YouVersion Logo
Search Icon

1 థెస్సలొనీకయులకు 5

5
ప్రభువు దినము
1సహోదరీ సహోదరులారా, యేసు క్రీస్తు రాకడ ఎప్పుడు సంభవిస్తుందో ఆ కాలాలు, సమయాల గురించి మేము మీకు వ్రాయాల్సిన అవసరం లేదు, 2ప్రభువు దినం రాత్రి దొంగలా వస్తుందని మీకు బాగా తెలుసు. 3ప్రజలు, మేము “నెమ్మది కలిగి సురక్షితంగా ఉన్నాం” అని అనుకుంటున్నప్పుడు, ఒక గర్భిణీ స్త్రీకి పురుటినొప్పులు వచ్చునట్లు వారి పైకి నాశనం అకస్మాత్తుగా వస్తుంది, కనుక వారు దాని నుండి తప్పించుకోలేరు.
4అయితే సహోదరీ సహోదరులారా, ఆ దినం దొంగలా మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి మీరు చీకటిలో లేరు. 5మీరంతా వెలుగు సంతానం పగటి సంతానం. మనం చీకటికి లేదా రాత్రికి చెందినవారం కాదు. 6కనుక మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాం. 7నిద్రపోయేవారు రాత్రి వేళ నిద్రపోతారు, మత్తులుగా ఉండేవారా రాత్రి వేళ మత్తులై ఉంటారు. 8అయితే మనం పగటికి చెందినవారం కనుక తెలివి కలిగి, విశ్వాసం ప్రేమ అనే కవచాన్ని, రక్షణ పొందాలనే ఆ ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకొంటాము. 9ఎందుకంటే దేవుడు మనల్ని ఉగ్రతను అనుభవించడానికి నియమించలేదు కాని, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే నియమించారు. 10ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం లోకంలో జీవించి ఉన్నా లేదా మరణించినా ఆయనతోపాటు మనం జీవించాలని క్రీస్తు మనకొరకు చనిపోయారు. 11కనుక మీరిప్పుడు చేస్తున్నట్లుగానే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొంటూ ఒకరిని ఒకరు బలపరచుకోండి.
తుది నియమాలు
12సహోదరీ సహోదరులారా, మీ మధ్యలో ప్రయాసపడుతున్నవారిని, ప్రభువులో మీ కొరకు శ్రద్ధ చూపించేవారిని, మిమ్మల్ని హెచ్చరించేవారిని గౌరవించాలని మేము మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. 13వారి పనిని బట్టి వారిని ప్రేమతో అధికంగా గౌరవించండి. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి. 14సహోదరీ సహోదరులారా, సోమరులను హెచ్చరించుమని, క్రుంగిపోయినవారిని ప్రోత్సాహించుమని, బలహీనులకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరితో సహనం కలిగి ఉండుమని మేము మిమ్మల్ని వేడుకొంటున్నాము. 15మీలో ఎవరూ కీడుకు ప్రతిగా కీడు చేయకుండ చూసుకోండి, అలాగే ప్రతి ఒక్కరికి మంచి చేయడానికే ఎల్లపుడూ ప్రయత్నించండి.
16ఎల్లప్పుడు ఆనందించండి; 17విడువక ప్రార్థించండి, 18మీరు ప్రతి విషయం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశం.
19ఆత్మను అడ్డుకోకండి. 20ప్రవచనాలను తిరస్కరించకండి. 21అన్నిటిని పరీక్షిస్తూ మంచి వాటిని గట్టిగా పట్టుకోండి, 22ప్రతీ కీడును తిరస్కరించండి.
23సమాధానకర్త అయిన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక. 24మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు, కనుక ఆయన ఖచ్చితంగా చేస్తారు.
25సహోదరీ సహోదరులారా, మా కొరకు ప్రార్థించండి.
26దేవుని ప్రజలందరికి పవిత్ర ముద్దుతో వందనాలు.
27సహోదరీ సహోదరులందరికి ఈ పత్రికను చదివి వినిపించాలని ప్రభువు పేరట మిమ్మల్ని ఆదేశిస్తున్నాను.
28మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీతో ఉండును గాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in