యిర్మీయా 33
33
దేవుని వాగ్దానం
1యెహోవా నుండి సందేశం రెండవసారి యిర్మీయాకు వచ్చింది. యిర్మీయా ఇంకను రక్షక భటుని ఆవరణలో బందీయైయున్నాడు. 2యెహోవా భూమిని సృష్టించాడు. ఆయన దానిని సురక్షితంగా ఉంచుతాడు. ఆ సృష్టికర్త పేరే యెహోవా! యెహోవా ఇలా అంటున్నాడు: 3“ఓ యూదా, నన్ను ప్రార్థించు. నేను నీకు జవాబిస్తాను. నేను నీకు అతి ముఖ్యమైన రహస్యాలను తెలియజేస్తాను. అవి నీవు ముందెన్నడు విని ఎరుగవు. 4యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెరూషలేములోని ఇండ్ల విషయం, యూదా రాజుల భవనాల గురించి యెహోవా ఈ విషయాలు తెలియజేస్తున్నాడు శత్రువు ఆ ఇండ్లను నేల మట్టం చేస్తాడు. శత్రువు నగర గోడల చుట్టూ పై వరకు దిమ్మలు నిర్మిస్తాడు. శత్రువు కత్తి పట్టి ఈ నగరాల ప్రజలతో యుద్ధం చేస్తాడు.
5“యెరూషలేము నగరంలో ప్రజలు చాలా చెడు కార్యాలు చేశారు. వారి పట్ల నేను చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ పట్టణానికి విముఖుడనైనాను. కావున వారిలో చాలా మందిని చంపివేస్తాను. కల్దీయుల సైన్యం యెరూషలేముతో యుద్ధానికి వస్తుంది. యెరూషలేము నగరంలోని ఇండ్లలో అనేక మంది శవాలు పడి ఉంటాయి.
6“కాని ఆ నగరంలోని ప్రజలను నేను స్వస్థపరచి వారికి ఉపశమనం కలుగజేస్తాను. వారు శాంతి, రక్షణ కలిగి ఉండేలా చేస్తాను. 7యూదాను, ఇశ్రాయేలును గతంలో మాదిరిగా మిక్కిలి బలపడేలా చేస్తాను. 8వారు నాకు విరోధంగా పాపం చేశారు కాని నేను ఆ పాపాన్ని కడిగి వేస్తాను. నాకు విరోధంగా వారు పోరాడారు కాని వారిని క్షమిస్తాను. 9అప్పుడు యెరూషలేము ఒక అద్భుతమైన స్థలంగా మారి పోతుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇతర దేశాల ప్రజలు దిగ్భ్రాంతులవుతారు. మరియు నేను ఇశ్రాయేలీయులకు కలుగజేసే క్షేమాన్ని విశ్రాంతిని చూచి వణకుతారు. అనేక మంచి పనులు జరగడం గురించి వారు విన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇతర రాష్ట్రాల వారు నేను ఇశ్రాయేలుకు అనుగ్రహించిన మంచి వాటిని గురించి వింటారు.
10“ప్రజలారా మీరిలా అంటున్నారు, ‘మా దేశం వట్టి ఎడారి అయిపోయింది. మనుష్యులు గాని, జంతుజాలం గాని ఏదీ ఇక్కడ నివసించటం లేదు.’ యెరూషలేము వీధులలోను, యూదా పట్టణాలలోను ఇప్పుడు ప్రశాంతత నెలకొన్నది. కాని త్వరలో అక్కడ సందడి ఏర్పడుతుంది. 11అక్కడ తిరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వధూవరుల వేడుకలు నెలకొంటాయి. దేవాలయానికి కానుకలు తెచ్చే జన సందోహాల సందడి వినిపిస్తుంది. ‘సర్వశక్తిమంతుడయిన యెహోవాకు జయగీతం పాడండి! యెహోవా దయామయుడు. ఆయన కరుణ శాశ్వతంగా మనకు లభిస్తుంది!’ అని ప్రజలు అంటారు. యూదాకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. గనుక ప్రజలా మాటలు చెపుతారు. అప్పుడు యూదా తన పూర్వ వైభవం తిరిగి నెలకొంటుంది.” ఇదే యెహోవా వాక్కు.
12సర్వశక్తిమంతుడయిన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ప్రదేశం ఇప్పుడు ఖాళీగా వుంది. ఇది నిర్మానుష్యంగా, జంతు సంచారం కూడ లేకుండా ఉంది. కాని యూదా పట్టణాలన్నీ ప్రజలతో నిండిపోతాయి. గొర్రెల కాపరులుంటారు. పచ్చిక బయళ్లు మళ్లీ చిగురిస్తాయి. మందలు పచ్చిక మేసి హాయిగా వాటిలో విశ్రమిస్తాయి. 13గొర్రెలు తమ ముందు నడుస్తూ ఉండగా, కాపరులు వారి గొర్రెలను లెక్కిస్తారు. మన్యం ప్రాంతంలో, పచ్చిమ కొండవాలు ప్రాంతంలో, నెగేవు ఎడారి ప్రాంతంలో, ఇంకా యూదా పట్టణాలన్నిటిలో ప్రజలు తమ తమ గొర్రెలను లెక్కపెట్టుకుంటూ ఉంటారు.”
మంచి కొమ్మ
14ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేసియున్నాను. నేనిచ్చిన మాట నెరవేర్చుకునే సమయం ఆసన్నమవుతూ వుంది. 15ఆ సమయంలో దావీదు వంశం నుండి ఒక మంచి ‘కొమ్మ’ చిగురించి పెరిగేలా చేస్తాను. ఆ మంచి ‘కొమ్మ’ (రాజు) దేశానికి ఏది మంచిదో, ఏది నీతి దాయకమో అది చేస్తుంది. 16ఈ ‘కొమ్మ’ చిగిర్చిన కాలంలో యూదా ప్రజలు రక్షింపబడతారు. యెరూషలేములో ప్రజలు సురక్షితంగా జీవిస్తారు. ఈ కొమ్మ పేరు ‘యెహోవాయే మా నీతి.’”
17యెహోవా ఇలా చెపుతున్నాడు, “దావీదు వంశంలోని ఒక వ్యక్తి సదా సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయులను పరిపాలిస్తాడు. 18లేవీయుల వంశంలోనివారే ఎల్లప్పుడూ యాజకులుగా ఉంటారు. ఆ యాజకులు సదా నా ఎదుట నిలచి నాకు దహన బలులు, ధాన్యార్పణలు, బలులు అర్పిస్తారు.”
19యిర్మీయాకు యెహోవా నుండి ఈ వర్తమానం వచ్చింది. 20యెహోవా ఇలా అన్నాడు: “నాకు రాత్రింబవళ్లతో ఒక ఒడంబడిక ఉంది. అవి అలా ఎల్లప్పుడూ సరైన సమయంలో వస్తాయి. ఆ ఒడంబడికను మీరు మార్చలేరు! దివారాత్రులు క్రమం తప్పక అలా వస్తూనే ఉంటాయి. మీరా నిబంధన మార్చగల్గిననాడు, 21నా సేవకుడైన దావీదు, నా సేవకులైన లేవీయులతో యాజకులతో నా ఒడంబడికను కూడా మార్చగల్గుతారు. అప్పుడు దావీదు వంశంలోని వారు రాజులు కాలేరు. లేవీ వంశం వారు యాజకులు కాలేరు. 22కాని నేను నా సేవకుడైన దావీదు వంశం, లేవీ వంశం అభివృద్ధి పొందేలా చేస్తాను. ఆకాశంలో నక్షత్రాల్లా వారి సంతతి వృద్ధి పొందుతుంది. ఆ నక్షత్రాలను ఎవ్వరూ లెక్కపెట్టలేరు. మరియు వారి సంతానం సముద్ర తీరాన గల ఇసుక రేణువుల్లా వృద్ధి పొందుతుంది. ఆ ఇసుక రేణువులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు.”
23యిర్మీయా ఈ వర్తమానాన్ని యెహోవా నుండి విన్నాడు: 24“యిర్మీయా, ప్రజలేమనుకుంటున్నారో నీవు విన్నావా? ‘యెహోవా ఇశ్రాయేలు, యూదా రెండు వంశాల వారికి విముఖుడయ్యాడు. యెహోవా వారిని ముందు ఎన్నుకున్నాడు. కాని ఇప్పుడాయన వారిని తిరస్కరించాడు.’ వారు మా ప్రజలను ఎంతగా ద్వేషస్తున్నారంటే, మా ప్రజలు ఒక రాజ్యంగా కూడా అంగీకరించటం లేదు.”
25అయితే యెహోవా ఇలా అంటున్నాడు: “దివారాత్రులతో నా ఒడంబడిక కొనసాగకపోతే, భూమ్యాకాశాలకు సంబంధించిన న్యాయసూత్రాలను నేను చేయకపోతే, బహుశః నేనా ప్రజలను వదిలి వేస్తాను. 26బహుశః అప్పుడు యాకోబు సంతతి నుండి నేను దూరంగా ఉంటాను. బహుశః అప్పుడే నేను దావీదు వంశం వారు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారిని ఏలకుండా చేస్తాను. కానీ నిర్బంధంలో నుండి వారిని మరలా వారి స్వదేశానికి తెస్తాను. ఆ ప్రజల పట్ల దయగలిగి ఉంటాను.”
Currently Selected:
యిర్మీయా 33: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International