నెహెమ్యా 4
4
సన్బల్లటు, టోబీయా
1మేము యెరూషలేము ప్రాకారాన్ని నిర్మిస్తున్నామన్న వార్తను సన్బల్లటు విన్నాడు. అతను కోపంతో ఉగ్రరూపం దాల్చాడు. అతను యూదులను ఎగతాళి చెయ్యనారంభించాడు. 2సన్బల్లటు తన మిత్రులతోనూ, షోమ్రోను సైన్యంతోనూ మాట్లాడాడు. అతను ఇలా అన్నాడు: “ఈ బలహీన యూదులు చేస్తున్నపని యేమిటి? మనం ఊరుకొంటామని అనుకుంటున్నారా వీళ్లు? తాము బలులు ఇద్దామనే అనుకుంటున్నారా వీళ్లు? బహూశః ఒక్క రోజులో ప్రాకార నిర్మాణం పని పూర్తి చేస్తామని అనుకుంటున్నట్లుంది వీళ్లు. ఈ చెత్త, దుమ్ము గుట్టల్నుంచి రాళ్లకు జీవం పొయడం వీళ్ల తరం కాదు. ఇవి వట్టి బూడిద రాసులు, ధూళి కుప్పలు!”
3సన్బల్లటుతోనే ఉన్న అమ్మోనీయుడు టోబీయా ఇలా అందుకున్నాడు: “ఈ యూదులు తామేదో గొప్పగా కట్టేస్తున్నామని అనుకుంటున్నట్లుంది. దాని మీద ఒక చిన్న నక్కపిల్ల ఎక్కితే చాలు, వాళ్ల రాతి గోడ కాస్తా కుప్పకూలిపోతుంది!”
4నెహెమ్యా ఇలా దైవ ప్రార్థన చేశాడు: “ఓ మా దేవా, మా మొర ఆలకించు. వీళ్లకి మేమంటే ద్వేషం. ఈ సన్బల్లటు, టోబీయా మమ్మల్ని అవమానిస్తున్నారు. వాళ్ల నిందలు వాళ్లకే వచ్చేటట్లు చెయ్యి దేవా. బానిసలుగా, చెరబట్టబడిన వాళ్ల మాదరిగా వాళ్లను సిగ్గుపడనియ్యి. 5వాళ్ల నేరాన్ని తీసివేయవద్దు. వారి పాపాలను క్షమించవద్దు. ప్రాకారం నిర్మిస్తున్న వాళ్లను వీళ్లు అవమానించారు, వాళ్లని వీళ్లు నిరుత్సాహపరిచారు.”
6మేము యెరూషలేము ప్రాకారాన్ని నిర్మించాము, మేము నగరం చుట్టూ గోడకట్టాము. అయితే, అది ఉండాల్సిన దానికి సగం ఎత్తు మాత్రమే ఉంది. జనం హృదయపూర్వకంగా పనిచేశారు. అందుకే మేము ఇంత మాత్రమైనా కట్టగలిగాము.
7కాని, సన్బల్లటు, టోబియా, అరబ్బీయులు, అమ్మోనీయులు, అష్డోదువాసులు, కోపంతో నిండు కొనియున్నారు. జనం యెరూషలేము ప్రాకారాలు బాగుచేసే పని కొనసాగిస్తున్నట్లు, గోడల మధ్య కంతలను పూడుస్తున్నట్లు వాళ్లు విన్నారు. ఈ విషయమై వాళ్లు అధికముగా కోపగించుకొని 8ఒకచోట కూడి యెరూషలేముకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. వాళ్లు యెరూషలేముకు వ్యతిరేకంగా కల్లోలం లేవగొట్టాలనీ, వాళ్లు వచ్చి నగరం మీద పోరాటం జరపాలనీ పథకం పన్నారు. 9అయితే, మేము మా దేపుణ్ణి ప్రార్థించాము. అంతేకాదు, వాళ్లు వస్తే, వాళ్లని ఎదిరించి పోరాడగలిగేందుకుగాను గోడలమీద రాత్రింబగళ్లు కాపలా కోసం కాపలావారిని పెట్టాం.
10అప్పుడు యూదా వాసులు తమ నిరుత్సాహాన్ని ఇలా వెలిబుచ్చారు: “పనివాళ్లు అలసిపోతున్నారు. దోవలో బోలెడు దుమ్మూ, రద్దూ పేరుకు పోయాయి. మనం గోడ కట్టడాన్ని కొనసాగించలేము. 11పోతే, మన శత్రువులేమో ఇలా అంటున్నారు: ‘యూదులపై మనము అకస్మాత్తుగా దాడిచేద్దాము. వాళ్లు మనలను చూడకముందే, మనం ఎవరమో తెలిసికోకముందే మనం వాళ్ల మధ్య ఉంటాము, వాళ్లని చంపేస్తాము. దానితో వాళ్ల పని నిలిచిపోతుంది.’”
