2 కొరింథీ 11
11
పౌలు మరియు అబద్ధ అపొస్తలులు
1నేను కొంత అవివేకంగా మాట్లాడితే, మీరు సహించాలని ఆశిస్తున్నాను. అవును, దయచేసి నన్ను సహించండి! 2దైవికమైన ఆసక్తిని మీ పట్ల నేను కలిగివున్నాను. ఎందుకంటే, మిమ్మల్ని నేను క్రీస్తు అనే ఏకైక భర్తకు ప్రధానం చేశాను, కనుక పవిత్రమైన కన్యలాంటి వారిగా మిమ్మల్ని ఆయనకు అప్పగించాలి. 3అయితే, సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్లు, క్రీస్తులో మీకున్న నిజాయితీ, పవిత్రత నుండి ఏదో ఒక విధంగా మీ మనస్సులు తొలగిపోతాయేమోనని నేను భయపడుతున్నాను. 4ఎవరైన మీ దగ్గరకు వచ్చి మేము ప్రకటించిన యేసును గాక, వేరొక యేసును ప్రకటించినా, లేక మీరు పొందిన ఆత్మకు విరుద్ధమైన వేరొక ఆత్మను మీరు పొందినా, లేక మీరు అంగీకరించింది కాకుండా వేరొక సువార్తను అంగీకరించినా మీరు సుళువుగా సహించేవారేమో.
5“శ్రేష్ఠులైన అపొస్తలుల” కంటే నేను ఏ మాత్రం తక్కువ కాదని నేను అనుకుంటున్నాను. 6మాట్లాడడంలో నేను నేర్పులేని వాన్ని కావచ్చు కాని జ్ఞానంలో కాదు. అన్ని విధాలుగా మేము దీన్ని మీకు పూర్తిగా స్పష్టం చేసాము. 7దేవుని సువార్తను మీకు ఉచితంగా బోధించి, మిమ్మల్ని గొప్పవారిని చేయడానికి నన్ను నేను తగ్గించుకొని పాపం చేసానా? 8మీకు నేను సేవ చేయడానికి ఇతర సంఘాల నుండి సహాయం పొందుట ద్వారా వారిని దోచుకున్నాను. 9అంతేకాక నేను మీతో ఉన్నప్పుడు నాకు సహాయం అవసరమైతే నేను ఎవరికి భారంగా లేను, ఎందుకంటే, మాసిదోనియా నుండి వచ్చిన సహోదరులే నాకు అవసరమైనవన్నీ అందించారు. నేను మీకు భారం కాకుండా ఎలా ఉన్నానో ఇక ముందు కూడా అలాగే ఉంటాను. 10నాలో క్రీస్తు సత్యం ఉన్నందుకు, అకయ ప్రాంతాల్లో నేనిలా గర్వపడకుండ ఎవరు ఆపలేరు. 11ఎందుకు? మీపై నాకు ప్రేమ లేదా? ఉందని దేవునికి తెలుసు!
12గర్వించడానికి కారణం వెదికేవారు తాము గర్వించే వాటిలో మాతో సమానంగా ఉన్నామని వారు ఎంచుకోవడానికి అవకాశం లేకుండా చేయడానికి ఇప్పుడు నేను ఏమి చేస్తున్నానో అదే చేయడం కొసాగిస్తాను. 13అలాంటివారు అబద్ధ అపొస్తలులు, మోసపూరితమైన పనివారు, క్రీస్తు అపొస్తలుల్లా వేషం వేసుకున్నవారు. 14ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు, సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకున్నాడు. 15కాబట్టి వాని సేవకులు కూడా నీతి సేవకుల్లా మారువేషం వేసుకోవడంలో వింత లేదు. వారి క్రియలకు తగిన అంతం వారికి ఉంటుంది.
