న్యాయాధిపతులు 6
6
మిద్యానీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుట
1యెహోవా చెడ్డవి అని చెప్పిన సంగతులనే ఇశ్రాయేలు ప్రజలు మరల చేసారు. అందుచేత యెహోవా మిద్యాను ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను ఏడు సంవత్సరాల వరకు ఓడింపనిచ్చాడు.
2మిద్యాను ప్రజలు చాలా శక్తిగలవారు మరియు ఇశ్రాయేలు ప్రజల పట్ల చాలా క్రూరులు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఆ కొండలలో దాగుకొనే స్థలాలు అనేకం చేసుకున్నారు. వారి భోజనాన్ని గుహలలోను, కనుక్కొనేందుకు కష్టతరమైన స్థలాలలోను దాచుకున్నారు. 3తూర్పు ప్రాంతంనుండి మిద్యానీయులు, అమాలేకీయులు ఎల్లప్పుడు వచ్చి వారి పంటలను పాడుచేసేవారు గనుక వారు అలా చేశారు. 4ఆ మనుష్యులు దేశంలో బసచేసి, ఇశ్రాయేలు ప్రజల పంటలను నాశనం చేశారు. గాజా పట్టణం వరకుగల దేశమంతటా ఇశ్రాయేలీయుల పంటలను వారు నాశనం చేశారు. ఇశ్రాయేలీయులు తినేందుకు ఆ ప్రజలు ఏమీ విడిచి పెట్టలేదు. వారి కోసం గొర్రెలుగాని, పశువులుగాని లేక గాడిదలు గాని ఏమీ వారు విడిచిపెట్టలేదు. 5మిద్యానీయులు వచ్చి ఆ దేశంలో నివాసం చేశారు. వారు వారి కుటుంబాలను వారి పశువులను వారి వెంట తెచ్చుకున్నారు. వారు మిడతల దండులంత మంది ఉన్నారు! వారి మనుష్యులు, వారి ఒంటెలు విస్తారంగా ఉన్నందుచేత లెక్కించుటకు అసాధ్యం అయింది. ఈ మనుష్యులంతా దేశంలోకి వచ్చి దానిని పాడుచేశారు. 6మిద్యాను ప్రజల మూలంగా ఇశ్రాయేలు ప్రజలు చాలా దరిద్రులయ్యారు కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు.
7మిద్యానీయులు#6:7-10 వచనాలు పురాతన హీబ్రూ ప్రతులైన “మృత సముద్రపు పత్రుల్లో” రాయబడలేదు. ఆ చెడ్డ పనులన్నీ చేశారు. కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. 8కనుక యెహోవా వారికి ఒక ప్రవక్తను పంపించాడు. ఇశ్రాయేలీయులతో ఆ ప్రవక్త ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేది ఇదే: ‘మీరు ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉంటిరి. నేను మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసి ఆ దేశం నుండి బయటకు రప్పించాను. 9ఈజిప్టు యొక్క బలమైన ప్రజలనుండి నేను మిమ్మల్ని రక్షించాను. తర్వాత కనాను దేశ ప్రజలు మిమ్మల్ని బాధ పెట్టారు. కనుక నేను మరల మిమ్మల్ని రక్షించాను. ఆ ప్రజలు వారి దేశం వదిలి పోయేటట్టు నేను చేశాను. మరియు వారి దేశాన్ని, నేను మీకు ఇచ్చాను.’ 10‘నేనే మీ యెహోవాను, మీ దేవుడనని అప్పుడు మీకు చెప్పాను. మీరు అమోరీయుల దేశంలో నివసిస్తారు. కాని వారి బూటకపు దేవుళ్లను మీరు పూజించకూడదు, అని నేను మీతో చెప్పాను.’ కాని మీరు నాకు విధేయులు కాలేదు.”
యెహోవాదూత గిద్యోనును దర్శించటం
11ఆ కాలంలో, గిద్యోను అను పేరుగల మనిషి దగ్గరకు యెహోవాదూత వచ్చాడు. దేవుని దూత వచ్చి ఒఫ్రాలోని మస్తకి చెట్టు క్రింద కూర్చున్నాడు. ఈ మస్తకి చెట్టు యోవాషు అనే పేరుగలవానిది. యోవాషు అబీయెజ్రీ వంశస్థుడు. యోవాషు గిద్యోనుకు తండ్రి. గిద్యోను ఒక ద్రాక్షా గానుగలో గోధుమలు నలుగకొడుతున్నాడు. యెహోవాదూత గిద్యోను దగ్గర కూర్చున్నాడు. మిద్యానీయులు, తనని (గిద్యోను) చూడకుండునట్లు ద్రాక్షా గానుగ చాటున గోధుమలను నలుగగొట్టుచుండగా, 12యెహోవాదూత గిద్యోనుకు ప్రత్యక్షమయి, “మహా సైనికుడా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు” అని చెప్పాడు.
13అప్పుడు గిద్యోను అన్నాడు: “అయ్యా, నేను ప్రమాణం చేస్తున్నాను, యెహోవా మనకు తోడుగా ఉంటే మనకు ఇన్ని కష్టాలెందుకు? మన పూర్వీకులకు ఆయన అద్భుతమైన విషయాలు జరిగించాడు అని మనం విన్నాం. మన పూర్వీకులను ఈజిప్టు నుండి యెహోవా బయటకు రప్పించాడని వారు మనతో చెప్పారు. కాని యెహోవా మనలను విడిచిపెట్టేశాడు. యెహోవా మిద్యానీయులు మనలను ఓడింపనిచ్చాడు.”
