YouVersion Logo
Search Icon

సామెతలు 18

18
1ఇతరులు అంటే గిట్టనివాడు తాను చేసే వాటిలో స్వార్థపరుడుగా ఉంటాడు. ప్రజలు మంచి సలహాను ఇచ్చినప్పుడు అతడు కోపగించుకుంటాడు.
2బుద్ధిహీనుడు గ్రహించటానికి ఇష్టపడడు. ఆ వ్యక్తి ఎంతసేపూ తన స్వంత ఆలోచనలే చెప్పాలనుకొంటాడు.
3ఎక్కడ పాపం ఉంటుందో, అక్కడ అవమానం ఉంటుంది. ఎక్కడ అవమానం, ఉంటుందో అక్కడ ఘనత ఉండదు.
4ఒక వ్యక్తి చెప్పే విషయాలు జ్ఞానముగలవిగా ఉండవచ్చు. ఆ మాటలు లోతైన మహా సముద్రంలా లేక ప్రవహిస్తున్న ఏరులా ఉండవచ్చును.
5ఒకడు నేరస్థుడైతే వానికి సహాయం చేయవద్దు. అతడు తప్పు ఏమీ చేయకపోతే అతని యెడల న్యాయంగా ఉండు.
6బుద్ధిహీనుడు తాను చేప్పే మాటలవల్ల తనకు తానే కష్టం కలిగించుకొంటాడు. అతని మాటల వలన వివాదం మొదలు కావచ్చును.
7బుద్ధిహీనుడు మాట్లాడినప్పుడు అతడు తనను తానే నాశనం చేసుకొంటాడు. అతని స్వంత మాటలే అతన్ని పట్టేస్తాయి.
8మనుష్యులకు ఎంతసేపూ ముచ్చట్లు వినటం ఇష్టం. ఆ ముచ్చట్లు పొట్టలోనికి పోతున్న మంచి భోజనంలా ఉంటాయి.
9బద్దకస్థుడు నాశనం చేసే వాని అంతటి చెడ్డవాడు.
10యెహోవా పేరులో ఎంతో బలం ఉంది. అది బలమైన ఒక దుర్గంలాంటిది. మంచివాళ్లు ఆ దుర్గం దగ్గరకు పరుగెత్తి వెళ్లి, క్షేమంగా ఉంటారు.
11ధనికులు వారి ఐశ్వర్యం వారిని కాపాడుతుంది అనుకొంటారు. అది ఒక బలమైన కోటలా ఉంది అని వారు తలుస్తారు.
12ఒక దీనుడు గౌరవించబడతాడు. కాని గర్విష్ఠుడు పతనం అవుతాడు.
13ఒకడు పూర్తిగా వినక ముందే జవాబిస్తే అతడు ఇబ్బంది పడిపోయి, తాను తెలివితక్కువ వాడిని అని చూపించుకొంటాడు.
14ఒక మనిషి వ్యాధితో ఉన్నప్పుడు అతని మనస్సు అతణ్ణి బ్రతికించి ఉంచగలదు. కాని ఆ మనిషి అంతా పోయింది అనుకొంటే అప్పుడు ఆశ అంతా వదలుకొన్నట్టే!
15జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని అనుకుంటాడు. మరింత జ్ఞానము కోసం అతడు జాగ్రత్తగా వింటాడు.
16ఒక ప్రముఖ వ్యక్తిని నీవు కలుసుకోవాలి అని అంటే అతనికి ఒక కానుక ఇవ్వాలి. అప్పుడు నీవు అతనిని తేలికగా కలుసుకోగలవు.
17ఇంకో మనిషి వచ్చి ప్రశ్నించే అంత వరకు మొదలు మాట్లాడిన వానిది సరిగ్గా ఉన్నట్టే కనిపిస్తుంది.
18ఇద్దరు శక్తిగల మనుష్యులు వాదిస్తోంటే వారి వాదాన్ని తీర్మానించటానికి చీట్లు వేయటమే శ్రేష్ఠమైన పద్ధతి.
19నీ స్నేహితునికి నీవు సహాయం చేస్తే అతడు ఒక బలమైన పట్టణపు గోడలా నిన్ను కాపాడుతాడు. వివాదాలు కోట గుమ్మాల అడ్డగడియవలె ప్రజలను వేరుపరుస్తాయి.
20నీవు చెప్పే విషయాలు నీ జీవితం మీద ఏదో విధంగా పనిచేస్తాయి. తన నోటి ఫలముచేత ఒక మనిషి నింపబడుతాడు.
21జీవం, మరణం, తెచ్చే మాటలు నాలుక మాట్లాడగలదు. ప్రజలు మాట్లాడటం ఇష్టపడేవారు. అది ఏమి తెచ్చునో దాన్ని తీసుకొనుటకు సిద్దముగా ఉండ వలయును.
22నీకు భార్య దొరికినట్లయితే నీవు మేలు పొందినట్టే. నీ విషయమై యెహోవాకు సంతోషం.
23పేదవాడు సహాయము కొరకు అడుక్కుంటాడు. కాని ధనికుడు కఠినముగా సమాధానము చెప్పుతాడు.
24ఒక మనిషికి స్నేహితులు చాలా మంది ఉంటే అది అతనిని పాడు చేయవచ్చును. కాని ఒక సోదరుని కంటే ఒక మంచి స్నేహితుడు మేలు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in