జెఫన్యా 3
3
యెరూషలేం భవిష్యత్తు
1యెరూషలేమూ, నీ ప్రజలు దేవునికి విరోధంగా యుద్ధం చేశారు! నీ ప్రజలు ఇతరులను బాధించారు, నీవు పాపంతో అపవిత్రమయ్యావు. 2నీ ప్రజలు నా మాట వినలేదు! వారు నా ప్రబోధాలు అంగీకరించలేదు. యెరూషలేము యెహోవాను నమ్మలేదు. యెరూషలేము తన దేవుని దగ్గరకు వెళ్ళలేదు. 3యెరూషలేము నాయకులు గర్జించే సింహాల్లా ఉన్నారు. దాని న్యాయమూర్తులు గొర్రెలమీద దాడి చేసేందుకు రాత్రివేళ వచ్చి ఉదయానికి ఏమీ మిగల్చని ఆకలిగొన్న తోడేళ్లలా ఉన్నారు. 4దాని ప్రవక్తలు ఇంకా, ఇంకా ఎక్కువ సంపాదించటం కోసం ఎల్లప్పుడూ వారి రహస్య పథకాలు వేస్తూనే ఉన్నారు. దాని యాజకులు పవిత్రమైన విషయాలను పవిత్రం కానట్టే చూశారు. దేవుని ప్రబోధాలను వారు అతిక్రమించారు. 5కాని దేవుడు ఇంకా ఆ పట్టణంలో ఉన్నాడు. మరియు ఆయన మంచివాడుగానే కొనసాగుతున్నాడు. దేవుడు తప్పు ఏమీ చేయడు. ఆయన తన ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రజలు మంచి నిర్ణయాలు చేసేందుకు ఆయన వారికి ప్రతి ఉదయం సహాయం చేస్తాడు. కాని ఆ దుర్మార్గులు తాము చేసే చెడ్డ పనుల విషయంలో సిగ్గుపడరు.
6దేవుడు చెపుతున్నాడు: “నేను మొత్తం జన సమూహాలను నాశనం చేశాను. నేను వారి సంరక్షణా దుర్గాలను నాశనం చేశాను. నేను వారి వీధులను నాశనం చేశాను, అక్కడకు ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళరు. వారి పట్టణాలు ఖాళీ, అక్కడ ఇంకెంత మాత్రమూ ఎవ్వరూ నివసించరు. 7నీవు ఒక పాఠం నేర్చుకోవాలని ఈ సంగతులు నీతో నేను చెబుతున్నాను. నీవు నాకు భయపడి, నన్ను గౌరవించాలని నేను కోరుతున్నాను. ఒకవేళ నీవు ఇలా చేస్తే, నీ ఇల్లు నాశనం చేయబడదు. నీవు ఇలా చేస్తే, నా పథకం ప్రకారం నిన్ను నేను శిక్షించాల్సి ఉండదు.” కాని ఆ చెడ్డ ప్రజలు ఇదివరకే చేసిన ఆ చెడుకార్యాలనే ఇంకా ఎక్కువగా చేయాలనుకొన్నారు!
8యెహోవా చెప్పాడు: “కనుక కొంచెం వేచి ఉండండి! నేను నిలిచి మీకు తీర్పు చెప్పేంతవరకు వేచి ఉండండి. అనేక దేశాలనుండి మనుష్యులను రప్పించి, మిమ్మల్ని శిక్షించేందుకు వారిని వాడుకొనే హక్కు నాకు ఉంది. మీ మీద నా కోపం చూపించేందుకు నేను ఆ ప్రజలను వాడుకొంటాను. నాకు ఎంత చికాకు కలిగిందో చూపించేందుకు నేను వారిని వాడుకొంటాను. మరియు మొత్తం దేశం నాశనం చేయబడుతుంది! 9అప్పుడు నేను ఇతర జనాంగములనుండి ప్రజలను మార్పు చేస్తాను. కాబట్టి వారు స్పష్టంగా మాట్లాడుతూ ప్రభువు నామాన్ని పేరుపెట్టి పిలువగలరు. వారందరూ ఒకే ప్రజగా కూడి నన్ను ఆరాధిస్తారు. 10కూషు దేశంలోని నది ఆవలివైపున, అంత దూరంనుండి ప్రజలు వస్తారు. చెదరిపోయిన నా ప్రజలు నా దగ్గరకు వస్తారు. నా భక్తులు వస్తారు. మరియు నాకు వారు కానుకలు తెస్తారు.
11“యెరూషలేమూ, అప్పుడు నీవు, నీ ప్రజలు నాకు విరోధంగా చేసే చెడు విషయాలనుగూర్చి ఇంకెంత మాత్రం సిగ్గుపడవు. ఎందుకంటే, ఆ దుర్మార్గులందరినీ యెరూషలేమునుండి నేను తొలగించి వేస్తాను. ఆ గర్విష్ఠులందరినీ నేను తొలగించివేస్తాను. నా పరిశుద్ధ పర్వతంమీద ఆ గర్విష్ఠులు ఎవ్వరూ ఉండరు. 12దీనులను, సాత్వికులను మాత్రమే నేను నా పట్టణంలో (యెరూషలేము) ఉండనిస్తాను. మరియు వారు యెహోవా నామాన్ని నమ్ముకొంటారు. 13ఇశ్రాయేలులో మిగిలినవారు చెడు పనులు చేయరు. వారు అబద్ధాలు చెప్పరు. వారు అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించరు. వారు తిని, ప్రశాంతంగా పడుకొనే గొర్రెల్లా ఉంటారు-వారిని ఎవరూ ఇబ్బంది పెట్టరు.”
ఒక ఆనంద గానం
14యెరూషలేమా! పాడుతూ సంతోషంగా ఉండు!
ఇశ్రాయేలూ, ఆనందంగా కేకలు వేయి!
యెరూషలేమా, సంతోషించి సరదాగా ఉండు!
15ఎందుకంటే, నీ శిక్షను యెహోవా నిలిపివేశాడు గనుక!
నీ శత్రువుల బలమైన దుర్గాలను ఆయన నాశనం చేశాడు!
ఇశ్రాయేలు రాజా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు.
ఏ చెడు విషయం జరుగుతున్నా దాన్నిగూర్చి నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు.
16ఆ సమయంలో యెరూషలేముతో ఇలా చెప్పబడుతుంది:
“బలంగా ఉండు, భయపడవద్దు!
17నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు.
ఆయన శక్తిమంతుడైన సైనికునిలా ఉన్నాడు.
ఆయన నిన్ను రక్షిస్తాడు.
ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఆయన నీకు చూపిస్తాడు.
ఆయన నీగురించి సంతోషపడతాడు, నీవంటే ఆనందిస్తాడు.
విందులో పాల్గొన్నవారివలె ఆయన నీ విషయంలో నవ్వుతూ సంతోషిస్తాడు.
18అది విందులో పాల్గొన్న ప్రజల్లా ఉంటుంది.”
యెహోవా చెప్పాడు: “నీ అవమానాన్ని నేను తొలగించివేస్తాను.
ఆ ప్రజలు నిన్ను బాధించకుండునట్లు నేను చేస్తాను.
19ఆ సమయంలో, నిన్ను బాధించేవారిని నేను శిక్షిస్తాను.
బాధించబడిన నా ప్రజలను నేను రక్షిస్తాను.
పారిపోయేలా బలవంతం చేయబడిన ప్రజలను నేను తిరిగి వెనుకకు తీసుకొనివస్తాను.
మరియు నేను వారిని ప్రసిద్ధి చేస్తాను.
అన్ని చోట్లా ప్రజలు వారిని పొగడుతారు.
20ఆ సమయంలో, నిన్ను నేను వెనుకకు తీసుకొని వస్తాను.
నేను నిన్ను సమకూర్చి తీసుకొని వస్తాను.
నిన్నునేను ప్రసిద్ధి చేస్తాను. అన్ని చోట్లా ప్రజలు నిన్ను పొగడుతారు.
నీ సొంత కళ్ళయెదుట బందీలను తిరిగి నేను వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది జరుగుతుంది!”
ఆ సంగతులు యెహోవా చెప్పాడు.
Currently Selected:
జెఫన్యా 3: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International