మార్కు 3
3
సబ్బాతు దినాన స్వస్థపరచిన యేసు
1మరొకసారి యేసు సమాజమందిరంలో వెళ్లినప్పుడు, అక్కడ చేతికి పక్షవాతం గలవాడు ఒకడున్నాడు. 2వారిలో కొందరు యేసును నిందించడానికి ఒక కారణం కొరకు వెదుకుతున్నారు, కాబట్టి వారు సబ్బాతు దినాన ఆయన స్వస్థపరుస్తారేమో అని దగ్గర నుండి ఆయనను గమనిస్తున్నారు. 3చేతికి పక్షవాతం గలవానితో యేసు, “అందరి ముందు నిలబడు” అన్నారు.
4అప్పుడు ఆయన, “సబ్బాతు దినాన ఏది న్యాయం: మంచి చేయడమా లేదా చెడు చేయడమా, ప్రాణం రక్షించడమా లేదా ప్రాణం తీయడమా?” అని వారిని అడిగారు కాని వారు మౌనంగా ఉన్నారు.
5ఆయన కోపంతో చుట్టూ ఉన్న వారిని చూసి, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి బాధతో నొచ్చుకుని, చేతికి పక్షవాతం గలవానితో, “నీ చెయ్యి చాపు” అన్నారు. వాడు దాన్ని చాపగానే, వాని చెయ్యి పూర్తిగా బాగయింది. 6అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్లి హేరోదు వర్గానికి చెందిన వారితో కలిసి యేసును ఎలా చంపుదామా అని కుట్రపన్నడం మొదలుపెట్టారు.
యేసును వెంబడిస్తున్న జనసమూహాలు
7యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్లారు, అలాగే గలిలయ నుండి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. 8ఆయన చేస్తున్న గొప్పకార్యాల గురించి ప్రజలు విని, చాలామంది యూదయ, యెరూషలేము, ఇదూమయ, యోర్దాను అంతటా మరియు తూరు, సీదోను చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వచ్చారు. 9జనసమూహం కారణంగా ఆయన తన శిష్యులతో, తన కొరకు ఒక చిన్న పడవను సిద్ధం చేయమని చెప్పారు. 10ఆయన చాలామందిని స్వస్థపరిచారు, కనుక వ్యాధులు ఉన్నవారు ఆయనను ముట్టుకోవాలని ముందుకు వస్తున్నారు. 11అపవిత్రాత్మలు ఆయనను చూడగానే, ఆయన ముందు సాగిలపడి, “నీవు దేవుని కుమారుడవు” అని కేకలు వేసాయి. 12అయితే ఆయన తన గురించి ఇతరులకు చెప్పవద్దని వారికి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు.
పన్నెండు మందిని నియమించిన యేసు
13ఆ తర్వాత యేసు కొండెక్కి తనకు ఇష్టమైన వారిని పిలిచారు, వారు ఆయన దగ్గరకు వచ్చారు. 14తనతో ఉండడానికి, ప్రకటించడానికి తాను బయటకు పంపడానికి ఆయన పన్నెండు మందిని#3:14 కొ.ప్ర.లలో పన్నెండు మందిని అపొస్తలులుగా నియమిస్తూ నియమించుకొని 15దయ్యాలను వెళ్లగొట్టే అధికారాన్ని వారికిచ్చారు.
16ఆ పన్నెండు మంది ఎవరనగా:
ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను,
17జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను; (వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అనే పేరు పెట్టారు; దాని అర్థం “ఉరుము కుమారులు”),
18అంద్రెయ,
ఫిలిప్పు,
బర్తలోమయి,
మత్తయి,
తోమా,
అల్ఫయి కుమారుడు యాకోబు,
తద్దయి,
అత్యాసక్తి కలవాడైన సీమోను,
19మరియు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
ధర్మశాస్త్ర ఉపదేశకులు, తన కుటుంబీకుల చేత యేసు నిందించబడుట
20తర్వాత యేసు ఒక ఇంట్లోకి వెళ్లినప్పుడు, ప్రజలు మరల గుంపుగా కూడి వచ్చారు, కనుక ఆయన మరియు ఆయన శిష్యులు భోజనం కూడా చేయలేకపోయారు. 21అది విని ఆయన కుటుంబీకులు, “ఆయనకు మతిపోయింది” అని చెప్పి ఆయనను తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.
22యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర ఉపదేశకులు, “ఇతడు బయెల్జెబూలు చేత పట్టబడినవాడు! దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అని అన్నారు.
23కనుక యేసు వారిని తన దగ్గరకు పిలుచుకొని వారితో ఉపమానరీతిగా మాట్లాడారు: “సాతాను సాతానును ఎలా వెళ్లగొట్టగలడు? 24ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే, ఆ రాజ్యం నిలువలేదు. 25ఒక కుటుంబం తనకు తానే వ్యతిరేకంగా చీలిపోతే అది నిలబడదు. 26అలాగే ఒకవేళ సాతాను తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాడు నిలువలేడు; వాని అంతం వచ్చినట్లే. 27నిజానికి, బలవంతుడైనవాని మొదట కట్టివేయకుండ అతని ఇంట్లోకి ఎవరు ప్రవేశించలేరు. అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు. 28ప్రతి పాపానికి, దూషణకు మనుష్యులకు క్షమాపణ ఉంది. 29కాని, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఉండదు; వారు నిత్య పాపం చేసిన అపరాధులుగా ఉంటారని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
30“ఆయన అపవిత్రాత్మ పట్టినవాడు” అని వారు అంటున్నారు కాబట్టి యేసు ఈ విధంగా చెప్పారు.
31ఆ తర్వాత యేసు తల్లి మరియు సహోదరులు వచ్చారు. వారు బయట నిలబడి, ఆయనను పిలువడానికి ఒకరిని లోపలికి పంపారు. 32జనసమూహం ఆయన చుట్టు కూర్చుని ఉండగా, వారు ఆయనతో, “నీ తల్లి మరియు నీ సహోదరులు నిన్ను కలువడానికి వచ్చి బయట వేచి ఉన్నారు” అని చెప్పారు.
33అందుకు ఆయన, “నా తల్లి మరియు నా సహోదరులు ఎవరు?” అని అడిగారు.
34ఆయన తన చుట్టు కూర్చున్న వారిని చూసి, “వీరే నా తల్లి, నా సహోదరులు! 35దేవుని చిత్తప్రకారం చేసేవారే నా సహోదరుడు, సహోదరి మరియు తల్లి” అని చెప్పారు.
Currently Selected:
మార్కు 3: TCV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.