ప్రకటన గ్రంథము 12
12
స్త్రీ, ఘటసర్పం
1పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, చంద్రుణ్ణి తన పాదాల క్రింద, పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని తలపై పెట్టుకొన్న ఒక స్త్రీ కనిపించింది. 2ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటంవల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది.
3అప్పుడు పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. ఒక పెద్ద ఘటసర్పం, ఏడు తలలతో, పది కొమ్ములతో కనిపించింది. అది ఎర్రగా ఉంది. ఆ ఏడు తలలమీద ఏడు కిరీటాలు ఉన్నాయి. 4ఆ ఘటసర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాలలో మూడవభాగాన్ని ఊడ్చి, వాటిని భూమ్మీదికి పారవేసింది. ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఆ శిశువును మ్రింగి వేద్దామని, ఆ ఘటసర్పం ప్రసవించబోయే ఆ స్త్రీ ముందు నిలబడివుంది.
5ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ బాలుడు దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆ శిశువు ఎత్తబడి దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళబడ్డాడు. 6ఆ స్త్రీ ఎడారి ప్రాంతానికి పారిపోయింది. ఆమెను పన్నెండువందల అరువది రోజుల దాకా జాగ్రత్తగా చూసుకోవటానికి దేవుడు ఒక స్థలం ఏర్పాటు చేశాడు.
7పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఘటసర్పంతో యుద్ధం చేసారు. ఘటసర్పం తన దూతలతో తిరిగి యుద్ధం చేసింది. 8ఆ ఘటసర్పానికి తగినంత శక్తి ఉండనందువల్ల ఓడిపోయి పరలోకంలో వాటి స్థానాన్ని పోగొట్టుకొన్నాయి. 9వాళ్ళు ఆ ఘటసర్పాన్ని భూమ్మీదికి త్రోసి వేశారు. ఇది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఆది సర్పం. చాలాకాలం నుండి ఉన్న ఈ ఘటసర్పానికి దయ్యమని, సాతాను అని పేరు. ఆ ఘటసర్పాన్ని, దాని దూతల్ని వాళ్ళు క్రిందికి త్రోసివేశారు.
10పరలోకం నుండి ఒక పెద్ద స్వరం బిగ్గరగా యిలా అనటం విన్నాను: “మనదేవుని ముందు మన సోదరుల్ని రాత్రింబగళ్ళు నిందించే వాడు క్రిందికి త్రోసివేయబడ్డాడు. అందుకే మన దేవుని రాజ్యం వచ్చింది. రక్షణ శక్తి లభించింది. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. 11గొఱ్ఱెపిల్ల రక్తంతో, తాము బోధించిన సత్యంతో మన సోదరులు వాణ్ణి ఓడించారు. వాళ్ళు తమ జీవితాల్ని, చావుకు భయపడేటంతగా ప్రేమించ లేదు. 12కనుక పరలోకమా! ఆనందించు. పరలోకంలో ఉన్నవారలారా! ఆనందించండి. ప్రపంచమా! నీలో సాతాను ప్రవేశించాడు కనుక నీకు శాపం కలుగుతుంది! సముద్రమా! నీకు శాపం కలుగుతుంది! సాతానుకు తన కాలం తీరిందని తెలుసు. కనుక వాడు చాలా కోపంతో ఉన్నాడు.”
13ఘటసర్పం తాను భూమ్మీదకు విసిరివేయబడటం గమనించి మగ శిశువును ప్రసవించిన స్త్రీని వెంటాడింది. 14ఆమెకోసం ఎడారి ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన స్థలానికి ఆమె ఎగిరి పోవటానికి, దేవుడు ఆమెకు రెండు పక్షిరాజు రెక్కల్ని యిచ్చాడు. అక్కడ ఆ ఘటసర్పానికి దూరంగా ఆమె మూడున్నర సంవత్సరాలు జాగ్రత్తగా పోషించబడుతుంది. 15ఆ సర్పం తన నోటినుండి నీళ్ళను వదిలింది. ఆ నీళ్ళు ఒక నదిలా ప్రవహించాయి. ఆ నీళ్ళు ఆమెను కొట్టుకు పోయేటట్లు చేయాలని ఆ ఘటసర్పం ప్రయత్నించింది. 16కాని భూమి తన నోరు తెరిచి ఘటసర్పం కక్కిన నీటిని త్రాగి ఆ స్త్రీని రక్షించింది. 17ఆ స్త్రీని చూసి ఘటసర్పానికి చాలా కోపం వచ్చింది. అది ఆమె యొక్క మిగతా సంతానంతో యుద్ధం చేయాలని వెళ్ళింది. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ యేసును గురించి సాక్ష్యం చెప్పింది ఈమె మిగతా సంతానమే.
18వారితో యుద్ధం చేయటానికి ఆ ఘట సర్పం సముద్రతీరం దగ్గర నిలబడి ఉంది.
Currently Selected:
ప్రకటన గ్రంథము 12: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International