కీర్తనల గ్రంథము 105
105
1యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము.
ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
2యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము.
ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
3యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు.
యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
4బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి.
సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
5యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
6దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు.
దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
7యెహోవా మన దేవుడు.
యెహోవా సర్వలోకాన్ని పాలిస్తాడు.#105:7 యెహోవా … పాలిస్తాడు అక్షరార్థముగా “ఆయన ఆజ్ఞలు ప్రపంచమంతటిలో ఉన్నవి.”
8దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి.
వెయ్యి తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి.
9దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు.
ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.
10యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు.
ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు.
11“నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.”
అని దేవుడు చెప్పాడు.
12అబ్రాహాము కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం చేశాడు.
మరియు వారు కనానులో నివసిస్తున్న యాత్రికులు మాత్రమే.
13దేశం నుండి దేశానికి, రాజ్యం నుండి రాజ్యానికి
వారు ప్రయాణం చేసారు.
14కాని యితర మనుష్యులు ఆ కుటుంబాన్ని బాధించనియ్యకుండా దేవుడు చేసాడు.
వారిని బాధించవద్దని దేవుడు రాజులను హెచ్చరించాడు.
15“నేను ఏర్పాటు చేసుకొన్న నా ప్రజలను బాధించవద్దు.
నా ప్రవక్తలకు ఎలాంటి కీడూ చేయవద్దు.” అని దేవుడు చెప్పాడు.
16దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు.
ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు.
17అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు యోసేపు అనే మనిషిని పంపించాడు.
యోసేపు ఒక బానిసవలె అమ్మబడ్డాడు.
18యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు.
అతని మెడకు వారు ఒక ఇనుప కంటె వేశారు.
19యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేంతవరకు
అతడు (యోసేపు) బానిసగా చెప్పింది సరియైనది అని యెహోవా సందేశం రుజువు చేసింది.
20కనుక యోసేపును విడుదల చేయమని ఈజిప్టు రాజు ఆదేశించాడు.
అనేక మందికి అధికారిగా ఉన్న అతనిని కారాగారం నుండి వెళ్లనిచ్చాడు.
21అతడు యోసేపును తన ఇంటికి యజమానిగా నియమించాడు.
రాజ్యంలో అన్ని విషయాలను గూర్చి యోసేపు జాగ్రత్త తీసుకొన్నాడు.
22యోసేపు యితర నాయకులకు హెచ్చరిక ఇచ్చాడు.
పెద్ద మనుష్యులకు యోసేపు నేర్పించాడు.
23తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు.
యాకోబు హాము దేశంలో#105:23 హాము దేశం ఈజిప్టు వారు హాము వంశస్థులని బైబిలు తెలియజేస్తుంది. నివసించాడు.
24యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది.
వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు.
25కనుక ఈజిప్టు ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు.
ఈజిప్టువారు బానిసలకు విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు.
26కనుక దేవుడు తన సేవకుడైన మోషేను,
తాను ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును పంపించాడు.
27హాము దేశంలో అనేక అద్భుతాలు చేయటానికి
దేవుడు మోషే, అహరోనులను వాడుకొన్నాడు.
28దేవుడు కటిక చీకటిని పంపించాడు.
కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు.
29కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు.
వాళ్ల చేపలన్నీ చచ్చాయి.
30ఆ దేశం కప్పలతో నింపివేయబడింది.
రాజు గదులలోకి కూడ కప్పలు వచ్చాయి.
31దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు,
దోమలు వచ్చాయి.
అన్నిచోట్లా అవే ఉన్నాయి.
32దేవుడు వర్షాన్ని వడగండ్లుగా చేశాడు.
ఈజిప్టువారి దేశంలో అన్ని చోట్లా అగ్ని మెరుపులు కలిగాయి.
33ఈజిప్టువారి ద్రాక్షా తోటలను, అంజూరపు చెట్లను దేవుడు నాశనం చేశాడు.
వారి దేశంలో ప్రతి చెట్టునూ దేవుడు నాశనం చేసాడు.
34దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మిడుతలు వచ్చాయి.
అవి లెక్కింపజాలనంత విస్తారంగా ఉన్నాయి.
35మిడుతలు దేశంలోని మొక్కలన్నింటినీ తినివేశాయి.
నేల మీద పంటలన్నింటినీ అవి తినివేశాయి.
36అప్పుడు ఈజిప్టు దేశంలో ప్రతి మొదటి సంతానాన్ని దేవుడు చంపేశాడు.
వారి జ్యేష్ఠ కుమారులను దేవుడు చంపివేశాడు.
37అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు.
వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు.
దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు.
38దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది.
ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు.
39దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు.
రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు.
40ప్రజలు మాంసం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు.
దేవుడు వారికి ఆకాశం నుండి సమృద్ధిగా ఆహారాన్ని యిచ్చాడు.
41దేవుడు బండను చీల్చగా నీళ్లు ఉబుకుతూ వచ్చాయి.
ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.
42దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు.
దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు.
43దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు.
44అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు.
ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు.
45దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు.
వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు.
యెహోవాను స్తుతించండి.
Currently Selected:
కీర్తనల గ్రంథము 105: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International