YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 15

15
అపొస్తలులు, సంఘపెద్దలు కలిసి యెరూషలేములో తీసుకొన్న నిర్ణయాలు
1కొందరు యూదయ ప్రాంతం నుండి అంతియొకయ ప్రాంతానికి వచ్చి విశ్వాసులతో: “మోషే నియమించిన ఆచార ప్రకారం సున్నతి పొందితేనే తప్ప రక్షణ లేదు” అని బోధించారు. 2ఇది పౌలు బర్నబాల మధ్య తీవ్రమైన తర్కానికి దారి తీసింది. కనుక వారు, మరికొందరు విశ్వాసులతో కలిసి ఈ ప్రశ్న విషయమై యెరూషలేములోని అపొస్తలులను, సంఘ పెద్దలను కలుసుకోవడానికి వెళ్లాలని నిర్ణయించారు. 3కనుక సంఘస్థులు వారిని పంపినప్పుడు, వారు ఫేనీకే సమరయ ప్రాంతాల ద్వారా వెళ్తూ, యూదేతరులు ఎలా దేవుని వైపు తిరిగారో చెప్పినప్పుడు విశ్వాసులందరు చాలా ఆనందించారు. 4వారు యెరూషలేము చేరుకొన్నప్పుడు, సంఘస్థులు అపొస్తలులు మరియు సంఘపెద్దలు వారిని చేర్చుకున్నారు. అక్కడ ఉన్నవారందరికి దేవుడు తమ ద్వారా జరిగించిన వాటన్నింటిని వివరించారు.
5అప్పుడు కొందరు పరిసయ్యుల తెగలోని విశ్వాసులు లేచి, “యూదేతరులు తప్పనిసరిగా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, సున్నతి చేయించుకోవాలి” అని వారికి చెప్పారు.
6కనుక ఈ ప్రశ్నను గురించి చర్చించడానికి అపొస్తలులు మరియు సంఘపెద్దలు సమావేశమయ్యారు. 7చాలా చర్చలు జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లన్నాడు: “సహోదరులారా, కొంత కాలం క్రిందట యూదేతరులు నా నోట సువార్త సందేశం విని విశ్వసించాలని మీలో నుండి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని మీకు తెలుసు కదా! 8హృదయాలను ఎరిగిన దేవుడు, ఆయన మనపట్ల చేసినట్టుగానే, వారికి కూడా పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా ఆయన వారిని స్వీకరించాడని నిరూపించారు. 9దేవుడు మనకు వారికి మధ్య ఏ భేదం చూపించకుండా వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచారు. 10కనుక ఇప్పుడు, మన పితరులు కానీ మనం కానీ మోయలేని కాడిని యూదేతరులలో నుండి వచ్చిన విశ్వాసుల మెడ మీద పెట్టి దేవుని శోధించవచ్చా? అలా చేయకూడదు! 11వారు రక్షణ పొందినట్లే, ప్రభువైన యేసు కృప చేతనే మనం కూడా రక్షణ పొందుకొంటున్నాం అని నమ్ముతున్నాం కదా.”
12బర్నబా మరియు పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరుల మధ్యలో చేసిన అద్బుతాలను సూచక క్రియలను ఆ సభలో వివరిస్తున్నప్పుడు అక్కడ చేరిన వారందరు శ్రధ్ధతో నిశ్శబ్దంగా విన్నారు. 13వారు చెప్పడం ముగించిన తర్వాత, యాకోబు లేచి ఈ విధంగా చెప్పాడు: “సహోదరులారా, నా మాట వినండి. 14యూదేతరులలో నుండి దేవుడు తన నామము కొరకు ప్రజలను ఏర్పరచుకోడానికి తానే మొదట ఎలా జోక్యం చేసుకున్నాడో సీమోను వివరించాడు. 15దీనిని గురించి ప్రవక్తల మాటలు కూడా ఏకీభవిస్తున్నాయి, ఎలాగంటే:
16“ ‘ఆ తర్వాత నేను తిరిగి వచ్చి,
పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతాను.
దాని శిధిలాలను పునర్నిర్మాణం చేస్తాను,
దానిని తిరిగి పునరుద్ధరిస్తాను,
17అప్పుడు మిగిలిన వారందరు,
నా నామంను ధరించిన యూదేతరులు కూడ దేవుని వెదకేలా చేస్తాను,
అని పూర్వం నుండి తెలియచేయబడిన ఈ కార్యములను,
18చేస్తున్న ప్రభువు చెప్తున్నాడు.’#15:18 ఆమోసు 9:11,12
19“కాబట్టి, దేవుని వైపు తిరుగుతున్న యూదేతరులకు మనం కష్టంగా ఉండేలా చేయకూడదనేది నా తీర్పు. 20దానికి బదులుగా, విగ్రహాలకు అర్పించి అపవిత్రపరచిన ఆహారాన్ని తినడం, లైంగిక అనైతికత సంబంధాలను, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, రక్తాన్ని తినడం మానుకోవాలని మనం వారికి ఉత్తరం వ్రాసి తెలియచేయాలి. 21ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రాన్ని అనేక తరాల నుండే ప్రతి పట్టణంలోని సమాజమందిరాల్లో ప్రతి సబ్బాతు దినాన చదువుతూ బోధిస్తున్నారు” అని చెప్పాడు.