పౌలు తన శ్రమల గురించి గొప్ప చెప్పుకొనుట
16నన్ను అవివేకిగా ఎవరు భావించవద్దని మరల చెప్తున్నాను; ఒకవేళ మీరు అలా భావిస్తే అవివేకంగానైనా మీరు నన్ను చేర్చుకోండి అప్పుడు నేను కొంచెం గొప్ప చెప్పుకుంటాను. 17ఆత్మవిశ్వాసం బట్టి గొప్ప చెప్పడంలో నేను ప్రభువులా మాట్లాడడం లేదు కాని అవివేకిగానే మాట్లాడుతున్నాను. 18ఈ లోకరీతిగా అనేకమంది గొప్ప చెప్పుకుంటున్నారు కనుక నేను కూడా గొప్ప చెప్పుకుంటాను. 19మీరు ఎంతో వివేకవంతులు కనుక అవివేకులను కూడ సంతోషంగా సహిస్తారు. 20నిజానికి, మిమ్మల్ని ఎవరైనా బానిసలుగా చేసినా, మోసం చేసినా, లేక మిమ్మల్ని చిక్కుల్లో ఇరికించినా, మిమ్మల్ని ముఖంపై కొట్టినా మీరు సహిస్తారు. 21ఆ విషయంలో మేమెంతో బలహీనులమని నేను సిగ్గుతో ఒప్పుకొంటున్నాను.
అయితే ఎవరైనా దేని గురించైనా గొప్పలు చెప్పుకోవడానికి ధైర్యం చేస్తే దాని గురించి నేను కూడా గొప్పలు చెప్పుకోవడానికి ధైర్యం చేస్తాను, నేను అవివేకిగా మాట్లాడుతున్నాను. 22వారు హెబ్రీయులా? నేను కూడా. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా. వారు అబ్రాహాము సంతతి వారా? నేను కూడా. 23వారు క్రీస్తు సేవకులా? నేను మతిలేనివానిలా మాట్లాడుతున్నాను, నేను వారి కంటే ఎక్కువ. నేను ఎంతో కష్టపడి పని చేశాను, ఎక్కువ సార్లు నేను చెరసాలలో ఉన్నాను, చాలా తీవ్రంగా కొరడా దెబ్బలు తిన్నాను, మరల మరల ప్రాణాపాయాలను ఎదుర్కొన్నాను. 24యూదుల చేత ఐదు సార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాను. 25మూడుసార్లు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, మూడుసార్లు ఓడ పగిలి శ్రమపడ్డాను, ఒక రాత్రింబగళ్లు సముద్రంలో గడిపాను, 26తరచుగా ప్రయాణాలు చేస్తున్నాను. నదుల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, తోటి యూదుల వల్ల ఆపదలు, యూదేతరుల వల్ల ఆపదలు నేను ఎదుర్కొన్నాను; పట్టణాల్లో, అడవుల్లో, సముద్రాల మీద ఆపదల్లో పడ్డాను; ఇంకా కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉన్నాను. 27నేను ప్రయాసపడ్డాను కష్టపడ్డాను, తరచూ నిద్ర లేకుండా ఉండేవాడిని; ఆకలి దాహం నాకు తెలుసు, అనేకసార్లు ఆహారం లేకుండా ఉన్నాను; చలితో, వస్త్రాలు లేకుండా ఉన్నాను. 28అన్నిటికంటే మించి సంఘాలన్నిటి గురించిన చింత అనుదినం నాకు కలుగుతుంది. 29ఎవరైనా బలహీనంగా ఉంటే, నేను బలహీనంగా ఉండనా? ఎవరైనా పాపంలో నడిస్తే, నా హృదయం మండదా?
30ఒకవేళ నేను గర్వించాలంటే, నా బలహీనతలను చూపించే వాటిలోనే గర్విస్తాను. 31ఎల్లప్పుడు స్తుతించబడే యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి నేను అబద్ధమాడనని తెలుసు. 32దమస్కులో అరెత అనే రాజు క్రింది అధిపతి నన్ను బంధించడానికి పట్టణం చుట్టు కాపలా ఉంచాడు. 33కాని నేను కిటికీ గుండా గోడ మీద నుండి ఒక గంపలో క్రిందకు దించబడి, వాని చేతుల్లో నుండి తప్పించుకొన్నాను.
Currently Selected:
2 కొరింథీ 11: TCV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.