YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 109

109
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
1దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు.
2దుర్మార్గులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
నిజం కాని సంగతులు ఆ అబద్ధికులు చెబుతున్నారు.
3ప్రజలు నన్ను గూర్చి ద్వేషపూరిత విషయాలు చెబుతున్నారు.
ఏ కారణం లేకుండానే ప్రజలు నా మీద దాడి చేస్తున్నారు.
4నేను వారిని ప్రేమిస్తున్నాను. కాని వారు నన్ను ద్వేషిస్తున్నారు.
కనుక దేవా, ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
5ఆ ప్రజలకు నేను మంచి పనులు చేశాను.
కాని వారు నాకు చెడ్డపనులు చేస్తున్నారు.
నేను వారిని ప్రేమించాను.
కాని వారు నన్ను ద్వేషించారు.
6నా శత్రువు చేసిన చెడు కార్యాల కోసం అతనిని శిక్షించుము.
వానిదే తప్పు అని రుజువు చేయగల ఒక మనిషిని చూడుము.
7నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయవాదిని తీర్పు చెప్పనీయుము.
నా శత్రువు చెప్పే ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయుము.
8నా శత్రువును త్వరగా చావనిమ్ము.
నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక!
9నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని భార్య విధవరాలు అగుగాక!
10వాళ్లు వారి ఇల్లు పోగొట్టుకొని భిక్షగాళ్లు అగుదురు గాక!
11నా శత్రువు ఎవరికైతే పైకం బాకీ ఉన్నాడో వాళ్లు అతనికి ఉన్నదంతా తీసుకోనివ్వుము.
అతని కష్టార్జితం అంతా తెలియని వాళ్లెవరినో తీసికోనివ్వుము.
12నా శత్రువుకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
అతని పిల్లలకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
13నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము.
తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక.
14నా శత్రువు తండ్రి పాపాలను, తల్లి పాపాలను
యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
15ఆ పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
ప్రజలు నా శత్రువును పూర్తిగా మరచిపోయేటట్టు యెహోవా వారిని బలవంతం చేస్తాడని నా ఆశ.
16ఎందుకంటే, ఆ దుర్మార్గుడు ఎన్నడూ ఏ మంచీ చేయలేదు.
అతడు ఎన్నడూ ఎవరిని ప్రేమించలేదు.
అతడు నిరుపేద, నిస్సహాయ ప్రజలకు జీవితం ఎంతో కష్టతరం చేసాడు.
17ప్రజలకు సంభవించే చెడు సంగతులు, శాపము చూడటానికి ఆ దుర్మార్గునికి ఎంతో ఇష్టం.
కనుక ఆ చెడు సంగతులు అతనికే సంభవించనిమ్ము.
ప్రజల కోసం మంచి సంగతులు జరగాలని ఆ దుర్మార్గుడు ఎన్నడూ అడుగలేదు.
కనుక అతనికి మంచి సంగతులేవీ జరుగనివ్వకుము.
18శాపాలే వానికి వస్త్రాలుగా ఉండనిమ్ము.
దుర్మార్గులు త్రాగేందుకు శాపాలే నీళ్లుగా ఉండనిమ్ము
శాపాలే వాని శరీరం మీద తైలంగా ఉండనిమ్ము.
19శాపాలే ఆ దుర్మార్గునికి చుట్టే వస్త్రాలుగా ఉండనిమ్ము.
శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండనిమ్ము.
20నా శత్రువుకు వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
నన్ను చంపాలని చూస్తున్న మనుష్యులందరికీ వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
21యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు.
నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము.
22నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని,
నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది.
23దినాంతంలో దీర్ఘ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది.
ఎవరో నలిపివేసిన నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
24నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి.
నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను.
25చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు.
వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు.
26దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము!
నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము.
27అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు.
28ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు.
వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము.
అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను.
29నా శత్రువులను ఇబ్బంది పెట్టుము!
వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము.
30యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను.
31ఎందుకంటే, నిస్సహాయ ప్రజల పక్షంగా యెహోవా నిలిచి ఉన్నాడు.
వారిని మరణానికి అప్పగించాలని ప్రయత్నించే వారి నుండి దేవుడు వారిని రక్షిస్తాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in