రోమీయులకు వ్రాసిన లేఖ 12
12
క్రొత్త జీవితము
1అందువల్ల నా సోదరులారా! నేను మీకీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుడు తన అనుగ్రహం చూపించాడు కనుక మీ జీవితాల్ని ఆయనకు అర్పించుకోండి. ఆయనకు ఆనందం కలిగేటట్లు పవిత్రంగా జీవించండి. ఇదే మీరు చేయవలసిన నిజమైన సేవ! 2ఇక మీదట ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనస్సు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అప్పుడు మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని, అది ఉత్తమమైనదనీ, ఆనందం కలిగిస్తుందనీ, పరిపూర్ణమైనదనీ గ్రహిస్తారు!
3దేవుడు నాకిచ్చిన అనుగ్రహాన్ని ఆధారంగా తీసుకొని మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మిమ్మల్ని గురించి మీరు ఉన్నదాని కంటే గొప్పగా భావించకండి. సక్రమంగా ఉండి దేవుడిచ్చిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. 4దేహానికి ఎన్నో అవయవాలుంటాయి. ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. 5అదే విధంగా అధిక సంఖ్యలో ఉన్న మనమంతా క్రీస్తులో ఒకే దేహంగా రూపొందింపబడ్డాము. ప్రతి సభ్యునికి మిగతా సభ్యులతో సంబంధం ఉంది.
6దేవుని అనుగ్రహం వల్ల మనందరికి రకరకాల కృపావరాలు లభించాయి. దైవసందేశాన్ని గురించి మాట్లాడే వరాన్ని పొందినవాళ్ళు ఆ పనిని విశ్వాసంతో చెయ్యాలి. 7సేవ చేసే వరం పొందినవాళ్ళు సేవ చెయ్యాలి. బోధించే వరం పొందినవాళ్ళు బోధించాలి. 8ప్రజలను ప్రోత్సాహపరచే వరం పొందినవాళ్ళు ప్రోత్సాహ పరచాలి. దానం చేసే వరం పొందినవాళ్ళు ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహించాలని వరం పొందినవాళ్ళు శ్రద్ధతో నాయకత్వం చెయ్యాలి. దయ చూపాలని వరం పొందినవాళ్ళు ఆనందంగా దయ చూపాలి.
9ప్రేమలో నిజాయితీగా ఉండండి. దుర్మార్గాన్ని ద్వేషించండి. మంచిని అంటి పెట్టుకొని ఉండండి. 10సోదర ప్రేమతో, మమతతో ఉండండి. మీ సోదరులను మీకన్నా అధికులుగా భావించి గౌరవిస్తూ ఉండండి. 11ఉత్సాహాన్ని వదులుకోకుండా ఉత్తేజితమైన ఆత్మతో ప్రభువు సేవ చేయండి. 12పరలోకం లభిస్తుందన్న ఆశతో ఆనందం పొందుతూ, కష్ట సమయాల్లో సహనం వహించి, అన్ని వేళలా విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండండి. 13మీ సహాయం అవసరమున్న దేవుని ప్రజలతో మీకున్న వాటిని పంచుకోండి. ఆతిథ్యాన్ని మరువకండి.
14మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళను ఆశీర్వదించండి. ఆశీర్వదించాలి కాని, దూషించకూడదు. 15ఆనందంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, దుఃఖంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి. 16అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించండి. గర్వించకండి. తక్కువ స్థాయిగలవాళ్ళతో సహవాసం చెయ్యండి. మీలో మాత్రమే జ్ఞానం ఉందని భావించకండి.
17కీడు చేసినవాళ్ళకు కీడు చెయ్యకండి. ప్రతి ఒక్కరి దృష్టిలో మంచిదనిపించేదాన్ని చెయ్యటానికి జాగ్రత్త పడండి. 18అందరితో శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. 19మిత్రులారా! పగ తీర్చకోకండి. ఆగ్రహం చూపటానికి దేవునికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే లేఖనాల్లో,
“పగ తీర్చుకోవటం నా వంతు.
నేను ప్రతీకారం తీసుకొంటాను”#ద్వితీ. 32:35.
అని వ్రాయబడి ఉంది. 20దానికి మారుగా,
“మీ శత్రువు ఆకలితో ఉంటే
అతనికి ఆహారం ఇవ్వండి.
అతనికి దాహం వేస్తుంటే నీళ్ళివ్వండి.
ఇలా చేయటం వల్ల కాలే నిప్పులు అతని
తలపై కుమ్మరించినట్లు అతనికి అనిపిస్తుంది”#సామె. 25:21-22.
అని వ్రాయబడి ఉంది. 21చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి.
Currently Selected:
రోమీయులకు వ్రాసిన లేఖ 12: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International