లూకా 1
1
యేసు జీవన చరిత్రను లూకా వ్రాయటం
1గౌరవనీయులైన థెయొఫిలాకు:
మనలో జరిగిన సంఘటల్ని మొదటి నుండి కండ్లారా చూసి, దైవ సందేశాన్ని బోధించిన వాళ్ళు మనకు వాటిని అందించారు. 2-3వీటన్నిటినీ నేను మొదట నుండి క్షుణ్ణంగా పరిశోధించాను కనుక నాకు కూడా వీటన్నిటిని క్రమపద్ధతిలో వ్రాసి మీకు అందించటం ఉత్తమమనిపిం చింది. 4మీరు నేర్చు కొన్నవి నిజమని మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ గ్రంథం మీకోసం వ్రాస్తున్నాను.
జెకర్యా మరియు ఎలీసబేతు
5హేరోదు#1:5 హేరోదు యూదయకు రాజైన హేరోదు, క్రి.పూ. 40–4. రాజు యూదయను పాలించే కాలంలో జెకర్యా అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఇతడు అబీయా#1:5 అబీయా యూదా యాజకుల 24 శాఖలలో ఒకటి ఇది. 1 దినవృ. 24 చూడండి. అనబడే యాజక శాఖకు చెందినవాడు. ఇతని భార్య అహారోను శాఖకు చెందినది. ఆమె పేరు ఎలీసబెతు. 6ఈ దంపతులు యధార్థంగా, దేవునికి ప్రీతికరంగా నుడుచుకుంటూ ప్రభువు ఆజ్ఞల్ని పాటిస్తూ ఏ అపకీర్తి లేకుండా నిష్టాపరులై జీవించే వాళ్ళు, 7ఎలీసబెతు గొడ్రాలు. పైగా వాళ్ళిద్దరూ వయస్సు మళ్ళిన వాళ్ళు. వాళ్ళకు సంతానం కలుగలేదు.
8తన శాఖకు చెందిన వాళ్ళు చేయవలసిన వంతు రావటంవల్ల జెకర్యా యాజక పనులు చేస్తూ ఉన్నాడు. 9దేవాలయంలో దేవునికి ధూపం వేయటానికి వాడుక ప్రకారం చీట్లు వేసి జెకర్యాను ఎన్నుకున్నారు. 10అతడు ధూపం వేస్తుండగా బయట సమావేశమైన భక్తులు ప్రార్థిస్తున్నారు.
11ధూపవేదికకు కుడివైపున జెకర్యాకు ఒక దేవదూత ప్రత్యక్షం అయ్యాడు. 12జెకర్యా అతణ్ణి చూడగానే ఉలిక్కి పడ్డాడు. అతనికి భయం వేసింది. 13దేవదూత అతనితో, “జెకర్యా భయపడకు. దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. నీ భార్య ఎలీసబెతు ఒక మగశిశువును కంటుంది. ఆ పిల్లవానికి యోహాను అని నామకరణం చెయ్యి. 14ఇతని పుట్టుక వల్ల నీవు చాలా ఆనందిస్తావు. నీవేకాక ప్రజలందరూ ఆనందిస్తారు. 15అతడు ఆధ్యాత్మికతతో గొప్పవాడౌతాడు. దేవుడతని గొప్పతనం చూసి ఆనందిస్తాడు. అతడు ద్రాక్షారసం కాని, లేక యితర రకములైన మద్యపానాల్ని కాని ముట్టడు. పుట్టినప్పటి నుండే అతనిలో పవిత్రాత్మ#1:15 పవిత్రాత్మ ఈయన దైవత్వంలో మూడవ వ్యక్తి. ఈయన్ని దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఆదరణ కర్త అని కూడా అంటారు. ఈయన లోకంలో జనులు మధ్య దైవ కార్యాన్ని చేస్తాడు. ఉంటాడు.
16“ఇశ్రాయేలు ప్రజల ప్రభువైన దేవుని దగ్గరకు యితడు చాలా మంది ప్రజల్ని తీసుకు వస్తాడు. 17తండ్రుల హృదయాలను పిల్లల వైపు మళ్ళించటానికి, దేవుణ్ణి నమ్మని వాళ్ళను నీతిమంతుల జ్ఞానం సంపాదించేటట్లు చెయ్యటానికి, ప్రభువు రాకకు ప్రజల్ని సిద్ధపరచటానికి ఇతడు ఏలియాలో#1:17 ఏలీయా క్రి.పూ. 850 లో జీవించిన ప్రవక్త. ఉన్న ఆత్మ బలంతో ప్రభువు కన్నా ముందుగా వెళ్తాడు” అని అన్నాడు.
