ప్రకటన గ్రంథము 6
6
ముద్రలు
1ఆ గొఱ్ఱెపిల్ల ఆ ఏడింటిలో మొదటి ముద్రను తెరవటం చూసాను. ఆ నాలుగు ప్రాణుల్లో ఒక ప్రాణి “రా!” అని ఉరుముతూ అనటం విన్నాను. 2నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దానిమీద స్వారి చేస్తున్నవాడు విల్లు పట్టుకొని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం యివ్వబడింది. అతడు విజయం సాధించాలని నిర్ణయించుకొన్న వీరునిలా స్వారి చేస్తూ యుద్ధరంగానికి వెళ్ళిపోయాడు.
3ఆ గొఱ్ఱెపిల్ల రెండవ ముద్రను తీసినప్పుడు రెండవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. 4అప్పుడు యింకొక గుఱ్ఱం వెలుపలికి వచ్చింది. అది ఎఱ్ఱటి రంగులో ఉంది. భూమ్మీద శాంతి లేకుండా చేయటానికి, మానవులు ఒకరినొకరు వధించుకొనేటట్లు చేయటానికి, దాని రౌతుకు అధికారం యివ్వబడింది. అతనికి ఒక పెద్ద ఖడ్గం యివ్వబడింది.
5ఆ గొఱ్ఱెపిల్ల మూడవ ముద్రను తీసినప్పుడు మూడవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. నా ముందు ఒక నల్లటి గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు చేతిలో ఒక తక్కెడ ఉంది. 6అప్పుడు ఆ నాలుగు ప్రాణులనుండి ఒక స్వరం, “ఒక దేనారమునకు ఒక సేరు గోధుమలు, ఒక దేనారమునకు మూడు సేర్లు యవలు; నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దు!” అని అనటం వినిపించింది.
7ఆ గొఱ్ఱెపిల్ల నాల్గవ ముద్రను తీసినప్పుడు నాల్గవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. 8అక్కడ నా ముందు పాలిపోయినట్టుగా ఉన్న ఒక గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు పేరు “మృత్యువు.”#6:8 మృత్యువు ఈ పదానికి ఉపయోగించబడిన గ్రీకు పదం “రోగం” అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. మృత్యులోకము వానిని అనుసరిస్తూ వాని వెనుకనే ఉంది. భూమి నాల్గవ వంతుపై అతనికి అధికారం యివ్వబడింది. కత్తితో, కరువుతో, తెగులుతో, క్రూర మృగాలతో భూనివాసులను చంపటానికి అతనికి అధికారం యివ్వబడింది.
9ఆ గొఱ్ఱెపిల్ల ఐదవ ముద్రను తీసినప్పుడు, వధింపబడిన ఆత్మల్ని బలిపీఠం క్రింద చూసాను. వీళ్ళు దేవుని సందేశాన్ని బోధించటంవల్ల మరియు సాక్ష్యం చెప్పటంవల్ల వధింపబడినవాళ్ళు. 10వాళ్ళు పెద్ద స్వరంతో, “మహా ప్రభూ! నీవు పరిశుద్ధుడవు, సత్యవంతుడవు. ఈ భూమ్మీద నివసించేవాళ్ళపై తీర్పు చెప్పటానికి, మా రక్తము నిమిత్తము పగ తీర్చుకోవటానికి యింకా ఎంతకాలం పడ్తుంది?” అని అన్నారు. 11ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక తెల్లటి వస్త్రం యివ్వబడింది. “మీరు చంపబడినట్లే, మీ తోటి సేవకులు, సోదరులు చంపబడతారు. వాళ్ళ సంఖ్య ముగిసే వరకు మీరు మరికొంత కాలం కాచుకొని ఉండాలి” అని వాళ్ళకు తెలుపబడింది.
12ఆయన ఆరవ ముద్రను విప్పుతూ ఉంటే నేను చూసాను. ఒక పెద్ద భూకంపం కలిగింది. గొఱ్ఱె బొచ్చుతో చేసిన గొంగళిలాగా, సూర్యగోళం నల్లగా మారిపోయింది. పున్నమి చంద్రబింబం ఎఱ్ఱటి రక్తంలా మారిపోయింది. 13తీవ్రంగా గాలి వీచినప్పుడు, కాలం కాని కాలంలో కాచిన అంజూరపు పండ్లు క్రింద పడినట్లు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు భూమ్మీద పడ్డాయి. 14ఆకాశం కాగితంలా చుట్టుకుపోయి మాయమైపోయింది. అన్ని పర్వతాలు, ద్వీపాలు స్థానం తప్పాయి.
15అప్పుడు ఈ భూమిని పాలించే రాజులు, యువరాజులు, సైన్యాధిపతులు, శ్రీమంతులు, శక్తివంతులు, బానిసలు, బానిసలు కానివాళ్ళు గుహల్లో, పర్వతాలపై ఉన్న రాళ్ళ మధ్య దాక్కొన్నారు. 16వాళ్ళు పర్వతాలను, రాళ్ళను పిలుస్తూ, “మాకు అడ్డంగా పడి మమ్మల్ని సింహాసనంపై కూర్చొన్నవానినుండి, ఆ గొఱ్ఱెపిల్ల కోపంనుండి కాపాడండి. 17ఆయన ఆగ్రహం చూపించే గొప్ప దినం వచ్చింది! దాన్ని ఎవరు ఎదుర్కోగలరు?” అని అన్నారు.
Currently Selected:
ప్రకటన గ్రంథము 6: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International