యిర్మీయా 12
12
యిర్మీయా దేవునికి ఫిర్యాదు చేయుట
1యెహోవా, నేను నీతో వాదించినట్లయితే,
నీవే ఎల్లప్పుడూ సరైనవాడవుగా ఉంటావు!
కానీ న్యాయంగా కనబడని కొన్ని విషయాల గురించి నేను నిన్ను అడగాలనుకొంటున్నాను.
దుర్మార్గులు ఎందుకు విజయవంతులవుతున్నారు?
నమ్మదగని ప్రజలు ఎలా సులభమైన జీవితం గడుపుతున్నారు?
2ఈ దుర్మార్గులను నీవిక్కడ ఉంచినావు. మొక్కలు బాగా వేరూనినట్లు వారు బాగా స్థిరపడి,
అభివృద్ధిచెంది కాయలు కాసారు.
నీవు వారికి చాలా ప్రియమైన వాడివని వారు నోటితో చెబుతారు.
కాని వారి హృదయాలలో నీవు లేవు. వారు నీకు చాలా దూరంగా ఉన్నారు.
3ఓ ప్రభువా, నా హృదయం నీకు తెలుసు.
నన్ను నీవు చూస్తూనే ఉన్నావు. నా మనస్సును పరీక్షిస్తూనే ఉన్నావు.
గొర్రెలను నరకటానికి లాగినట్టు, ఆ దుర్మార్గపు మనుష్యులను లాగివేయి.
సంహారపు రోజునకు వారిని ఎంపిక చేయి.
4ఎన్నాళ్లు ఈ భూమి వర్షపాతం లేక ఎండిపోయి ఉండాలి?
ఎన్నాళ్లీ నేలపై గడ్డి ఎండి, చచ్చిపోయి ఉండాలి?
దేశంలో పశువులు, పక్షులు అన్నీ చనిపోయాయి.
ఈ దుష్ట జనుల చెడుపనులే ఈ పరిస్థితికి కారణం.
పైగా, “మాకు ఏమి జరుగుతుందో చూడటానికి యిర్మీయా ఎక్కువ కాలం బ్రతకడు”
అని ఆ దుర్మార్గులే అంటున్నారు.
యిర్మీయాకు దేవుని సమాధానం
5“యిర్మీయా, మానవులతో పరుగు పందెమునకే నీవు అలసిపోతే,
మరి గుర్రాలతో నీవు ఎలా పరుగు పెట్టగలవు?
సురక్షిత దేశంలోనే నీవు అలసిపోతే,
యొర్దాను నదీ తీరాన పెరిగే ముండ్ల పొదలలోకి వస్తే నీవు ఏమి చేస్తావు?
6ఈ మనుష్యులు నీ స్వంత సోదరులు.
నీ కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారు.
నీ ఇంటివారే నిన్ను జూచి అరుస్తున్నారు.
వారు నీతో స్నేహితులవలె మాట్లాడినా
నీవు వారిని నమ్మవద్దు.
యెహోవా యూదాను తిరస్కరించుట
7“నేను (యెహోవాను) నా ఇంటిని (యూదాను) వదిలివేశాను.
నా స్వంత ఆస్తిని#12:7 నా స్వంత ఆస్తి నా స్వంత ఆస్తి అనగా యూదా ప్రజలు నేను వదిలివేశాను.
నేను ప్రేమించే దానిని (యూదా) ఆమె శత్రువులకే అప్పగించాను.
8నా ఆస్తే నాకు ఒక భయంకర సింహంలా తయారయ్యింది.
అది నన్ను చూచి గర్జిస్తూవుంది.
అందుచే దాన్ని నేను అసహ్యించు కుంటున్నాను.
9నా ఆస్తి రాబందులచే ఆవరింపబడిన
చనిపోయే జంతువులా వుంది.
ఆ పక్షులు దాని చుట్టూ ఎగురుతాయి.
వన్య (అడవి) మృగములారా, రండి.
రండి, తినటానికి ఆహారం తీసుకోండి.
10చాలామంది గొర్రెల కాపరులు (నాయకులు) నా ద్రాక్షా తోటను నాశనం చేసారు.
ఆ కాపరులు నా తోటలోని మొక్కలపై నడిచారు.
వారు నా అందాల తోటను వట్టి ఎడారిగా మార్చి వేశారు.
11వారు నా భూమిని ఎడారిలా చేశారు.
అది ఎండి చచ్చిపోయింది. అక్కడ ఎవ్వరూ నివసించరు.
దేశం యావత్తూ వట్టి ఎడారి అయ్యింది.
అక్కడ ఆ భూమిని గూర్చి శ్రద్ధ వహించే వారు ఎవ్వరూ లేరు.
12సైనికులు ఎడారిలోని నీళ్లగుంటలను దోచుకొనుటకు వచ్చారు.
యెహోవా ఆ సైన్యాలను ఆ రాజ్యాన్ని శిక్షించటానికి వినియోగించుకున్నాడు.
రాజ్యంలో ఒక మూలనుండి మరోమూల వరకు గల ప్రజలంతా శిక్షింపబడ్డారు.
ఏ ఒక్కరికీ రక్షణ లేదు.
13ప్రజలు గోధుమ పైరు నాటుతారు.
కాని వారు కోసేది ముండ్లను మాత్రమే.
వారు బాగా అలసిపోయేటంతగా శ్రమిస్తారు.
కాని వారి శ్రమకు ఫలం శూన్యం.
వారి పంట విషయంలో వారు సిగ్గు చెందుతారు.
యెహోవా కోపకారణంగా ఇదంతా జరిగింది.”
ఇశ్రాయేలు పొరుగు వారికి దేవుని వాగ్దానం
14యెహోవా ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలు చుట్టు పట్లవుండే ప్రజలకు నేనేమి చేస్తానో నీకు చెపుతాను. ఆ జనులు చాలా దుర్మార్గులు. నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన రాజ్యాన్ని వారు ధ్వంసం చేశారు. ఆ దుష్ట జనులను నేను పెల్లగించి, వారి రాజ్యంనుండి బయటికి త్రోసివేస్తాను. వారితో పాటు యూదా వారిని కూడా పెల్లగించుతాను. 15నేను వారిని తమ రాజ్యం నుండి భ్రష్టులను చేశాక, వారి విషయంలో నేను బాధపడతాను. తరువాత ప్రతి కుటుంబాన్నీ దాని స్వస్థలానికి, స్వంత ఆస్తికి తీసుకొని వస్తాను. 16కాకపోతే ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నాకోరిక. గతంలో వారు నా ప్రజలకు బయలు దేవత పేరు మీద వాగ్దానాలు చేయటం నేర్పినారు. ఇప్పుడు ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నా ప్రయత్నం. వారు నా పేరు ఉపయోగించుట నేర్చుకోవాలి. ‘నిత్యుడైన దేవుని సాక్షిగా …’ అని వారు చెప్పుట నేర్చుకోవాలి. అప్పుడు నేను వారిని నా ప్రజల మధ్య నిత్యము నివసించేలా చేస్తాను. 17కాని ఏ దేశమైనా మాట వినకపోతే, అప్పుడు నేను వారిని సర్వ నాశనం చేస్తాను. చచ్చిన మొక్కలవలె వారిని లాగి పారవేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
Currently Selected:
యిర్మీయా 12: TERV
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International