12తర్వాత మన శత్రువుల మధ్య నివసించే మన యూదులు మా దగ్గరికి వచ్చి, “మన శత్రువులు మనచుట్టూ వున్నారు. మేము ఎటు తిరిగితే అటు వాళ్లు ప్రత్యక్షమౌతున్నారు” అంటూ పదే పదే చెప్పారు.
13అందుకని, నేను కొందర్ని గోడ బాగా పోట్టిగా వున్న చోట్ల గోడ వెనక కాపలా పెట్టాను. నేను వాళ్లని గోడకి కంతలున్న స్థలాల్లో నిలిపాను. నేను ఆయా కుటుంబాలను ఒక చోట చేర్చి, కత్తులు, శూలాలు, విల్లమ్ములతో నిలిపాను. 14అప్పుడు నేను ముఖ్యమైన కుటుంబాలతో, ఉద్యోగులతో, మిగిలిన జనంతో ఇల చెప్పాను: “మన శత్రువులంటే భయపడకండి. మన ప్రభువును తలుచుకోండి. యెహోవా గొప్పవాడు, శక్తిశాలి! మీరు మీ సోదరుల కోసం, మీ కుమారుల కోసం, మీ కుమార్తెల కోసం పోరాడాలి! మీరు మీ భార్యల కోసము, మీ గృహాల కోసం పోరాడాలి!”
15తమ పథకాలు మాకు తెలిసిపోయాయన్న విషయం మా శత్రువులు విన్నారు. తమ పథకాలను దేవుడు భగ్నం చేశాడని వాళ్లు గ్రహించారు. తర్వాత మేమందరం తిరిగి పని ప్రారంభించాము. ప్రతి ఒక్కడూ తను వదిలిన పని భాగానికి తిరిగి వెళ్లాడు. 16ఆనాటి నుంచి నా మనుషుల్లో సగం మంది గోడ కట్టడంలో నిమగ్నులు కాగా, మిగిలిన సగం మంది ఈటెలు, బల్లెములు, విల్లమ్ములు, కవచాలతో కాపలా పనిలో నిమగ్నులయ్యారు. సేనాధిపతులు ప్రాకార నిర్మాణంలో నిమగ్నులైన యూదా ప్రజలందరి వెనుక నిలిచారు. 17గోడ కట్టేవాళ్లు, వాళ్ల సహాయకులు ఒక చేత్తో పనిముట్లను, మరో చేత్తో ఆయుధాలను పట్టుకున్నారు. 18పని చేస్తున్న ప్రతి ఒక్క తాపీవాడూ తన ప్రక్కనే ఒక కత్తిని పెట్టుకున్నాడు. శత్రువుల రాకను గురించి హెచ్చరించేందుకు బూర ఊదేవాడు నా ప్రక్కన నిలబడ్డాడు. 19అప్పుడు నేను ఆయా ప్రముఖ కుటుంబాల వాళ్లను, ఉద్యోగులను, మిగిలిన జనాన్ని ఉద్దేశించి ఇలా చెప్పాను, “ఇది చాలా పెద్ద పని. మనం గోడ పొడుగునా విస్తరించివున్నాము. మనం ఒకరికొకరం దూరంగా వున్నాము. 20అందుకని, మీకు బూర శబ్దం వినిపించినప్పుడు, అక్కడికి మీరంతా పరుగున రండి. మనమంతా అక్కడ కలుద్దాము. మన దేవుడు మన పక్షాన పోరాడుతాడు!”
21ఈ విధంగా మేము యెరూషలేము ప్రాకార నిర్మాణపు పని కొనిసాగించాము. మాలో సగం మంది శూలాలు ధరించి నిలబడ్డారు. మేము ఉదయం పొద్దు పొడిచినప్పటినుంచి రాత్రి చుక్కలు పొడిచే దాకా పనిచేశాము.
22అప్పుడు నేను వాళ్లకి ఈ విషయాలు కూడా చెప్పాను: “ప్రతి ఒక్క తాపీవాడూ, అతని సహాయకుడూ రాత్రివేళ యెరూషలేములోనే వుండిపోవాలి. అప్పుడు వాళ్లు రాత్రుళ్లు కాపలాదార్లుగా, పగళ్లు పని వాళ్లుగా ఉండగలుగుతారు.” 23సరే, నేనుగాని, నా సోదరులుగాని, నా మనుష్యులు గాని, కాపలావాళ్లుగాని, మాలో ఎవ్వరం మా దుస్తులు విప్పలేదు. మాలో ప్రతిఒక్కరూ అన్ని సమయాల్లో, చివరకు నీళ్లకు వెళ్లినప్పుడూ సైతం, ఆయుధాలు ధరించేవున్నాము.
Currently Selected:
నెహెమ్యా 4: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International