అపొస్తలుల కార్యములు 26
26
1అప్పుడు అగ్రిప్ప రాజు పౌలుతో, “నీ సమాధానం చెప్పుకోవడానికి నిన్ను అనుమతిస్తున్నాను” అన్నాడు.
కనుక పౌలు తన చేయి చాపి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు: 2అగ్రిప్ప రాజా, యూదులు నా మీద వేసిన ఫిర్యాదులన్నిటికి నా సమాధానం తెలియచేయడానికి, 3ఈ రోజు మీ ముందు నిలబడి ఉండటం నా భాగ్యం అని భావిస్తున్నాను, ఎందుకంటే మీరు యూదుల ఆచారాలు మరియు వివాదాల గురించి బాగా తెలిసిన వారు. కనుక నా సమాధానం ఓపికతో వినాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
4నా సొంత ప్రాంతంలో, యెరూషలేములో నేను నా బాల్యం నుండి జీవించిన విధానం గురించి యూదులందరికి తెలుసు. 5వారికి నేను చాలాకాలం నుండి పరిచయస్తుడినే కనుక వారికి ఇష్టమైతే, నేను పరిసయ్యునిగా జీవిస్తూ మా మతాచారాలను ఖచ్చితంగా పాటించే వాడినని వారే సాక్ష్యం ఇవ్వగలరు. 6దేవుడు మన పితరులకు ఇచ్చిన వాగ్దానం గురించి నాకున్న నిరీక్షణ బట్టి ఈ రోజు నన్ను ఈ విచారణకు నిలబెట్టారు. 7మన పన్నెండు గోత్రాల ఇశ్రాయేలీయులు పగలు రాత్రి దేవుని సేవించడం ద్వారా ఆ వాగ్దాన నెరవేర్పును చూస్తామనే నిరీక్షణ కలిగి ఉన్నారు. అయితే అగ్రిప్ప రాజా, ఈ నిరీక్షణ గురించే యూదులు నన్ను నిందిస్తున్నారు. 8దేవుడు చనిపోయిన వానిని సజీవంగా లేపడం నమ్మశక్యంగా లేదని మీరు ఎందుకు భావిస్తున్నారు?
9“నజరేయుడైన యేసు నామంను వ్యతిరేకించడానికి సాధ్యమైనవన్నీ చేయాలని నేను కూడా అనుకున్నాను. 10యెరూషలేములో అలాగే చేశాను. ముఖ్యయాజకుని దగ్గర నుండి అధికారం పొందుకొని ప్రభువు యొక్క ప్రజలలో అనేకమందిని చెరసాలలో వేయించి, వారిని చంపినప్పుడు దానికి అంగీకారం తెలిపాను. 11అనేకసార్లు వారిని శిక్షించడానికి ఒక సమాజమందిరం నుండి మరొక సమాజమందిరానికి వెళ్తూ, వారిని శిక్షిస్తూ దైవదూషణ చేసేలా వారిని బలవంతం చేశాను. వారిని ఇంకా హింసించాలని తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాలలో కూడా వారిని వెంటాడాను.
12“అలా చేస్తూ ఒక రోజు నేను ముఖ్యయాజకుల నుండి అధికార పత్రం తీసుకొని దమస్కు పట్టణానికి బయలుదేరాను. 13అగ్రిప్ప రాజా, ఇంచుమించు మధ్యాహ్న సమయంలో, నేను దారిలో ఉన్నప్పుడు, సూర్యుని కన్న ప్రకాశమైన వెలుగు పరలోకం నుండి వచ్చి నా చుట్టూ నాతో ఉన్న వారి చుట్టూ ప్రకాశించడం నేను చూసాను. 14అప్పుడు మేమందరం నేల మీద పడిపోయాం, అప్పుడు హెబ్రీ భాషలో నాతో, ‘సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? మునికోలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని ఒక స్వరం చెప్పడం విన్నాను.
15“అప్పడు ‘ప్రభువా, నీవు ఎవరు?’ అని అడిగాను.
