ఫిలిప్పీయులకు 1
1
1క్రీస్తు యేసు సేవకులైన పౌలు మరియు తిమోతి,
క్రీస్తు యేసునందు ఫిలిప్పీలో ఉన్న దేవుని పవిత్ర ప్రజలకు, సంఘ పరిచారకులకు, సంఘ పెద్దలకు శుభమని చెప్పి వ్రాయునది#1:1 రోమా 16:1; 1 తిమోతి 3:8,12:
2మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక.
కృతజ్ఞత మరియు ప్రార్థన
3మీరు గుర్తుకొచ్చినప్పుడెల్లా నేను దేవునికి వందనాలు చెప్తున్నా. 4మీ అందరి నిమిత్తం చేసే నా ప్రతి ప్రార్థనలో నేను ఎప్పుడు సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాను. 5మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త విషయంలో మీరు నాతో జతపని వారిగా ఉండడం చూసి, 6మీలో ఈ సత్క్రియ ఆరంభించినవాడు క్రీస్తు యేసు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను.
7నేను సంకెళ్ళలో ఉన్నా లేదా సువార్త గురించి వాదించడంలో దానిని స్ధిరపరచడంలో మీరందరు నాతో కూడా ఈ కృపలో భాగస్థులుగా ఉన్నారు, కనుక మీరు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల మీ అందరి గురించి ఇలా భావించడం నాకు న్యాయమే. 8యేసు క్రీస్తు దయను బట్టి మీ అందరి గురించి నేనెంత ఆశ కలిగివున్నానో దేవుడే సాక్ష్యం ఇస్తారు.
9-11దేవునికి మహిమ స్తోత్రం కలుగుటకు, మీరు ఏది ఉత్తమమైనదో గ్రహించగలిగి క్రీస్తు దినాన మీరు స్వచ్ఛముగా, నిర్దోషులుగా ఉండునట్లుగా, మీ ప్రేమ, జ్ఞానంలో, లోతైన పరిజ్ఞానాన్ని కలిగి అంతకంతకు వృద్ధిచెందాలని, క్రీస్తు యేసు నుండి వచ్చే నీతిఫలంతో మీరు నింపబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను.
పౌలు సంకెళ్ళు సువార్తను విస్తరించుట
12సహోదరీ సహోదరులారా, నాకు కలిగిన శ్రమల కారణంగా సువార్త మరి ఎక్కువగా విస్తరించిందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. 13దాని ఫలితంగా, క్రీస్తు కొరకు నేను సంకెళ్ళలో ఉన్నానని, రాజమందిరాన్ని కాపలాకాసే వారందరికి, ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలిసింది. 14నా సంకెళ్ళ మూలంగా సహోదరీ సహోదరులలో చాలామంది ప్రభువులో స్ధిరమైన విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి మరి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు.
15కొందరు అసూయతో, విరోధంతో క్రీస్తును ప్రకటిస్తున్నారనేది నిజమే, కాని ఇతరులు మంచి ఉద్దేశంతోనే ప్రకటిస్తున్నారు. 16నేను సువార్త గురించి వాదించడానికి ఇక్కడ నియమించబడ్డానని తెలుసుకున్న తరువాత, వారు ప్రేమతో ప్రకటిస్తున్నారు. 17గతంలో నేను సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు మరింత ఇబ్బంది కలిగించాలనే తలంపుతో, వారు మంచి ఉద్దేశంతో కాకుండా స్వార్థపూరిత ఉద్దేశంతో, క్రీస్తును గురించి ప్రకటించారు. 18అయితే ఏంటి? మంచి ఉద్దేశమైన లేదా చెడ్డ ఉద్దేశమైన ప్రతీ మార్గంలోనూ క్రీస్తు గురించి ప్రకటించబడుతుంది అనేదే ముఖ్యం. దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను.
ఇక ముందు కూడా నేను సంతోషిస్తాను. 19ఎందుకంటే, మీ ప్రార్థన వలన, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా అనుగ్రహించబడుట వలన, నాకు ఏమి జరిగినా అది నాకు రక్షణగానే మారుతుందని నాకు తెలుసు. 20నేను ఏ విషయంలోను సిగ్గుపడకుండా ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా పూర్ణధైర్యంతో బోధించడం వలన నేను జీవించినా లేదా మరణించినా సరే, నా శరీరంలో ఎప్పుడూ క్రీస్తు ఘనపరచబడాలని నేను ఆసక్తితో ఆశించి నిరీక్షిస్తున్నాను. 21నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభం. 22ఒకవేళ నేను శరీరంలోనే జీవించాల్సి ఉంటే, ఇది నాకు ఫలభరితమైన ప్రయాసం అవుతుంది. అయినా నేను ఏమి కోరుకోవాలి? నాకు తెలియదు! 23ఈ రెండింటికి మధ్య నేను నలిగిపోతున్నాను. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో కూడా ఉండాలని నా ఆశ, అది నాకు చాలా మంచిది. 24అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరం. 25మీరు విశ్వాసంలో వృద్ధి చెంది ఆనందించడానికి, నేను జీవిస్తూ, మీ అందరితో కలసి ఉంటానని నాకు తెలుసు. 26ఇలాంటి నమ్మకం కలిగి, నేను మరల మీతో కలిసివుండడం వలన నన్ను బట్టి క్రీస్తు యేసులో మీకున్న ఆనందం అధికమవుతుంది.
సువార్తకు తగిన జీవితము
27-28ఏమి జరిగినా, క్రీస్తు సువార్తకు తగినట్లు మీరు ప్రవర్తించండి. నేను వచ్చి మిమ్మల్ని చూసినా లేక నేను లేనప్పుడు మీ గురించి వినినా, మిమ్మల్ని వ్యతిరేకించేవారికి మీరు ఏ విధంగాను భయపడక, మీరు ఒకే ఆత్మలో దృఢంగా నిలిచి, సువార్త విశ్వాసం కొరకు మీరు ఒకటిగా పోరాడుతున్నారని నేను తెలుసుకుంటాను. వారు నాశనం అవుతారు కాని మీరు రక్షించబడతారు, అది వారికి దేవుడు ఇచ్చే ఒక సూచన. 29మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన కొరకు శ్రమలు కూడా అనుభవించాలని ఆయన తరపున ఇది మీకు ఇవ్వబడింది, 30నేను ఏ శ్రమలు అనుభవించడం మీరు చూసారో, ఇప్పుడు మీరు వాటి గుండానే వెళ్తున్నారు, అయితే నేను ఇంకా అనుభవించాల్సి ఉంది.
Currently Selected:
ఫిలిప్పీయులకు 1: TCV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.