యూదులు కాని విశ్వాసులకు పంపబడిన లేఖ
22ఆ తర్వాత అపొస్తలులు మరియు సంఘపెద్దలు సంఘమంతటితో కలిసి, పౌలు బర్నబాలతో పాటు ఇంకొందరు విశ్వాసులను అంతియొకయ ప్రాంతానికి పంపాలని నిర్ణయించి విశ్వాసుల మధ్యలో నాయకులుగా ఉన్న బర్సబ్బా అని పిలువబడే యూదా మరియు సీలను ఏర్పరచుకున్నారు. 23వారితో ఈ ఉత్తరాన్ని పంపించారు:
అపొస్తలులు, మీ సహోదరులైన సంఘపెద్దలు,
అంతియొకయలోను, సిరియలోను, కిలికియ ప్రాంతాలలో నివసించే యూదేతరులలోని విశ్వాసులకు,
శుభములు.
24మా నుండి అనుమతి పొందకుండానే మాలో నుండి కొందరు మీ దగ్గరకు వచ్చి వారు మీతో చెప్పే బోధలతో మిమ్మల్ని కలవరపరుస్తూ, మీ మనస్సులను ఇబ్బంది పెడుతున్నారని మేము విన్నాం. 25కనుక మా నుండి కొంత మందిని ఏర్పరచుకొని మా ప్రియ స్నేహితులైన బర్నబా మరియు పౌలుతో వారిని పంపడానికి మేము అందరం ఒప్పుకొన్నాం. 26మేము పంపించే ఈ ప్రియ స్నేహితులు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట తమ ప్రాణాలను కూడా లెక్కచేయని వారు. 27మేము వ్రాసిన దానిని నోటి మాటలతో దృఢపరచడానికి యూదా మరియు సీలను పంపిస్తున్నాం. 28వీటి కంటే మీ మీద ఎక్కువ భారం మోపకూడదని పరిశుద్ధాత్మకు, మాకు అనిపించిన విషయాలు ఏమనగా: 29విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే మీకు మేలు కలుగుతుంది.
మీకు క్షేమం కలుగును గాక.
30వారు పంపబడిన తర్వాత వారు అక్కడి నుండి బయలుదేరి అంతియొకయ పట్టణానికి వచ్చి, అక్కడ సంఘమంతటిని ఒక్క చోటికి చేర్చి ఈ ఉత్తరాన్ని వారికి అందించారు. 31వారు ఆ ఉత్తరాన్ని చదివి, దానిలోని ప్రోత్సాహపరిచే సందేశాన్ని బట్టి ఎంతో సంతోషించారు. 32యూదా, సీలలు కూడా ప్రవక్తలు కనుక వారు కూడా విశ్వాసులను ప్రోత్సహించి వారిని విశ్వాసంలో బలపరిచారు. 33అక్కడ వారు కొంత కాలం గడిపిన తర్వాత తమను పంపిన వారి దగ్గరకు తిరిగి వెళ్లడానికి విశ్వాసులచే సమాధానంతో పంపబడ్డారు. [34అయితే సీల అక్కడే ఉండాలని నిర్ణయించుకొన్నాడు.]#15:34 కొన్ని వ్రాతప్రతులలో ఈ వాక్యములు ఇక్కడ చేర్చబడలేదు 35కానీ పౌలు మరియు బర్నబాలు అంతియొకయలోనే ఉండి, ఇంకా అనేకులతో కలిసి ప్రభువు సందేశాన్ని బోధిస్తూ ప్రకటించారు.
పౌలు బర్నబాల మధ్య భిన్నాభిప్రాయాలు
36కొంత కాలం తర్వాత పౌలు, “మనం ప్రభువు వాక్యాన్ని ప్రకటించిన అన్ని పట్టణాలకు తిరిగి వెళ్లి, అక్కడి విశ్వాసులను కలుసుకొని వారి క్షేమ సమాచారాలను తెలుసుకొందాం” అని బర్నబాతో అన్నాడు. 37బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకువెళ్లాలని భావించాడు. 38కాని పౌలు, పంఫులియాలో అతడు పరిచర్యకు రాకుండా తమను విడిచిపెట్టి వెళ్లిపోయాడు కనుక అతన్ని తీసుకొని వెళ్లడం మంచిది కాదని తలంచాడు. 39ఆ విషయాన్ని బట్టి వారిద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారిద్దరు వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్ర ద్వీపానికి వెళ్లాడు. 40విశ్వాసులు పౌలును ప్రభువు కృపకు అప్పగించినప్పుడు అతడు సీలను ఎంచుకొని అక్కడ నుండి బయలుదేరాడు. 41వారు సంఘాలను విశ్వాసంలో బలపరస్తు సిరియ కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in