిన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద చూసాను. 10వారు పెద్ద స్వరంతో, “ఓ సర్వశక్తిగల ప్రభువా! పరిశుద్ధుడా, సత్యవంతుడా, మా రక్తానికి ప్రతిగా భూనివాసులను తీర్పు తీర్చడానికి ఇంకా ఎంతకాలం?” అని కేకలు వేసారు. 11అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రాలను ఇచ్చి, “మీలాగే ఇంకా హతులైన మీ తోటి సేవకుల, సహోదరీ సహోదరుల సంఖ్య పూర్తయేవరకు ఇంకా కొంత కాలం వేచి ఉండాలి” అని వారికి చెప్పబడింది.
12ఆ వధించబడిన గొర్రెపిల్ల ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది. అప్పుడు సూర్యుడు మేక బొచ్చుతో చేసిన గోనెపట్టలా నల్లగా మారాడు, చంద్రుడు రక్తంలా ఎర్రగా మారాడు. 13బలమైన గాలికి అంజూరపుచెట్టు నుండి రాలిపడిన కాయల్లా ఆకాశం నుండి నక్షత్రాలు భూమి మీద రాలాయి. 14ఆకాశం ఒక గ్రంథపు చుట్టలా చుట్టుకుపోయి, ప్రతి పర్వతం ప్రతి ద్వీపం వాటి వాటి స్థలాల నుండి తొలగిపోయాయి.
15భూ రాజులు, రాకుమారులు, ప్రధానులు, ధనవంతులు, బలవంతులు, దాసులు, స్వతంత్రులు ప్రతి ఒక్కరు గుహలలో, కొండల రాళ్ళ సందులలో దాక్కున్నారు. 16వారు కొండలతో, బండలతో, “మీరు మా మీద వచ్చి పడండి! సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాని ముఖం నుండి వధించబడిన గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని దాచి పెట్టండి!#6:16 హోషేయ 10:8 17ఎందుకంటే వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది, దాన్ని ఎవరు తట్టుకోగలరు?” అని వేడుకొంటున్నారు.

Currently Selected:

ప్రకటన 6: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in