YouVersion Logo
Search Icon

సామెతలు 5

5
వ్యభిచారము చేయకుండుటను గూర్చిన జ్ఞానము
1నా కుమారుడా, నా జ్ఞానోపదేశము విను. వివేకము గల నా మాటలు గమనించు. 2అప్పుడు జీవించుటకు సరైన మార్గం నీవు తెలుసుకుంటావు. నీవు జ్ఞానివి అని నీ మాటలు తెలియజేస్తాయి. 3మరొకరి భార్య పెదవులు తేనెలా తియ్యగా ఉండవచ్చు. ఆమె ముద్దులు తైలం కంటే మెత్తగా ఉండవచ్చు. 4కాని అంతలో కక్ష, బాధ, మాత్రమే ఆమె తెచ్చి పెడుతుంది. ఆ బాధ విషమంత చేదుగాను, ఖడ్గమంత వాడిగాను ఉంటుంది. 5ఆమె పాదాలు చావుకు దారితీస్తాయి. ఆమె నిన్ను తిన్నగా సమాధికి నడిపిస్తుంది. 6ఆమెను వెంబడించవద్దు! ఆమె సరైన మార్గాలలో నుంచి తప్పిపోయింది. అది ఆమెకు తెలియదు, జాగ్రత్తగా ఉండు! జీవమార్గాన్ని వెంబడించు!
7నా కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు మరచిపోవద్దు. 8వేశ్యకు దూరంగా ఉండండి. ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు కూడ వెళ్లవద్దు. 9ఒకవేళ నీవు అలా చేస్తే నీ మీద ప్రజలకున్న గౌరవం పోగొట్టుకుంటావు. ఇతరులు నీవు సంవత్సరాలు తరబడి సంపాందించినది అంతా తీసివేసుకుంటారు. 10నీకు తెలియని ప్రజలు నీ ఐశ్వర్యమంతా తీసివేసుకుంటారు. నీ కష్టార్జితం ఇతరుల పాలవుతుంది. 11నీ జీవితాంతం కూడా నీవు మూల్గుతావు. నీ శరీరం, నీకు ఉన్న సమస్తం హరించుకుపోతుంది. 12-13అప్పుడు నీవు, “నా తల్లిదండ్రుల మాటలు నేనెందుకు వినలేదు? నా ఉపదేశకుల మాటలు నేనెందుకు వినలేదు? క్రమ శిక్షణతో ఉండుటకు నేను నిరాకరించాను, సరిదిద్దబడుటకు నేను నిరాకరించాను. 14ఇప్పుడు అంతంలో, నా జీవితం వ్యర్ధం అయిపోయినట్లు నేను చూస్తున్నాను. మనుష్యులంతా నా అవమానం చూస్తున్నారు” అని నీవు అంటావు.
15-16నీ స్వంత బావి నుండి ప్రవహించు నీళ్లు మాత్రమే త్రాగు. మరియు నీ నీళ్లను బయట వీధుల్లోకి ప్రవహించ నీయకు. (నీ స్వంత భార్యకు ఒక్కదానికి మాత్రమే, నిన్ను నీవు అప్పగించుకో. నీవు నీ ప్రత్యేక ప్రేమను ఇవ్వాల్సింది ఆమెకు మాత్రమే. నీ కుటుంబానికి వెలుపల పిల్లలకు నీవు తండ్రివి కావద్దు). 17నీ పిల్లలు నీకు మాత్రమే చెందినవారై ఉండాలి. నీ స్వంత ఇంటికి వెలుపలి వారితో నీవు నీ పిల్లల్ని పంచుకోరాదు. 18అందుచేత నీ స్వంత భార్యతో సంతోషించు. నీవు యువకుడుగా ఉన్నప్పుడు నీవు పెళ్లాడిన స్త్రీతో అనుభవించు. 19ఆమె అందమైన లేడి వంటిది, అందమైన దుప్పిలాంటిది. ఆమె ప్రేమ నిన్ను పూర్తిగా తృప్తిపరచనివ్వు. ఆమె ప్రేమ నిన్ను బంధించి వేస్తుంది. 20మరొకని భార్య నిన్ను అదే విధానాల్లో బంధించనియ్యకు. మరొకత్తె ప్రేమ నీకు అవసరం లేదు.
21ప్రతి మనిషి చేసే ప్రతిది యెహోవా తేటగా చూస్తాడు. మనుష్యులు చేసే ప్రతిదాన్ని యెహోవా క్షుణ్ణంగా చూస్తాడు. 22దుర్మార్గుని పాపాలు వానినే పట్టుకొంటాయి. అతని పాపాలు అతణ్ణి బంధించే పాశాల్లా ఉంటాయి. 23ఈ మనిషి క్రమశిక్షణలో ఉంచేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తాడు. అతడు తన స్వంత బుద్దిహీనమైన కోరికల వల్లనే పట్టు బడతాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in