18జెకర్యా దేవదూతతో, “మీరన్న విధంగా జరుగుతుందన్నదానికి నిదర్శన మేమిటి? నేను ముసలి వాణ్ణి. నా భార్యకు కూడా వయస్సు మళ్ళింది” అని అన్నాడు.
19దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నా పేరు గాబ్రియేలు. నేను దేవుని దూతను. నీతో మాట్లాడి నీకి సువార్త చెప్పుమని దేవుడు నన్ను పంపాడు. 20జాగ్రత్త! నీవు నా మాటలు నమ్మటం లేదు కనుక మూగవాడవై పోతావు. తగిన సమయం వచ్చాక నా మాటలు నిజమౌతాయి. అంతవరకు నీకు మాటలు రావు.”
21బయట ప్రజా సమూహం జెకర్యా దేవాలయంలో యింతవరకు ఎందుకున్నాడో అని ఆశ్చర్యంతో అతని కోసం కాచుకొని ఉన్నారు. 22జెకర్యా వెలుపలికి వచ్చాడు. కాని వాళ్ళతో మాట్లాడలేక పోయాడు. ఏమీ మాట్లాడలేక సంజ్ఞలు చెయ్యటం వల్ల దేవాలయంలో అతనికి దివ్య దర్శనం కలిగినదని అక్కడున్న వాళ్ళు గ్రహించారు. 23సేవా దినములు ముగిసాక అతడు తన యింటికి వెళ్ళిపోయాడు.
24కొన్ని రోజుల తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఐదు నెలల దాకా ఆమె గడపదాటలేదు. 25“ప్రభువు ఈ దశలో నాకీ గర్భం యిచ్చి నన్ను అనుగ్రహించాడు; నలుగురిలో నాకున్న అవమానం తొలగించాడు” అని ఆమె అన్నది.
యేసు జన్మిస్తాడని ప్రవచనం
26ఎలీసబెతు ఆరు నెలల గర్భంతో ఉంది. అప్పుడు దేవుడు గాబ్రియేలు అనే దేవదూతను గలిలయలోని నజరేతు అనే పట్టణంలో ఉన్న ఒక కన్య దగ్గరకు పంపాడు. 27దావీదు వంశస్థుడైన యోసేపు అనే వ్యక్తితో ఈ కన్యకు పెళ్ళి నిశ్చయమైంది. ఈ కన్య పేరు మరియ. 28ఈ దేవదూత ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో, “నీకు శుభం కలుగుగాక! ప్రభువు నిన్ను అనుగ్రహించాడు. ఆయన నీతో ఉన్నాడు” అని అన్నాడు.
29దేవదూత మాటలు విని మరియ కంగారు పడి ఇతని దీవెనకు అర్థమేమిటా అని ఆశ్చర్యపడింది.
30ఇది చూసి దేవదూత ఆమెతో యిలా అన్నాడు: “భయపడకు మరియా! దేవుడు నిన్ను అనుగ్రహించాడు. 31నీవు గర్భం దాల్చి మగ శిశువును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెట్టు. 32ఆయన చాలా గొప్ప వాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకు యిస్తాడు. 33యాకోబు వంశానికి చెందిన వాళ్ళందర్ని ఈయన చిరకాలం పాలిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ అంతరించదు.”
34“నా కింకా పెండ్లి కాలేదే! ఇది ఎట్లా సాధ్యమవుతుంది?” అని మరియ దేవదూతను అడిగింది.
35ఆ దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పవిత్రాత్మ నీ మీదికి వచ్చునప్పుడు సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అందువలన నీకు పుట్టబోయే శిశువు పవిత్రంగా ఉంటాడు. ఆ శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. 36నీ బంధువు ఎలీసబెతు తన వృద్ధాప్యంలో తల్లి కాబోతోంది. గొడ్రాలని పిలవబడే ఆమె యిప్పుడు ఆరు నెలల గర్భంతో ఉంది. 37దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు.”
38మరియ, “నేను దేవుని సేవకురాలను. మీరన్న విధంగానే జరుగనీ!” అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు.
