YouVersion Logo
Search Icon

యిర్మీయా 8

8
1ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “ఆ సమయంలో యూదా రాజులయొక్క, ముఖ్యపాలకుల యొక్క ఎముకలను ప్రజలు సమాధులనుండి తీస్తారు. వారు యాజకుల యొక్క, ప్రవక్తల యొక్క ఎముకలను సమాధులనుండి తీస్తారు. యెరూషలేము ప్రజలు ఎముకలను కూడ వారి సమాధుల నుండి తీస్తారు. 2ఆ మనుష్యులు ఆ ఎముకలను ఆరుబయట సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు కనపడేలా పడవేస్తారు. యోరూషలేము ప్రజలు సూర్య చంద్రులను, నక్షత్రాలను ఆరాధించటానికి యిష్టపడతారు. ఆ ఎముకలను తిరిగి ఎవ్వరూ ప్రోగుచేసి పాతిపెట్టరు. కావున ఆ యెముకలన్నీ పశువుల పేడవలె బయట పారవేయబడును.
3“యూదా ప్రజలు వారి ఇండ్లను, రాజ్యాన్ని వదిలి పోయేలా నేను ఒత్తిడి చేస్తాను. ఆ ప్రజలు వారి దేశాన్నుండి పరరాజ్యానికి తీసికొని పోబడతారు. యుద్ధంలో చావగా మిగిలిన యూదా ప్రజలు (ఈ దుష్ట ప్రజలు) తాము కూడ చనిపోతే బాగుండేదని భావిస్తారు,” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.
పాపము శిక్ష
4“యిర్మీయా, ఈ విషయం యూదా ప్రజలకు తెలియజేయుము: ‘యెహోవా ఈ విషయాలు చెప్పినాడు:
“‘ఒక వ్యక్తి క్రింద పడితే
తిరిగి లేస్తాడని మీకు తెలుసు.
ఒక వ్యక్తి తప్పుదారిలో వెళ్లితే
అతడు మరల తిరిగి వెనుకకు వస్తాడు.
5యూదా ప్రజలు చెడు జీవితం గడిపారు.
కాని యెరూషలేము ప్రజలు ఎప్పుడూ ఎందుకు పెడమార్గాన వెళ్లుచున్నారు?
వారి అబద్ధాలను వారే నమ్ముతారు.
వారు వెనుదిరిగి రావటానికి నిరాకరిస్తారు.
6వారు చెప్పేది నేను బహు శ్రద్ధగా ఆలకించాను.
కాని వారు ఏది సరైనదో తెలియజెప్పరు.
ప్రజలు వారి పాపాలకు విచారించుట లేదు.
ప్రజలు వారు చేసిన నేరాల గురించి ఆలోచించుట లేదు.
ప్రజలు ఆలోచనారహితంగా పనులు చేస్తారు.
వారు యుధ్ధానికి పరుగెత్తే గుర్రాల్లా ఉన్నారు.
7ఆకాశంలో ఎగిరే పక్షులకు సైతం
తమ పనులకు ఒక నిర్ణీత కాలం తెలుసు.
కొంగలు, గువ్వలు, వాన కోవిలలు, ఓదెకరువులు (ఒక జాతి కొంగ)
వీటన్నిటికీ ఇతర ప్రాంతాలకు వలసపోయే కాలము క్రమము తప్పక తెలుసు.
కాని నా ప్రజలకు మాత్రం వారి యెహోవా వారిని ఏమి చేయమని కోరుతున్నాడో తెలియదు.
8“‘యెహోవా ధర్మశాస్త్రం (ఉపదేశములు) మావద్ద ఉన్నది! అందువల్ల మేము తెలివిగలవారము! అని మీరు చెప్పుకుంటూ వుంటారు.
కాని అది నిజం కాదు. ఎందువల్లనంటే లేఖకులు#8:8 లేఖకులు లేఖకులంటే చెప్పెది వ్రాసేవారు, లేక చూచి వివిధ విషయాలు తిరిగ వ్రాసేవారు. పాత నిబంధన గ్రంథములో చేర్చబడిన కొన్ని గ్రంథములు కూడా అలాంటి వ్రాతలలో వున్నాయి. వ్రాయగా, వ్రాయగా ఆ గ్రంథాలు ఏమి చెపుతున్నాయో వారికి తేలికగా తెలిసి వారు ఆరితేరిన వారయ్యారు. (వ్రాత గాండ్రు) వారి కలాలతో అబద్ధమాడారు.
9ఈ “తెలివిగలవారు” యెహోవా ఉపదేశములను వినటానికి నిరాకరించారు.
కావున నిజంగా వారు జ్ఞానవంతులు కారు.
ఆ “జ్ఞానవంతులు” అనబడే వారు మోసంలో పడ్డారు.
వారు విస్మయం పొంది, సిగ్గుపడ్డారు.
10కావున వారి భార్యలను నేనితరులకిచ్చి వేస్తాను.
వారి పొలాలను క్రొత్త యజమానులకిచ్చివేస్తాను.
ఇశ్రాయేలు ప్రజలంతా అధిక ధనసంపాదనపై ఆసక్తిగలవారు.
