అపొస్తలుల కార్యములు 19
19
ఎఫెసు పట్టణంలో పౌలు
1అపొల్లో కొరింథీలో ఉన్నప్పుడు, పౌలు పల్లె ప్రాంతాలు సంచరిస్తూ ఎఫెసుకు చేరాడు. 2అక్కడ అతడు కొందరు శిష్యులను కలిసి వారిని, “మీరు క్రీస్తును నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకొన్నారా?” అని అడిగాడు.
అప్పుడు వారు, “లేదు, అసలు పరిశుద్ధాత్మ ఉన్నదని కూడా మేము ఎప్పుడు వినలేదు” అన్నారు.
3అప్పుడు పౌలు, “అలాగైతే మీరు ఏ బాప్తిస్మాన్ని పొందుకున్నారు?” అని అడిగాడు.
అప్పుడు వారు, “యోహాను బాప్తిస్మం” అని చెప్పారు.
4అందుకు పౌలు వారితో, “యోహాను పశ్చాత్తాప బాప్తిస్మాన్ని ఇచ్చాడు. తన వెనుక రాబోతున్న యేసును నమ్మండని ప్రజలకు చెప్పాడు” అన్నాడు. 5అది విని, వారు ప్రభువైన యేసు పేరట బాప్తిస్మం పొందుకొన్నారు. 6పౌలు తన చేతులను వారి మీద ఉంచినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలలో మాట్లాడుతూ ప్రవచించారు. 7వారందరు కలిసి ఇంచుమించు పన్నెండు మంది ఉన్నారు.
8పౌలు సమాజమందిరంలో, దేవుని రాజ్యం గురించి ధైర్యంగా మాట్లాడుతూ వారితో తర్కించి ఒప్పిస్తూ మూడు నెలలు గడిపాడు. 9అయితే వారిలో కొందరు హృదయాలను కఠినపర్చుకొని అతని మాటలను తిరస్కరిస్తూ, బహిరంగంగా ప్రభువు మార్గాన్ని దూషించారు, కనుక పౌలు వారిని వదిలి వెళ్లాడు. ప్రతి రోజు శిష్యులను తీసుకొని తురన్ను అనే ఉపన్యాస గదిలో చర్చిస్తూ ఉండేవాడు. 10అలాగే రెండు సంవత్సరాలు కొనసాగేటప్పటికి, ఆసియా ప్రాంతంలో నివసిస్తున్న యూదులు మరియు గ్రీసు దేశస్థులు అందరు ప్రభువు వాక్యాన్ని విన్నారు.
11దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్బుతాలను చేశాడు. 12అనగా, అతన్ని తాకిన చేతి రుమాలు కాని వస్త్రాలను కాని రోగులు తాకగానే వారికున్న అనారోగ్యం నుండి స్వస్థత పొందుకున్నారు, దురాత్మలు వారిని వదలిపోయాయి.
13కొందరు యూదులు యేసు ప్రభువు నామాన్ని ఉపయోగిస్తూ, దయ్యం పట్టిన వారిలోని దురాత్మలను వెళ్లగొట్టడానికి బయలుదేరారు. వారు, “పౌలు బోధిస్తున్న యేసు నామమున బయటకు రమ్మని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నారు. 14యూదుల ముఖ్య యాజకుడు స్కెవ ఏడుగురు కుమారులు ఈ విధంగా చేస్తూ వచ్చారు. 15ఒక రోజు దురాత్మ వారిని, “యేసు నాకు తెలుసు, పౌలు నాకు తెలుసు, కాని మీరెవరు?” అని అడిగింది. 16ఆ దురాత్మ పట్టినవాడు వారి మీద పడి వారిని లోబరచుకుని దాడి చేయగా వారు రక్తం కారుతున్న గాయాలతో దిగంబరులుగా ఆ ఇంటి నుండి పారిపోయారు.
17ఈ విషయం ఎఫెసులో ఉన్న యూదులకు మరియు గ్రీసు ప్రజలకు తెలిసినప్పుడు, వారందరు భయపడిపోయారు, కనుక ప్రభు యేసు పేరు ఘనపరచబడింది. 18అప్పుడు నమ్మినవారిలో చాలామంది వచ్చి తాము చేసిన దుష్ట కార్యాలను అందరి ముందు ఒప్పుకొన్నారు. 19మంత్రవిద్యను అభ్యసించే వారిలో చాలామంది వాటికి సంబంధించిన పుస్తకాలను తెచ్చి అందరి ముందు వాటిని కాల్చివేశారు. కాల్చిన ఆ పుస్తకాల ఖరీదును లెక్కిస్తే వాటి ఖరీదు యాభైవేల వెండి నాణాలు#19:19 ఒక వెండి నాణెం సుమారు ఒక రోజు జీతంకు సమానం. అయింది. 20ఈ విధంగా ప్రభువు వాక్యం శక్తితో వ్యాప్తిస్తూ చాలా ప్రాంతాలకు విస్తరించింది.
21ఇదంతా జరిగిన తర్వాత పౌలు మాసిదోనియ అకయ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ యెరూషలేముకు వెళ్లాలి అని నిర్ణయించుకొన్నాడు. “నేను అక్కడికి వెళ్లిన తర్వాత రోమా పట్టణాన్ని కూడా దర్శించాలి” అనుకున్నాడు. 22అతడు తిమోతి ఎరస్తు అనే ఇద్దరు తన తోటి పరిచారకులను మాసిదోనియాకు పంపి, అతడు ఆసియా ప్రాంతంలో కొంత కాలం ఉండిపోయాడు.
