YouVersion Logo
Search Icon

ప్రకటన 21

21
క్రొత్త భూమి క్రొత్త ఆకాశం
1అప్పుడు నేను “క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని”#21:1 యెషయా 65:17 చూసాను. మొదట ఉన్న ఆకాశం, భూమి గతించిపోయాయి. సముద్రం ఇక లేకపోయింది. 2అప్పుడు తన భర్త కొరకు అలంకరించుకొని సిద్ధపడిన ఒక వధువులా నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలో దేవుని దగ్గర నుండి క్రిందికి దిగి రావడం నేను చూసాను. 3అప్పుడు దేవుని సింహాసనం నుండి ఒక గొప్ప స్వరం, “ఇదిగో, దేవుని నివాసం ఇప్పుడు మనుష్యుల మధ్యలో ఉంది, ఆయన వారితో నివసిస్తాడు. అప్పుడు వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారికి దేవుడై ఉంటాడు. 4‘ఆయన వారి ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తాడు. పాత క్రమం గతించిపోయింది కనుక అక్కడ చావు#21:4 యెషయా 25:8 ఉండదు, దుఃఖం కాని ఏడ్పు కాని బాధ కాని ఎన్నడూ ఉండదు’ ” అని చెప్తుంటే నేను విన్నాను.
5అప్పుడు సింహాసనం మీద కూర్చునివున్న దేవుడు, “ఇదిగో, సమస్తాన్ని నూతనపరుస్తున్నాను” అని చెప్పి, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి కనుక వీటిని వ్రాసి పెట్టు” అన్నాడు.
6ఆయన నాతో, “సమాప్తమైనది. ఆల్ఫా, ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను. 7జయించువారు వీటన్నింటికి వారుసులవుతారు; నేను వారికి దేవుడనై ఉంటాను వారు నా బిడ్డలవుతారు. 8అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పాడు.
నూతన యెరూషలేము, గొర్రెపిల్ల వధువు
9చివరి ఏడు తెగుళ్ళు నిండి ఉన్న ఏడు పాత్రలను పట్టుకొన్న ఏడు దేవదూతలలోని ఒక దేవదూత నా దగ్గరకు వచ్చి నాతో, “ఇటురా! నేను పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్లకు కాబోయే భార్యను నీకు చూపిస్తాను” అని చెప్పాడు. 10అప్పుడు ఆ దేవదూత ఆత్మలో నన్ను ఒక గొప్ప ఎత్తెన పర్వతం మీదికి తీసుకెళ్ళి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము పరలోకంలోని దేవుని దగ్గర నుండి క్రిందకు దిగి రావడం చూపించాడు. 11అది దేవుని మహిమతో సూర్యకాంతం అనే బహు అమూల్యమైన రత్నపు తేజస్సు కలిగి స్ఫటికంలా స్వచ్ఛముగా మెరుస్తుంది. 12ఆ పట్టణానికి గొప్ప ఎత్తెన గోడ ఉన్నది, దానికి పన్నెండు ద్వారాలు, ఆ ద్వారాల దగ్గర పన్నెండు మంది దేవదూతలు ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాసి ఉన్నాయి. 13మూడు ద్వారాలు తూర్పున, మూడు ద్వారాలు ఉత్తరాన, మూడు ద్వారాలు దక్షిణాన, మూడు ద్వారాలు పశ్చిమాన ఉన్నాయి. 14పట్టణపు గోడకు పన్నెండు పునాదులు ఉన్నాయి, వాటి మీద గొర్రెపిల్ల యొక్క పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఉన్నాయి.
15నాతో మాట్లాడిన ఆ దేవదూత చేతిలో పట్టణాన్ని, దాని ద్వారాలను దాని గోడలను కొలవడానికి ఒక బంగారు కొలతకర్ర ఉంది. 16ఆ పట్టణం చదరపు ఆకారంలో ఉంది, దాని పొడవు, వెడల్పు కొలతలు సమానంగా ఉన్నాయి. ఆ కొలతకర్రతో పట్టణం కొలిచినప్పుడు అది 12,000 స్టాడియాల#21:16 సుమారు 2,200 కిలోమీటర్లు పొడవు ఉంది దాని పొడవు, వెడల్పు, ఎత్తు సమానంగా ఉన్నాయి. 17అతడు దాని గోడలను కొలిచినప్పుడు మనుష్యుల కొలత ప్రకారం అది 144 మూరల#21:17 65 మీటర్లు మందం ఉంది. 18ఆ గోడ సూర్యకాంత మణులతో కట్టబడింది. ఆ పట్టణం స్వచ్ఛమైన బంగారంతో చేయబడి గాజులా స్వచ్ఛముగా ఉంది. 19ఆ పట్టణపు గోడ యొక్క పునాదులు అమూల్యమైన వివిధ రత్నాలతో అలంకరించబడ్డాయి. మొదటి పునాది సూర్యకాంతం, రెండవది నీలం, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, 20ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేధికం, తొమ్మిదవది పుష్యరాగం, పదవది సువర్ణల శునీయం, పదకొండవది పద్మరాగం, పన్నెండవది కురువింద మణి. 21పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలు, ప్రతి ద్వారం ఒక ముత్యంతో చేయబడింది. ఆ పట్టణపు ప్రధాన వీధి బంగారంతో చేయబడి, గాజులా స్వచ్ఛముగా ఉంది.
22ఆ పట్టణంలో ఏ దేవాలయం నాకు కనిపించలేదు ఎందుకంటే సర్వశక్తిగల ప్రభువైన దేవుడును గొర్రెపిల్ల ఆ పట్టణానికి దేవాలయంగా ఉన్నారు. 23ఆ పట్టణంపై సూర్యుడు కాని చంద్రుడు కాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపం. 24ప్రజలు దాని వెలుగులో నడుస్తారు, ఇంకా భూ రాజులు తమ వైభవాన్ని దానిలోనికి తెస్తారు. 25ఏ రోజూ దాని ద్వారాలు మూయబడవు ఎందుకంటే అక్కడ రాత్రి ఉండదు. 26దేశాలు తమ మహిమ వైభవాన్ని దానిలోనికి తెస్తాయి 27గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడినవారు మాత్రమే ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తారు. అయితే అపవిత్రమైనది కాని అసహ్యకరమైన, మోసకరమైన వాటిని చేసేవారెవరు దానిలోనికి ఎన్నడూ ప్రవేశించరు.

Currently Selected:

ప్రకటన 21: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in