ప్రాముఖ్యంలేని అతి సామాన్యుల నుండి ముఖ్యుల వరకు ప్రజలంతా అలాంటివారే.
ప్రవక్తల నుండి యాజకుల వరకు ప్రజలంతా అబద్ధాలు చెప్పేవారే.
11నా ప్రజలు బాగా గాయపడ్డారు.
కాని అదేదో బహు చిన్న గాయమైనట్లు ప్రవక్తలు, యాజకులు నా ప్రజలకు తగిలిన దెబ్బను మాన్పజూస్తారు.
“అంతా మంచిగా వుంది; అంతా మంచిగా వుంది!” అని వారంటారు.
కాని పరిస్థితి ఏమీ బాగా లేదు!
12ఆ ప్రజలు తాము చేసే దుష్కార్యాలకు చాలా సిగ్గుపడాలి.
కాని వారు సిగ్గుపడనే లేదు.
వారి పాపాలకు వారు కలవరపాటు చెందాలనేది కూడా వారికి తెలియదు.
అందరితో పాటు వారూ శిక్షించబడతారు.
నేను వారిని శిక్షిస్తాను; వారిని క్రిందికి పడవేస్తాను.’”
ఇది యెహోవా వాక్కు.
13“‘వారి ఫలాలను, పంటను నేను తీసుకుంటాను
అందుచేత అక్కడ పంటకోత ఉండదు. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది
ద్రాక్ష తీగలపై కాయలేమాత్రం ఉండవు. అంజూరపు చెట్లకు కూడ కాయలుండవు.
వాటి ఆకులు సైతం ఎండిపోయి చనిపోతాయి.
నేను వారికిచ్చినవన్నీ తిరిగి తీసుకుంటాను.’”#8:13 నేను … తీసుకుంటాను హీబ్రూలో ఈ వాక్యం చాలా క్లిష్టంగా వుంది.
14“మనమిక్కడ అనవసరంగా ఎందుకు కూర్చున్నాము?
రండి, బలమైన నగరాలకు పారిపోదాం.
మన దేవుడైన యెహోవా మనల్ని చంపబోతూవుంటే, మనం అక్కడే చనిపోదాం.
మనం యెహోవా పట్ల తీరని పాపం చేశాం.
అందుచేత దేవుడు విషం కలిపిన నీటిని మనకు తాగటానికి ఇచ్చాడు.
15మనం శాంతిని కోరుకున్నాం;
కాని శాంతి కలుగలేదు.
స్వస్థత సమయం కొరకు ఎదురు చూశాం,
కాని విపత్తు మాత్రమే ముంచుకొచ్చింది.
16దాను వంశీయుల రాజ్యంనుండి
శత్రు గుర్రాల వగర్పులు వినిపిస్తూ ఉన్నాయి.
వాటి డెక్కల తాకిడికి భూమి కంపిస్తూ ఉంది.
వారీ దేశాన్ని, దానిలో నివసిస్తున్న ప్రతి దాన్నీ
నాశనం చేయాలని వచ్చియున్నారు.
వారీ నగరాన్ని, నగరవాసులను
సర్వనాశనం చేయటానికి వచ్చారు.
17“యూదా ప్రజలారా, మీ మీదికి విషసర్పాలను#8:17 విషసర్పాలను అనగా యూదా శత్రువులు కావచ్చు. పంపుతున్నాను.
ఆ సర్పాలను అదుపుచేయటం సాధ్యపడదు.
ఆ విషనాగులు మిమ్మల్ని కాటు వేస్తాయి.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.!
18దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది; భయమేస్తూ ఉంది.
19నా ప్రజల మొరాలకించుము!
దేశంలో ప్రతిచోటా వారు సహాయాన్ని అడుగుచున్నారు.
“సీయోనులో యెహోవా ఇంకా వున్నాడా?
సీయోను రాజు ఇంకా అక్కడ ఉన్నాడా?” అని వారంటున్నారు.
కాని దేవుడిలా అంటున్నాడు: “యూదా ప్రజలు వారి విగ్రహాలను ఆరాధించి నాకెందుకు కోపం కల్గించారు?
వారు అన్యదేశాల వారి పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”
20మళ్లీ ప్రజలు ఈ విధంగా అన్నారు:
“పంటకోత కాలం అయిపోయింది.
వేసవి వెళ్లిపోయింది. అయినా మేము రక్షించబడలేదు.”
21నా జనులు బాధపడియుండుటచేత#8:21 బాధపడియుండుటచేత “క్రుంగిపోగా” అని పాఠాంతరం. బాధపడుతున్నాను. నేను మాటలాడలేనంత విచారముగా ఉన్నాను.
22వాస్తవానికి గిలియాదులో తగిన ఔషధం ఉంది!
వాస్తవానికి గిలియాదులో వైద్యుడు కూడా ఉన్నాడు!
అయితే నా ప్రజల గాయాలు ఎందుకు నయం చేయబడలేదు?

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 8