YouVersion Logo
Search Icon

యెహోషువ 13

13
ఇంకా స్వాధీన పరచుకొనని భూమి
1యెహోషువ చాల ముసలివాడైనప్పుడు యెహోవా అతనితో చెప్పాడు: “యెహోషువా, నీవు ముసలివాడవై పోయావు. కానీ నీవు స్వాధీనం చేసుకోవాల్సిన భూమి ఇంకా చాలా ఉంది. 2ఫిలిష్తీయుల దేశాన్ని, గెషూరు దేశాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. 3ఈజిప్టు దగ్గర షీహోరు నది#13:3 షీహోరు నది బహుశా నైల్ నది తూర్పు ప్రాంత విభాగాలలో ఒకటి కావచ్చు. నుండి ఉత్తరాన ఎక్రోను సరిహద్దు వరకు గల ప్రాంతాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. అది కనానీ ప్రజలకు చెందినది. గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోనుల ఐదుగురు ఫిలిష్తీ నాయకులను ఇంకా నీవు జయించాలి. నీవు అవ్వీతీ ప్రజలను, 4కనాను దేశానికి దక్షిణాన ఉన్న వారిని కూడ నీవు ఓడించాలి. 5గెబాలీ ప్రజల ప్రాంతాన్ని నీవు ఇంకా ఓడించలేదు. హెర్మోను కొండ దిగువన బయెల్‌గాదుకు తూర్పున లిబోహ-మాత్ వరకు గల లెబానోను ప్రాంతం కూడ ఉంది.
6“లెబానోనునుండి మిశ్రేఫోత్మాయిము వరకు గల కొండ దేశంలో సీదోను ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజల కోసం ఈ ప్రజలందరినీ నేను బయటకు వెళ్లగొట్టేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు నీవు భూమిని పంచి పెట్టేటప్పుడు ఈ భూమిని తప్పక జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు చెప్పినట్టు ఇలానే చేయి. 7ఇప్పుడు తొమ్మిది వంశాలు, మనష్షే సగం వంశం వారికి ఈ భూమిని విభజించు.”
భూమిని పంచటం
8మనష్షే వంశంలో మిగిలిన సగం మందికి ఇదివరకే నేను భూమి ఇచ్చాను. రూబేను వంశం వారికి, గాదు వంశం వారికి నేను ఇదివరకే భూమిని ఇచ్చాను. యొర్దాను నది తూర్పున యెహోవా సేవకుడు మోషే వారికి భూమిని ఇచ్చాడు. 9యొర్దాను నది తూర్పున మోషే వారికి ఇచ్చిన భూమి ఇదే: దీబోను వరకు గల మేదెబా మైదాన ప్రాంతం అంతా ఇందులో ఉంది. అర్నోను లోయదగ్గర అరోయేరు వద్ద ఈ భూమి మొదలవుతుంది, ఆ లోయ మధ్యలోగల పట్టణం వరకు ఆ భూమి విస్తరించి ఉంది. 10అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన పట్టణాలన్నీ ఆ దేశంలో ఉన్నాయి. రాజు హెష్బోను పట్టణంలో ఉండి పాలించాడు. అమోరీ ప్రజలు నివసించిన ప్రాంతం వరకు ఈ దేశం విస్తరించింది. 11గిలాదు పట్టణం కూడ ఆ దేశంలో ఉంది. గెషూరు, మాయకా ప్రజలు నివసించిన ప్రాంతంకూడ ఆ దేశంలో ఉంది. హెర్మోను పర్వతం అంతా, సల్కావరకు బాషాను అంతా ఆ దేశంలో ఉంది. 12ఓగు రాజు రాజ్యమంతా ఆ దేశంలో ఉంది. ఓగు రాజు బాషానులో పాలించాడు. గతంలో అతడు అష్టారోతు, ఎద్రేయీలో పాలించాడు. ఓగు రెఫాయిము ప్రజలనుండి వచ్చినవాడు. గతంలో మోషే ఆ ప్రజలను ఓడించి, వారి దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 13గెషూరు, మయకా ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు బలవంతంగా బయటకు వెళ్లగొట్టలేదు. నేటికీ ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నారు.
14లేవీ వంశం ఒక్కటే భూమి ఏమీ లభించని కుటుంబం. దానికి బదులుగా, ఇశ్రాయేలీయుల యెహోవా దేవునికి దహన బలులుగా అర్పించబడిన జంతువులన్నీ లేవీ కుటుంబంవారు తీసుకుంటారు. అదే యెహోవా వారికి వాగ్దానం చేసింది.