ఎఫెసు పట్టణంలో అల్లరి
23ఆ సమయంలో ప్రభువు మార్గం గురించి అక్కడ చాలా అల్లరి చెలరేగింది. 24అది ఎలాగంటే, దేమేత్రి అనే ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేస్తూ, అక్కడి పనివారికి వ్యాపారంలో మంచి ఆదాయం కల్పించేవాడు. 25అతడు ఆ వ్యాపార సంబంధమైన పని వారందరిని పిలిపించి, ఈ విధంగా చెప్పాడు, “నా స్నేహితులారా, ఈ వ్యాపారం ద్వారా మనకు మంచి ఆదాయం వస్తుందని మీకు అందరికి తెలుసు. 26అయితే పౌలు అనే ఇతడు ఎఫెసు మరియు ఆసియా ప్రాంతాలన్నింటిలో చాలామంది ప్రజలను ఎలా ఒప్పించి దారి తప్పిస్తున్నాడో మీరు చూస్తున్నారు వింటున్నారు. మానవుల చేతులతో తయారు చేసిన దైవాలు అసలు దైవాలే కావు అని ఇతడు అంటున్నాడు. 27దీని వలన మన వ్యాపారానికి ఉన్న మంచి పేరు పోవడమే కాకుండా గొప్ప అర్తెమి దేవి గుడికి ఉన్న ఘనత కూడా పోతుంది; ఆసియా ప్రాంతంలో మరియు లోకమంతట ఆమెకు ఉన్న దివ్యఘనత తగ్గిపోతుంది.”
28అది విన్న వారు కోపంతో “ఎఫెసీయుల అర్తెమి దేవి గొప్పది!” అని బిగ్గరగా కేకలు వేశారు. 29దానితో కొద్దిసేపటిలోనే పట్టణం అంతా అల్లరి చెలరేగింది. పౌలుతో మాసిదోనియ నుండి ప్రయాణం చేసి వచ్చిన గాయి అనే అరిస్తర్కును పట్టుకొని, వారందరు ఒకేసారి నాటకశాలలోనికి ఈడ్చుకు వెళ్లారు. 30పౌలు ఆ జనసమూహానికి కనిపించాలి అనుకున్నాడు, కాని శిష్యులు అతన్ని వెళ్లనివ్వలేదు. 31అంతేకాక కొందరు ఆసియా దేశ అధికారులు, పౌలు మిత్రులు, అతన్ని నాటకశాలలోనికి వెళ్లవద్దని బ్రతిమాలుతూ వర్తమానం పంపించారు.
32సభ అంతా గందరగోళంగా మారింది: కొందరు ఒకదాని గురించి కేకలు వేస్తుంటే, మరికొందరు మరొక దాని గురించి. అక్కడ ఉన్నవారిలో చాలామందికి తాము అక్కడ ఎందుకు ఉన్నారో కూడా తెలియలేదు. 33ఆ జనసమూహంలోని యూదులు అలెగ్జాండరును ముందుకు త్రోసి, అతన్ని జనుల ముందు నిలబెట్టి వారు కేకలు వేశారు. కనుక అతడు ప్రజల ముందు సమాధానం చెప్పడానికి నిలబడి నిశ్శబ్దంగా ఉండండి అని సైగ చేశాడు. 34కానీ అతడు యూదుడు అని తెలుసుకొని వారు సుమారు రెండు గంటల సేపు ఏకకంఠంతో, “ఎఫెసీయుల అర్తెమి దేవి గొప్పది!” అని బిగ్గరగా కేకలు వేశారు.
35ఆ నగర గుమస్తా ఆ ప్రజలను శాంతపరస్తూ వారితో ఇలా అన్నాడు: “తోటి ఎఫెసీయులారా, అర్తెమి దేవి గుడికి, ఆకాశం నుండి పడిన ఆమె ప్రతిమకు ఎఫెసు పట్టణం సంరక్షణ అని లోకమంతటికి తెలియదా? 36ఈ సంగతులు త్రోసిపుచ్చలేని నిజాలు కనుక, మీరు శాంతించాలి, తొందరపడి ఏమి చేయకూడదు. 37అయితే మీరు తీసుకుని వచ్చిన వీరు మన గుళ్ళను దోచుకోలేదు, మన దేవతను దూషించలేదు. 38నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేమేత్రికి అతని తోటి పనివారికి ఎవరి మీద ఆరోపణలు ఉన్నా, వారి కొరకు న్యాయస్థానాలు తెరిచి ఉన్నాయి, అధికారులు కూడా ఉన్నారు. కనుక వారు అక్కడికి వెళ్లి వీరి మీద ఫిర్యాదు చేసుకోవాలి. 39మీకు ఏ విషయమైనా తెలియచేయాలని అనుకుంటే వాటిని క్రమపద్ధతిలో న్యాయసభలో సరిచేసుకోవాలి. 40అయితే ఈ రోజు జరిగిన అల్లరి గురించి అధికారులు మనపై విచారణ చేసే ప్రమాదం ఉంది. ఏ కారణం లేకుండా కలిగిన ఈ అల్లరికి మనం ఏ కారణం ఇవ్వగలమని” వారితో అన్నాడు. 41అతడు ఈ మాటలను చెప్పి ప్రజలను పంపేశాడు.
Currently Selected:
అపొస్తలుల కార్యములు 19: TCV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.