YouVersion Logo
Search Icon

యిర్మీయా 42

42
1వారు గెరూతు కింహాము వద్ద ఉండగానే యోహానాను, హోషేయా కుమారుడైన యెజన్యా అనే మరో వ్యక్తి కలిసి ప్రవక్తయైన యిర్మీయా వద్దకు వెళ్లారు. సైన్యాధికారులంతా యోహానాను, యెజన్యానులతో కలిసి వెళ్లారు. అల్పులు మొదలు ఉన్నతుల వరకు అంతా యిర్మీయా వద్దకు వెళ్లారు. 2వారంతా ఇలా అన్నారు: “యిర్మీయా, దయచేసి మా అభ్యర్థన ఆలకించు. యూదా సంతతిలో బతికి బయటపడిన ఈ ప్రజలందరిని గురించి నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. యిర్మీయా, మాలో ఎక్కువ మంది మిగలలేదు. ఒకప్పుడు మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాము. 3యిర్మీయా, మేము ఎక్కడికి వెళ్లవలెనో, ఏమి చేయవలెనో నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి తెలుసుకో.”
4అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా ఇలా అన్నాడు: “మీరు నన్ను చేయమని అడిగిన విషయాలను నేను అర్థం చేసికొన్నాను. మీ దేవుడైన యెహోవాకు మీరడిగిన విధంగా నేను ప్రార్థన చేస్తాను. యెహోవా చెప్పినదంతా నేను మీకు తెలియజేస్తాను. మీకు నేనేదీ దాచి పెట్టను.”
5తరువాత ప్రజలు యిర్మీయాతో ఇలా అన్నారు, “నీ దేవుడైన యెహోవా చెప్పినదంతా మేము చేయకపోతే దేవుడే మాకు వ్యతిరేకంగా నిజమైన సాక్షి అవుతాడు. నీ దేవుడైన యెహోవా మేము ఏది చేయాలో నీకు తెలియజేస్తాడని మాకు తెలుసు. 6యెహోవా వర్తమానం మాకు సమ్మతమవుతుందా, సమ్మతం కాదా అనేది సమస్య కాదు. మా యెహోవా దేవుని పట్ల మేము విధేయులమై ఉంటాము. మేము నిన్ను ఒక సందేశం తెచ్చుట కొరకు పంపుచున్నాము. దానికి మేము కట్టుబడి ఉంటాము. మా దేవుడైన యెహోవాకు మేము విధేయులమైనప్పుడు మాకు మంచి విషయాలు జరుగుతాయని మాకు ఖచ్చితముగా తెలుసు.”
7పది రోజులు జరిగిన పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినిపించింది. 8అప్పుడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్యాధికారులను యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. అతి సామాన్యుడి మొదలు అతి ముఖ్యమైన వ్యక్తి వరకు ప్రజలందరినీ కూడ యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. 9అప్పుడు యిర్మీయా వారితో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వద్దకు మీరు నన్ను పంపారు. మీరు నన్ను అడగమన్నదంతా నేను యెహోవాను అడిగాను. యెహోవా ఇలా చెపుతున్నాడు: 10‘ప్రజలారా మీరు యూదాలో ఉంటే నేను మిమ్మల్ని బలపర్చుతాను — మిమ్మల్ని నాశనం చేయను. మీరు స్థిరపడేలా చేస్తాను. నేను మిమ్మల్ని పెకలించి వేయను. నేనిది ఎందుకు చేయదలచుకున్నానంటే, నేను మీకు కలుగజేసిన భయంకర విషయాల పట్ల నేను విచారిస్తున్నాను. 11బబులోను రాజు విషయంలో ఇప్పుడు మీరు భయపడుతున్నారు. కాని అతనిని చూచి మీరు భయపడవద్దు. బబులోను రాజంటే మీరు భయపడవద్దు.’ ఇదే యెహోవా సందేశం. ‘ఎందువల్ల నంటే, నేను మీతో ఉన్నాను. నేను మిమ్మల్ని కాపాడతాను. నేను మిమ్మల్ని రక్షిస్తాను. అతడు మీ మీద చెయ్యి వేయలేడు. 