15రూబేను వంశంలో ప్రతి వంశంవారికీ మోషే కొంత భూమి ఇచ్చాడు. వారికి దొరికిన భూమి ఇది: 16అర్నోను లోయదగ్గర అరోయేరునుండి మేదెబా పట్టణంవరకు గల భూమి. ఆ లోయ మధ్యలో ఉన్న పట్టణం, మైదానం మొత్తం ఇందులో ఉంది. 17హెష్బోను వరకు ఉంది ఈ భూమి. మైదానంలోని పట్టణాలన్నీ ఈ భూమిలో ఉన్నాయి. ఆ పట్టణాలు దీబోను, బామోత్‌బయలు, బేత్‌బయల్మెయోను, 18యహజ్, కెదెమోతు, మేఫాతు, 19కిర్యతాయిము, సిబ్మా లోయలోని కొండమీది యెరెత్ షహిరు, 20బెత్పెయోరు, పిస్గాకొండలు, బెత్ యెషిమోత్. 21కనుక మైదానంలోని అన్ని పట్టణాలు, అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన ప్రాంతం అంతా ఈ భూమిలో ఉంది. ఆ రాజు హెష్బోను పట్టణం దగ్గర పాలించాడు. అయితే అతణ్ణి, మిద్యాను ప్రజానాయకులను మోషే ఓడించాడు. ఆ నాయకులు ఎవి, రెకెము, సూర్, హోరు, రెబా. (ఈ నాయకులంతా సీహోనుతో చేయి కలిపి పోరాడారు) ఈ నాయకులంతా ఆ దేశంలోనే నివసించారు. 22బెయోరువాడైన బిలామును ఇశ్రాయేలు ప్రజలు చంపారు. (బిలాము భవిష్యత్తును గూర్చి చెప్పేందుకు మంత్రాలు వేసేవాడు) ఆ పోరాటంలో ఇశ్రాయేలు ప్రజలు చాలమందిని చంపేసారు. 23రూబేనుకు ఇచ్చిన భూమికి యొర్దాను నదీ తీరం సరిహద్దు. కనుక రూబేను వంశం వారికి ఇవ్వబడిన భూమిలో ఈ పట్టణాలు, పొలాలు అన్నీ చేర్చబడ్డాయి.
24గాదు వంశం వారికి మోషే ఇచ్చిన భూమి ఇది. ప్రతి ఒక్క వంశానికీ ఈ భూమిని మోషే ఇచ్చాడు.
25యాజెరు భూమి, గిలాదు పట్టణాలు అన్నీ రబ్బాతు దగ్గర అరోయేరు వరకూ గల అమ్మోనీ ప్రజల భూమిలో సగం మోషే వారికి ఇచ్చాడు. 26హెష్బోను నుండి రామత్ మిస్పా, బెటోనీము వరకూ గల భూమి ఇందులో ఉంది. మహనయిము నుండి దెబీరువరకు గల ప్రాంతం అంతా ఈ భూమిలో ఉంది. 27బేతారాము, బెత్‌నిమ్రా, సుక్కోతు, సఫోనులోయ ఈ భూమిలో ఉన్నవే. హెష్బోను రాజు సీహోను పాలించిన మిగిలిన భూమి అంతా ఇందులో ఉంది. ఇది యొర్దాను నదికి తూర్పున ఉన్న భూమి. కిన్నెరతు సముద్రం చివరివరకు ఈ భూమి విస్తరించి ఉంది. 28ఈ భూమి అంతా గాదు వంశానికి మోషే ఇచ్చినది. ఈ జాబితాలో చేర్చబడిన పట్టణాలు అన్నీ ఈ భూమిలో ఉన్నాయి. ఒక్కోవంశానికి ఆ భూమిని మోషే ఇచ్చాడు.
29మనష్షే వంశంలో సగం మందికి మోషే ఇచ్చిన భూమి ఇదే. మనష్షే వంశంలోని సగం వంశాలు ఈ భూమిని తీసుకున్నాయి.
30ఆ భూమి మహనయిము దగ్గర మొదలవుతుంది. బాషాను అంతా, బాషాను రాజు ఓగు పాలించిన దేశం అంతా, బాషానులోని యాయీరు పట్టణాలన్నీ ఆ భూమిలో ఉన్నాయి. (అవి మొత్తం 60 పట్టణాలు) 31గిలాదులో సగం, అష్టారోతు, ఎద్రేయి కూడ ఆ భూమిలో ఉన్నాయి. (గిలాదు, అష్టారోతు, ఎద్రేయి ఓగు రాజు నివసించిన పట్టణాలు) ఈ భూమి అంతా మనష్షే కుమారుడు మాకీరు కుటుంబానికి ఇవ్వబడింది. ఆ కుమారులు అందరిలో సగం మందికి ఈ భూమి దొరికింది.
32మోయాబు మైదానాల్లో ఈ వంశాలకు ఈ భూమి అంతటినీ మోషే ఇచ్చాడు. ఇది యెరికోకు తూర్పున యొర్దాను నది అవతల ఉంది. 33అయితే లేవీ వంశం వారికి మోషే భూమి ఏమీ ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు సాక్షాత్తు ఆయనే లేవీ వంశం వారి పరంగా ఉంటానని వాగ్దానం చేసాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in