YouVersion Logo
Search Icon

జెఫన్యా 1

1
1ఇది జెఫన్యాకు యెహోవా ఇచ్చిన సందేశం. ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజుగా ఉన్న కాలంలో జెఫన్యా ఈ సందేశం అందుకొన్నాడు. జెఫన్యా కూషీ కుమారుడు. కూషీ గెదల్యా కుమారుడు. గెదల్యా అమర్యా కుమారుడు. అమర్యా హిజ్కియా కుమారుడు.
ప్రజలకు యెహోవా తీర్పు దినం
2“భూమి మీదనున్న సమస్తాన్ని నేను నాశనం చేస్తాను! 3మనుష్యులందరినీ, జంతువులన్నింటినీ నేను నాశనం చేస్తాను. ఆకాశంలో పక్షుల్ని, సముద్రంలో చేపల్ని నేను నాశనం చేస్తాను. దుర్మార్గులను, వారిచేత పాపం చేయించే వాటన్నింటినీ#1:3 వాటన్నింటినీ వాళ్ల విగ్రహాలను గూర్చి తెలుపుతుంది. నేను నాశనం చేస్తాను. భూమి మీద నుండి మనుష్యులందరినీ నేను తొలగించి వేస్తాను” అని యెహోవా చెపుతున్నాడు.
4ఈ సంగతులను యెహోవా చెప్పాడు: “యూదాను మరియు యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను నేను శిక్షిస్తాను. ఆ స్థలంనుండి నేను వీటిని తీసివేస్తాను. బయలు దేవత పూజ చివరి గుర్తులను నేను తొలగించి వేస్తాను. నేను పూజారులను తొలగించి వేస్తాను. 5నక్షత్రాలను పూజించుటకు వారి యింటి కప్పుల మీదికి వెళ్ళే వారందరినీ నేను తొలగించి వేస్తాను. ఆ బూటకవు యాజకులను ప్రజలు మరచి పోతారు. కొంతమంది నన్ను పూజిస్తున్నామని అంటారు. ఆ ప్రజలు నన్ను ఆరాధిస్తామని వాగ్దానం చేసారు. కాని ఇప్పుడు వారు బూటకపు దేవత మిల్కోమును పూజిస్తున్నారు. కనుక ఆ ప్రజలను ఆ స్థలంనుండి నేను తొలగించి వేస్తాను. 6కొందరు మనుష్యులు యెహోవానుండి తిరిగిపోయారు. వారు నన్ను వెంబడించుట విడిచిపెట్టారు. ఆ ప్రజలు సహాయంకోసం యెహోవాను అడగటం మానివేసారు. కనుక నేను ఆ ప్రజలను ఆ స్థలంనుండి తొలగించివేస్తాను.”
7నా ప్రభువైన యెహోవాముందు నిశ్శబ్దంగా ఉండు! ఎందుచేతనంటే, ప్రజలకు యెహోవా తీర్పు చెప్పే దినం త్వరలో వస్తుంది గనుక! యెహోవా తన బలిని సిద్ధం చేశాడు. తాను ఆహ్వానించిన అతిథులతో సిద్ధంగా ఉండమని చెప్పాడు.
8“బలి అర్పించే యెహోవా దినాన రాజకుమారులను, ఇతర నాయకులను నేను శిక్షిస్తాను. విదేశీ వస్త్రాలు ధరించిన ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. 9ఆ సమయంలో గుమ్మం దాటిన ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. అబద్ధాలతో, హింసతో యజమాని ఇంటిని నింపిన వారిని నేను శిక్షిస్తాను” అని యెహోవా చెప్పాడు.
10యెహోవా ఇంకా ఇలా చెప్పాడు, “ఆ సమయంలో యెరుషలేములోని చేప ద్వారం దగ్గర ప్రజలు సహాయంకోసం కేకలు వేస్తారు. పట్టణంలోని ఇతర చోట్ల ప్రజలు ఏడుస్తుంటారు. పట్టణం చుట్టూరా కొండల్లో నాశనం చేయబడుతున్నవాటి పెద్ద శబ్దాలను ప్రజలు వింటారు. 11పట్టణం దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలారా, మీరు ఏడుస్తారు. ఎందుకు? ఎందుకంటే వ్యాపారస్తులు, ధనిక వర్తకులు అందరూ నాశనం చేయబడతారు గనుక.
12“ఆ సమయంలో నేను దీపం పట్టుకొని యెరూషలేము అంతటా వెదకుతాను. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ తృప్తిపడుతోన్న మనుష్యులందరినీ నేను కనుగొంటాను. ఆ ప్రజలు, ‘యెహోవా ఏమీ చేయడు. ఆయన సహాయం చేయడు, ఆయన బాధించడు’ అని అంటారు. అలాంటి వారిని నేను కనుగొని, వారిని శిక్షిస్తాను! 13అప్పుడు మిగిలిన వారు, వారి ఐశ్వర్యాలను తీసికొని వారి ఇండ్లను నాశనం చేస్తారు. ఆ సమయంలో ఇండ్లు కట్టుకొన్నవారు వాటిలో నివసించరు. మరియు ద్రాక్షాతోటలు నాటుకొన్నవారు ఆ ద్రాక్షాపండ్ల రసం తాగరు. ఇతరులకు అవి లభిస్తాయి.”
14యెహోవా తీర్పు తీర్చే ప్రత్యేక దినం త్వరగా వచ్చేస్తుంది! ఆ రోజు దగ్గర్లో ఉంది; మరియు వేగంగా వచ్చేస్తుంది. యెహోవా ప్రత్యేక తీర్పు దినాన ప్రజలు విచారకరమైన శబ్దాలు వింటారు. బలమైన సైనికులు కూడ ఏడుస్తారు! 15ఆ సమయంలో దేవుడు తన కోపం చూపిస్తాడు. అది భయంకరమైన కష్టకాలంగా ఉంటుంది. అది విధ్వంస సమయంగా ఉంటుంది. అది చీకటి, మబ్బు, తుఫాను రోజుగా, చీకటి సమయంగా ఉంటుంది. 16అది భద్రతా గోపురాలలో, సంరక్షిత పట్టణాలలో ప్రజలు బూరలూ, బాకాలూ వినే యుద్ధ సమయంలా ఉంటుంది.
17యెహోవా ఇలా చెప్పాడు: “నేను ప్రజలకు జీవితం చాలా దుర్భరం చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా నడిచే గుడ్డివారిలా ప్రజలు అటు ఇటు నడుస్తారు. ఎందుకంటే, ఆ ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేసారు గనుక. అనేకమంది ప్రజలు చంపబడతారు. వారి రక్తం నేలమీద చిందుతుంది. వారి మృతదేహాలు నేలమీద పెంట కుప్పలా ఉంటాయి. 18వారి బంగారం, వెండి వారికి యెహోవా ఉగ్రత దినంలో సహాయం చేయవు! ఆ సమయంలో యెహోవా చాలా చికాకుపడి కోపంగా ఉంటాడు. యెహోవా మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. భూమిమీద ప్రతి ఒక్కరినీ యెహోవా సర్వనాశనం చేస్తాడు!”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for జెఫన్యా 1