12నేను మీ పట్ల దయగలిగి వుంటాను. బబులోను రాజు కూడ మీ పట్ల కనికరం చూపుతాడు. అతడు మిమ్మల్ని మీ దేశానికి తిరిగి తీసుకొని వస్తాడు.’ 13‘మేము యూదాలో వుండమని’ మీరు అనవచ్చు. అలా అంటే మీరు మీ యెహోవా దేవుని అనుసరించనట్లే. 14‘అది కాదు. మేము వెళ్లి ఈజిప్టులో నివసిస్తాము. ఆ దేశంలో మాకు యుద్ధ భయం ఉండదు. మేమక్కడ యుద్ధ భేరీలు వినము. మేము అక్కడ ఆకలితో బాధపడము అని మీరు అనవచ్చు.’ 15యూదాలో మిగిలిన ప్రజలారా, మీరలా అంటే యెహోవా వర్తమానం ఏమిటో వినండి. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘మీరు ఈజిప్టునందు నివసింప నిశ్చయిస్తే మీకు ఇలా జరుగుతుంది: 16మీరు యుద్ధమనే కత్తికి భయపడ్డారు. కాని అది మిమ్మల్ని అక్కడ ఓడిస్తుంది. మీరు ఆకలి విషయంలో భయపడ్డారు. కాని మీరు ఈజిప్టులో క్షామానికి గురియగుతారు. మీరక్కడ చనిపోతారు. 17ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించాలనుకునే ప్రతివాడు కత్తివాతబడి గాని, ఆకలిచేగాని, భయంకర వ్యాధులచేగాని చనిపోతాడు. ఈజిప్టుకు వెళ్లే ఏ ఒక్కడు బతకడు. నేను వారికి కలుగజేసే భయంకర పరిస్థితుల నుండి ఏ ఒక్కడూ తప్పించుకోలేడు.’
18“ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘యెరూషలేము పట్ల నా కోపాన్ని చూపాను. యెరూషలేములో నివసించే ప్రజలను నేను శక్షించాను. అదేరీతిగా ఈజిప్టుకు వెళ్లే ప్రతివాని పట్లా నా కోపం చూపిస్తాను. ప్రజలు తమ శత్రువులకు కీడు జరగాలని కోరుకున్నప్పుడు మీకు జరిగినట్లు జరగాలని మిమ్మల్ని ఒక ఉదాహరణగా తీసుకుంటారు. మీరు శాపగ్రస్తులౌతారు. మిమ్మల్ని చూచి ప్రజలు సిగ్గు చెందుతారు. ప్రజలు మిమ్మల్ని అవమాన పర్చుతారు. మీరు మళ్లీ యూదా రాజ్యాన్ని చూడరు.’
19“యూదాలో మిగిలివున్న ప్రజలారా, ‘మీరు ఈజిప్టుకు పోవద్దు’ అని యెహోవా మీకు చెప్పియున్నాడు. ఇప్పుడే మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. 20మీకు చావు తీసికొనివచ్చే తప్పు మీరు చేస్తున్నారు. ‘మీరే నన్ను మీ ప్రభువైన దేవుని వద్దకు పంపారు. మన ప్రభువైన దేవుణ్ణి మా కొరకు ప్రార్థించు. యెహోవా ఏమి చేయమని చెప్పుచున్నాడో అదంతా మాకు తెలియజేయుము. మేము యెహోవా చెప్పినట్లు నడచుకొంటాము’ అని మీరే నాతో అన్నారు. 21కావున ఈ రోజు యెహోవా సందేశాన్ని మీకు వినిపించాను. కాని మీరు ప్రభువైన మీ దేవునికి విధేయులు కాలేదు. ఆయన మిమ్మల్ని ఏమి చేయమని చెప్పటానికి నన్ను పంపియున్నాడో అదంతా మీరు చేయలేదు! 22కావున ఇప్పుడిది బాగా అర్థం చేసికొనండి: మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించాలని అనుకుంటున్నారు. కాని ఈజిప్టులో మీరు కత్తివేటుకు గురియైగాని, ఆకలిచేగాని, భయంకర రోగాలతో గాని చనిపోతారు.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 42

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy