నెహెమ్యా 1
1
నెహెమ్యా ప్రార్థన
1హకల్యా కుమారుడైన నెహెమ్య మాటలు ఇవి: నెహెమ్యా అనే నేను కిస్లేవు నెలలో రాజధాని నగరమైన షూషనులో ఉన్నాను. అర్తహషస్త రాజ్య పాలన ఇరవయ్యవ ఏట ఇది జరిగింది. 2నేను షూషనులో వుండగా, నా సోదరుల్లో ఒకడైన హనానీయ, మరి కొందరు యూదా నుంచి వచ్చారు. అక్కడ నివసిస్తున్న యూదులను గురించి నేను వాళ్లని అడిగాను. వాళ్లు చెరనుంచి తప్పించుకొని, ఇంకా యూదాలోనే నివసిస్తున్న యూదులు. నేను వాళ్లని యెరూషలేము నగరం గురించి కూడా అడిగాను.
3హనానీయ, అతనితో ఉన్న వాళ్లూ ఇలా చెప్పారు: “నెహెమ్యా, చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో వున్నారు. వాళ్లకి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటున్నారు. ఎందుకంటే, యెరూషలేము ప్రాకారం కూల్చబడింది. దాని ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి.”
4యెరూషలేము ప్రజలను గురించి, ప్రాకారం గురించీ ఈ విషయాలు విన్నాక, నేను చాలా కలత చెందాను. నేను కూర్చుండి విలపించాను. నా విచారానికి అవధి లేకపోయింది. నేను కొన్ని రోజులపాటు ఉపవాసం వుండి, పరలోక దేవునికి ప్రార్థనలు చేశాను. 5తర్వాత ఈ క్రింది ప్రార్థన చేశాను:
పరలోక దేవా, యెహోవా ప్రభూ, నీవు అత్యంత శక్తిశాలివైన మహా దేవుడివి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు పాటించే మనుష్యులను నీవు కటాక్షించి వారితో ప్రేమ ఒడంబడికను అమలుపరుస్తావు.
6దయచేసి నీవు కళ్లు తెరిచి, చెవులొగ్గి ఈ నీ సేవకుడు రాత్రింబగళ్లు నీ సన్నిధియందు చేస్తున్న ప్రార్థనలను విను. నేను నీ సేవకులైన ఇశ్రాయేలీయుల కోసం ప్రార్థిస్తున్నాను. మేము నీకు వ్యతిరేకంగా పాపాలు చేశామన్న విషయాన్ని నేను ఒప్పుకొంటున్నాను. నేనూ, నా తండ్రి కుటుంబంలోని ఇతరులూ నీకు వ్యతిరేకంగా పాపం చేశామని ఒప్పుకొంటున్నాను. 7ఇశ్రాయేలు ప్రజలమైన మేము నీపట్ల చాలా చెడుగా వ్యవహరించాము. నీవు నీ సేవకుడైన మోషే ద్వారా యిచ్చిన ఆజ్ఞలనూ, బోధనలనూ, విధులనూ మేము తృణీకరించాము.
8నీవు నీ సేవకుడైన మోషేకి ఇచ్చిన ఉపదేశాన్ని దయచేసి గుర్తుచేసుకొనుము. దేవా, నీవు అతనికి “మీ ఇశ్రాయేలు ప్రజలు విశ్వసనీయంగా వ్యవహరించక పోయినట్లయితే, మిమ్మల్ని యితర దేశాల మధ్యకు చెదరగొడ్తాను. 9అలాకాక, మీ ఇశ్రాయేలీయులు నా వద్దకు తిరిగి వచ్చి, నా ఆదేశాలను పాటించినట్లయితే, అప్పుడు నేనిలా చేస్తాను: మీ ప్రజలు తమ ఇళ్లు వాకిళ్లు వదలటానికి బలవంతం చేయబడినా, భూలోకపు అంచులదాకా పోయినా సరే, నేను వాళ్లని అక్కడనుంచి తిరిగి ఒక్కచోట చేరుస్తాను. ఎక్కడైతే నా నామాన్ని ఉంచుటకు ఏర్పాటు చేసుకున్నానో అక్కడికి తిరిగి వాళ్లని నేను తీసుకొస్తాను” అని చెప్పావు.
10ఇశ్రాయేలు ప్రజలు నీ సేవకులు, నీ ప్రజలు. నీవు నీ గొప్ప శక్తిని వినియోగించి, వాళ్లని విడిపించావు. 11కాబట్టి ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. నేను నీ దాసుడను. నీ నామం పట్ల గౌరవం ప్రదర్శించాలని ఇష్టపడే నీ సేవకుల ప్రార్థనలు దయచేసి ఆలకించు. ప్రభూ, నేను రాజుకి ద్రాక్షారసం అందించే సేవకుణ్ణి.#1:11 ద్రాక్షారసం … సేవకుణ్ణి ఇది చాలా ముఖ్యమైన ఉద్యోగం. ఈ ఉద్యోగి ఎల్లప్పుడూ రాజుగారికి దగ్గర్లో వుంటాడు. రాజుగారి ద్రాక్షాపానీయాన్ని రుచిచూసి, దాంట్లో ఎవరూ విషం కలిపే ప్రయత్నం చేయడం లేదని నిర్ధారణ చేస్తాడు. ఈ విషయం నీకు తెలుసు. అందుకని దేవా, నాకు ఈ నాడు సహాయం చెయ్యి. నేను రాజు సహాయాన్ని అర్థిస్తున్నాను. ఈ నా ప్రయత్నంలో నాకు విజయం చేకూర్చు. రాజుకు నా పట్ల అభిమానం కలిగేలా చెయ్యి.
Currently Selected:
నెహెమ్యా 1: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International