YouVersion Logo
Search Icon

యెహోషువ 5

5
1కనుక ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నది దాటి వెళ్లేంతవరకు యెహోవా దానిని ఎండి పోయేటట్టు చేసాడు. యొర్దాను నదికి పశ్చిమాన ఉన్న రాజులు, మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న కనానీ ప్రజలు ఇది విని చాల భయపడిపోయారు. అంతటితో ఇశ్రాయేలు ప్రజలను ఎదిరించే ధైర్యం వారికి లేక పోయింది.
ఇశ్రాయేలీయులు సున్నతి చేయబడ్డారు
2ఆ సమయంలో యెహోవా, “మొనగల రాళ్లతో కత్తులు చేసి, ఇశ్రాయేలు ప్రజలకు మరల సున్నతి#5:2 సున్నతి గోప్యాంగముకు వున్న ముందు చర్మము కోయబడటం దీనినే సున్నతి అంటారు. ఇది చేయటం ద్వారా యూదులలో ప్రతి ఒక్కడూ దేవుని ఒడంబడికలో పాలిభాగస్తుడు అని ఇది తెలుపుతుంది. ఆది. 17:9-14 చూడండి. చేయి” అని యెహోషువతో చెప్పాడు.
3కనుక యెహోషువ మొనగల రాళ్లతో కత్తులు చేసాడు. తర్వాత గిబియత్ హార్లత్#5:3 గిబియత్ హార్లత్ “సున్నతి పర్వతం” అని దీని భావం. దగ్గర అతడు వారికి సున్నతి చేసాడు.
4-7ఆ మగవాళ్లకు యెహోషువ ఎందుకు సున్నతి చేసాడంటే; ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు వదిలి పెట్టిన తర్వాత, సైన్యానికి తగిన వాళ్లందరికీ సున్నతి చేయబడింది. అరణ్యంలో ఉన్నప్పుడు ఆ వీరులు చాల మంది యెహోవా మాట వినలేదు. అందుచేత “పాలు, తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని” ఆ మనుష్యులు చూడరని యెహోవా ప్రమాణం చేసాడు. ఆ దేశాన్ని మనకు ఇస్తానని యెహోవా మన పూర్వీకులకు వాగ్దానం చేసాడు కానీ ఆ మనుష్యుల మూలంగా ప్రజలంతా 40 సంవత్సరాలపాటు అరణ్యంలోనే సంచరించాల్సి వచ్చింది. అలా ఆ సైన్యం, వాళ్లంతా చావాల్సి ఉంది. పోరాడే ఆ మనుష్యులంతా చనిపోయారు. వారి కుమారులు వారి స్థానాలు వహించారు. అయితే ఈజిప్టునుండి వచ్చేటప్పుడు అరణ్యంలో పుట్టిన బాలురకు ఎవ్వరికి సున్నతి జరగలేదు. అందుచేత యెహోషువ వారికి సున్నతి చేసాడు.
8ప్రజలందరికీ యెహోషువ సున్నతి చేయటం ముగించాడు. తర్వాత వాళ్లంతా స్వస్థత పడేంతవరకు ఆ గుడారాలలోనే ఉండిపోయారు.
కనానులో మొదటి పస్కా పండుగ
9ఆ సమయంలో యెహోవా, “మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్నప్పుడు అవమానం పొందారు కానీ నేడు ఆ అవమానాన్ని నేను తొలగించివేసాను” అని యెహోషువతో చెప్పాడు. అందుచేత ఆ స్థలానికి గిల్గాలు#5:9 గిల్గాలు హెబ్రీ భాషలో ఈ పదానికి “దొర్లిపోవుట” అని అర్థం. అని యెహోషువ పేరు పెట్టాడు. నేటికీ ఆ చోటు గిల్గాలు అనే పిలువబడుతోంది.
10ఇశ్రాయేలు ప్రజలు యెరికో మైదానాల్లో గిల్గాలులో దిగియున్నప్పుడే వారు పస్కా విందు చేసారు. అది ఆ నెల 14వ తేదీ సాయంత్రం. 11మరునాడు పస్కా తర్వాత ప్రజలు ఆ దేశంలో పండిన ఆహారం కొంత భోజనం చేసారు. పులుపు పదార్థం లేని రొట్టెను, వేయించిన గింజలను వారు తిన్నారు. 12ఆ రోజు ప్రజలు ఈ ఆహారం భోజనంచేసిన తర్వాత ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఆగిపోయింది. ఆ తర్వాత ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఇశ్రాయేలు ప్రజలకు లభించలేదు. అప్పట్నుంచి కనాను దేశంలో పండిన పంటనే వారు తిన్నారు.
యెహోవా సైన్యాధిపతి
13యెహోషువ యెరికోకు సమీపంగా ఉన్నప్పుడు అతడు పైకి చూడగా అతని యెదుట ఒక మనిషినిలిచి ఉండటం కనబడింది. ఆ మనిషి చేతిలో ఒక ఖడ్గం ఉంది. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, “నీవు మా ప్రజల పక్షమా, లేక నీవు మా శత్రువర్గం వాడివా?” అని అడిగాడు.
14ఆ మనిషి, “నేను శత్రువును కాను. నేను యెహోవా సైన్యములకు సేనాధిపతిని. ఇప్పుడే నేను మీ దగ్గరకు వచ్చాను” అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోషువ, ఆయనను గౌరవిస్తు సాష్టాంగపడి, “నా యజమానీ, తన సేవకుడైన నాకు ఏమి సెలవిస్తున్నారు?” అని అడిగాడు.
15అందుకు యెహోవా సైన్యాధిపతి, “నీ చెప్పులు తీసివేయి. ఇప్పుడు నీవు నిలిచిన స్థలం పవిత్ర స్థలము” అని చెప్పాడు. కనుక యెహోషువ ఆయనకు విధేయుడయ్యాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in