మరియ ఎలీసబెతును కలుసుకోవటం
39మరియ వెంటనే యూదా పర్వత ప్రాంతం లోని ఒక గ్రామానికి వెళ్ళటానికి ప్రయాణమైంది. 40ఆ గ్రామంలోనున్న జెకర్యా యింటికి వెళ్ళి ఎలీసబెతును కలుసుకొని ఆమె క్షేమ సమాచారాలు అడిగింది. 41ఎలీసబెతు ఆమె మాటలు విన్న తక్షణమే, ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసాడు. ఎలీసబెతు పవిత్రాత్మతో నిండిపోయింది.
42ఆమె బిగ్గరగా, “దేవుడు ఏ స్త్రీని దీవించనంతగా నిన్ను దీవించాడు. అదే విధంగా నీ గర్భంలో నున్న శిశువు కూడా ధన్యుడు. 43కాని దేవుడు నా మీద యింత దయ ఎందుకు చూపుతున్నాడు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటమా? 44నీ మాటలు నా చెవిలో పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు. 45ప్రభువు చెప్పినట్లు జరుగుతుందని విశ్వసించావు. ధన్యురాలవు” అని అన్నది.
మరియ పాడిన భక్తి గీతం
46మరియ ఈ విధంగా అన్నది:
47“నా ఆత్మ ప్రభువును కొలిచింది.
దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు.
48దీనురాల్ని నేను!
ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు!
ఇకనుండి అందరూ
నన్ను ధన్యురాలంటారు!
49దేవుడు సర్వశక్తి సంపన్నుడు.
ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం!
50తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.
51తన బలమైన హస్తాన్ని జాపి
గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు.
52రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు.
దీనులకు గొప్ప స్థానాలిస్తాడు.
53పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు.
ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు.
54తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో,
అతని సంతతితో చెప్పినట్లు
55దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”
56మరియ ఎలీసబెతు యింట్లో మూడు నెలలుండి, ఆ తర్వాత యింటికి తిరిగి వెళ్ళిపోయింది.
యోహాను జన్మ వృత్తాంతం
57ఎలీసబేతుకు నెలలు నిండి మగశిశువును ప్రసవించింది. 58బంధువులు మరియు ఇరుగు పొరుగు వాళ్ళు ప్రభువు ఆమెను కనికరించినందుకు ఆనందించారు.
59ఎనిమిదవ రోజు వాళ్ళు పిల్లవానికి సున్నతి చేయటానికి వచ్చి అతనికి జెకర్యా అని అతని తండ్రి పేరే పెట్టబోయారు. 60కాని తల్లి వారిస్తూ, “ఆ పేరు వద్దు! యోహాను అని పేరు పెట్టండి” అని అన్నది.
61వాళ్ళు, “మీ బంధువుల్లో ఆ పేరున్న వాళ్ళు ఎవ్వరూ లేరే?” అని అన్నారు. 62ఆ పిల్లవాని తండ్రికి సంజ్ఞలు చేసి అతడే పేరు పెట్టదలచాడో అని అడిగారు.
63అతడు వ్రాయటానికి ఒక పలక నివ్వమని అడిగి దానిపై, “అతనికి యోహాను అని పేరు పెట్టండి” అని వ్రాసాడు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు. 64వెంటనే అతని నోరు, నాలుక కదిలి బాగైపోయింది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. 65ఇరుగు పొరుగు వాళ్ళలో భక్తి, భయమూ నిండుకుపొయ్యాయి. యూదయ పర్వత ప్రాంతమంతా ఈ వార్త వ్యాపించింది. 66ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడి, “ఈ పసివాడు ఎంతగొప్పవాడౌతాడో కదా!” అని అన్నారు. ఆ బాలునికి ప్రభువు హస్తం తోడుగా ఉంది.
జెకర్యా చెప్పిన భవిష్యం
67ఆ బాలుని తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నింపబడి దేవుని సందేశాన్ని ఈ విధంగా చెప్పాడు:
68“తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి!
ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి!
69మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి
మనకోసం పంపాడు.
70గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా
ఈ విషయం చెప్పాడు.
71దేవుడు శత్రువుల బారినుండి,
మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు.
72మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు.
పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు!
73శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు.
74మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి.
75జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం!
76“ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు!
ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు!
77పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు!
78“మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి
ఒక నీతిసూర్యుణ్ణి పంపించి,
79మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి
మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!”
80ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం వచ్చే దాకా యోహాను ఎడారుల్లో జీవించాడు.
Currently Selected:
లూకా 1: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International