“ప్రభువు, ‘నీవు హింసిస్తున్న యేసును, 16నీవు లేచి నిలబడు, ఇక మీదట నీవు నా గురించి చూసినవాటికి మరియు చూడబోయే వాటికి సాక్షిగా సేవకునిగా నిన్ను నియమించడానికే నేను నీకు ప్రత్యక్షమయ్యాను. 17నేను నిన్ను నీ ప్రజల నుండి మరియు యూదేతరుల నుండి తప్పిస్తాను. 18వారు చీకటి నుండి వారిని వెలుగులోనికి, సాతాను శక్తి నుండి దేవుని వైపుకు తిరిగి, పాపక్షమాపణ పొందుకొని, నా మీద ఉన్న నమ్మకంతో పరిశుద్ధపరచబడి పరిశుద్ధుల మధ్యలో వారికి ఉన్న వారసత్వాన్ని పొందుకునేలా వారి కన్నులను తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరకు పంపిస్తున్నాను’ అని చెప్పాడు.
19“కనుక, అగ్రిప్ప రాజా, పరలోకం నుండి వచ్చిన దర్శనానికి నేను అవిధేయత చూపలేను. 20మొదట దమస్కులో ఉన్నవారికి, తర్వాత యెరూషలేములో ఉన్నవారికి మరియు యూదయ ప్రాంతమంతటిలో ఉన్నవారందరికి, ఆ తర్వాత యూదేతరులకు పశ్చాత్తాపపడి దేవుని వైపునకు తిరగమని మరియు మారుమనస్సు పొందిన కార్యాలను చేయాలని నేను ప్రకటించాను. 21అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకొని చంపడానికి ప్రయత్నించారు. 22అయితే ఈ రోజు వరకు దేవుడు నాకు సహాయం చేశాడు కనుకనే క్రీస్తు శ్రమపడి, చనిపోయినవారిలో నుండి మొదటి వానిగా లేస్తాడనేది, 23తన సొంత ప్రజలకు మరియు యూదేతరులకు వెలుగును ప్రచురిస్తుందని మోషే మరియు ప్రవక్తలు చెప్పినవి మించి ఏమి చెప్పకుండా ఇక్కడ నిలబడి గొప్పవారికి అల్పులకు ఒకేలా సాక్ష్యం చెప్తున్నాను” అని చెప్పాడు.
24అంతలో ఫేస్తు అతని మాటలను మధ్యలో ఆపుతూ, “పౌలు! నీకు మతిభ్రమించింది. నీ గొప్ప విద్యలు నిన్ను పిచ్చి పట్టించాయి” అని గట్టిగా అరిచాడు.
25అందుకు పౌలు, “ఘనత వహించిన ఫేస్తు అధిపతి, నాకు పిచ్చి పట్టలేదు. నేను చెప్పేది సత్యం సమంజసం. 26ఈ సంగతులు రాజుకు తెలిసినవే కనుక నేను ఆయనతో ధైర్యంగా చెప్పుకోగలను. అయినా ఈ సంగతులు ఒక మూలలో జరిగినవి కావు, కనుక వీటిలో ఏది ఆయన దృష్టిలో నుండి తప్పిపోదని నేను నమ్ముతున్నాను. 27అగ్రిప్ప రాజా, నీవు ప్రవక్తలను నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావని నాకు తెలుసు” అని అన్నాడు.
28అప్పుడు అగ్రిప్ప పౌలుతో, “ఇంత తక్కువ సమయంలోనే నన్ను క్రైస్తవునిగా మార్చగలనని నీవు అనుకుంటున్నావా?” అన్నాడు.
29అందుకు పౌలు, “తక్కువ సమయమైనా ఎక్కువ సమయమైనా, నీవే కాదు ఈ రోజు ఈ సంకెళ్ళు తప్ప నా మాటలు వింటున్న వారందరు నాలా మారాలని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను” అని చెప్పాడు.
30అగ్రిప్ప రాజు లేచాడు, అతనితో పాటు ఫేస్తు, బెర్నీకే మరియు వారితో కూర్చున్న వారందరు లేచారు. 31వారు ఆ గదిని విడిచి వెళ్లిన తర్వాత వారు ఒకరితో ఒకరు, “ఇతడు మరణశిక్ష పొందడానికి గాని చెరసాలలో బంధించడానికి గాని తగిన తప్పు ఏది చేయలేదు” అని చెప్పుకొన్నారు.
32అప్పుడు అగ్రిప్ప రాజు ఫేస్తు అధిపతితో, “ఇతడు కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటాను అనకపోతే విడుదల చేయబడి ఉండేవాడు” అని చెప్పాడు.
Currently Selected:
అపొస్తలుల కార్యములు 26: TCV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.