YouVersion Logo
Search Icon

యెహోషువ 20

20
ఆశ్రయ పురాలు
1అప్పుడు యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు: 2“నీకు ఒక ఆజ్ఞ ఇచ్చేందుకు నేను మోషేను వాడుకొన్నాను. ప్రత్యేకమైన ఆశ్రయ పురాలను నిర్మించుమని మోషే నీతో చెప్పాడు. 3ఎవరైనా ఒక వ్యకి మరొక వ్యక్తిని చంపితే, అది ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప, ఆ వ్యక్తిని చంపాలనే ఉద్దేశం లేకపోతే, అప్పుడు అతడు దాగుకొనేందుకు ఒక ఆశ్రయ పురానికి వెళ్ల వచ్చును.
4“ఆ వ్యక్తి ఇలా చేయాలి. అతడు పారిపోయి, ఆ పట్టణాల్లో ఒకదానికి వెళ్లినప్పుడు, ఆ పట్టణ ప్రవేశందగ్గర అతడు ఆగిపోవాలి. అతడు ద్వారం దగ్గర ఆగిపోయి, జరిగిన విషయాన్ని గూర్చి ప్రజానాయకులకు చెప్పాలి. అప్పుడు ఆ ప్రజానాయకులు అతణ్ణి ఆ పట్టణంలో ప్రవేశింప నియ్యవచ్చును. అతడు వాళ్ల మధ్య నివసించేందుకు వారు అతనికి ఒక స్థలం ఇస్తారు. 5అయితే వానిని తరుముతున్న వాడు అతణ్ణి వెంబడించి ఆ పట్టణానికి రావచ్చును. ఇలా గనుక జరిగితే ఆ పట్టణ నాయకులు వదలిపెట్టకూడదు. ఆశ్రయం కోసం వారి దగ్గరకు వచ్చిన వ్యక్తిని వారు కాపాడాలి. ఆ వ్యకి చంపినవానిని ఉద్దేశ పూర్వకంగా చంపలేదు గనుక వారు అతణ్ణి కాపాడాలి. అది ప్రమాదవశాత్తు జరిగింది. అతడు కోపంతో, ఆ వ్యక్తిని చంపాలని చేసిన నిర్ణయం కాదు. అది ఏదో అలా జరిగిపోయింది. 6ఆ పట్టణంలోని న్యాయస్థానం అతనికి తీర్పు తీర్చేంతవరకు అతడు ఆ పట్టణంలో ఉండాలి. మరియు ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు ఆ పట్టణంలోనే ఉండి పోవాలి. తర్వాత అతడు ఏ పట్టణం నుండి పారిపోయాడో అక్కడి తన స్వంత ఇంటికి తిరిగి వెళ్లవచ్చును.”
7కనుక, “ఆశ్రయ పురాలుగా” పిలువబడేందుకు కొన్ని పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించారు. ఆ పట్టణాలు: నఫ్తాలి కొండ దేశంలోని గలిలయలో కెదెషు, ఎఫ్రాయిము కొండ దేశంలో షెకెము, యూదా కొండ దేశంలో కిర్యత్ అర్బ (హెబ్రోను.) 8యొర్దాను నది తూర్పు దిక్కున, యెరికో దగ్గర రూబేను దేశంలోని అరణ్యంలో బేసెరు, గాదు దేశంలోని గిలాదులో రామోతు, మనష్షే దేశంలోని బాషానులో గోలాను.
9ఏ ఇశ్రాయేలీయులు అయినా, వారి మధ్య నివసిస్తున్న ఏవ్యక్తి అయినా ప్రమాదవశాత్తు ఒకరిని చంపినట్లయితే, ఆ వ్యక్తి భద్రతకోసం ఈ ఆశ్రయ పురాలలో ఒక దానికి పారిపోవచ్చును. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ క్షేమంగా ఉంటాడు, అతణ్ణి తరుముతున్న ఎవరిచేతగాని అతడు చంపబడడు. ఆ పట్టణ న్యాయస్థానం, ఆ పట్టణంలో అతనికి న్యాయం తీరుస్తుంది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in