14యెహోవా గిద్యోనువైపు తిరిగి, “నీ శక్తిని ప్రయోగించు. నీవు వెళ్లి మిద్యాను ప్రజల నుండి ఇశ్రాయేలీయులను రక్షించు. వారిని రక్షించేందుకు నేను నిన్ను పంపుతున్నాను!” అని చెప్పాడు.
15అయితే గిద్యోను, “అయ్యా, నన్ను క్షమించండి, ఇశ్రాయేలీయులను నేను ఎలా రక్షించగలను? మనష్షే వంశంలో నా కుటుంబం అతి బలహీనమైనది. నా కుటుంబంలో అందరికంటే నేను చిన్నవాడను” అని జవాబిచ్చాడు.
16యెహోవా గిద్యోనుకు జవాబిస్తూ, “నేను నీతో కూడా ఉన్నాను! కనుక మిద్యానీయులను నీవు ఓడించగలవు. అది నీవు ఒకే ఒక్క మనిషితో పోరాడుతున్నట్టుగా కనబడుతుంది.” అని చెప్పాడు.
17అప్పుడు గిద్యోను యెహోవాతో చెప్పాడు: “నా మీద నీకు దయ ఉంటే, నీవే నిజంగా యెహోవా అనేందుకు నాకు ఒక ఋజువు చూపు. 18దయచేసి ఇక్కడే వేచియుండు. నేను తిరిగి నీ దగ్గరకు వచ్చేంతవరకు వెళ్లిపోవద్దు. నా కానుకను తెచ్చి నీ ఎదుట పెట్టనియ్యి.”
యెహోవా, “నీవు తిరిగి వచ్చేవరకూ నేను వేచి ఉంటాను,” అని చెప్పాడు.
19కనుక గిద్యోను వెళ్లి కాగుతున్న నీళ్లలో ఒక మేక పిల్లను వంటకం చేసాడు. గిద్యోను తూమెడు పిండిని తీసుకుని పొంగని రొట్టె చేసాడు. అప్పుడు గిద్యోను ఆ మాంసాన్ని ఒక బుట్టలో ఉంచి ఉడకపెట్టిన మాంసము యొక్క రసాన్ని ఒక పాత్రలో ఉంచాడు. గిద్యోను ఆ మాంసాన్ని, వండిన మాంసపు రసాన్ని, పొంగని రొట్టెను బయటకు తీశాడు. గిద్యోను ఆ భోజనాన్ని మస్తకి చెట్టు క్రింద యెహోవాకు ఇచ్చాడు.
20దేవుని దూత, “ఆ మాంసాన్ని, పొంగని ఆ రొట్టెను అదిగో అక్కడ ఉన్న బండ మీద ఉంచు. తర్వాత నీళ్లు పారబోయి” అని గిద్యోనుతో చెప్పాడు. గిద్యోను తనకు చెప్పబడినట్టు చేశాడు.
21యెహోవాదూత ఒక చేతికర్ర పట్టుకొని ఉన్నాడు. యెహోవాదూత ఆ కర్ర కొనతో మాంసాన్ని, రొట్టెను తాకాడు. అప్పుడు బండనుండి అగ్ని బయలు వెళ్లింది! ఆ మాంసం, రొట్టె పూర్తిగా కాల్చివేయబడ్డాయి! అప్పుడు యెహోవాదూత అదృశ్యమయ్యాడు.
22గిద్యోను తాను యెహోవాదూతతో మాట్లాడుతున్నట్లు అప్పుడు గ్రహించాడు. కనుక గిద్యోను, “సర్వశక్తిమంతుడైన యెహోవా! యెహోవాదూతను నేను ముఖాముఖిగా చూశాను!” అని అరిచాడు.
23కానీ యెహోవా, “నిశ్శబ్దంగా ఉండు! భయ పడవద్దు! నీవు చనిపోవు!” అని గిద్యోనుతో చెప్పాడు.
24కనుక యెహోవాను ఆరాధించేందుకు ఆ స్థలంలో గిద్యోను ఒక బలిపీఠం నిర్మించాడు. ఆ బలిపీఠానికి, “యెహోవాయే శాంతి” అని గిద్యోను పేరు పెట్టాడు. ఒఫ్రా పట్టణంలో ఆ బలిపీఠం ఇంకా నిలిచి ఉంది. ఆబీయెజ్రీ కుటుంబం నివసించే చోట ఒఫ్రా ఉంది.
గిద్యోను బయలు బలిపీఠాన్ని పడగొట్టటం
25అదే రాత్రి గిద్యోనుతో యెహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: “నీ తండ్రికి చెందిన బాగా ఎదిగిన ఎద్దును, అనగా ఏడు సంవత్సరాల ఎద్దును తీసుకో. నీ తండ్రికి బూటకపు బయలు దేవతా బలిపీఠము ఒకటి ఉంది. ఆ బలిపీఠము ప్రక్కగా ఒక కొయ్యస్తంభం ఉంది. బూటకపు దేవత అషేరా ఘనత కోసం ఆ స్తంభం చేయబడింది. బయలు బలిపీఠాన్ని పడదోసేందుకు, అషేరా స్తంభాన్ని విరగగొట్టేందుకు ఆ ఎద్దును ఉపయోగించు. 26అప్పుడు నీ యెహోవా దేవునికి సరయిన బలిపీఠం నిర్మించు. ఎత్తైన ఈ స్థలంలో బలిపీఠాన్ని నిర్మించు. అప్పుడు బాగా ఎదిగిన ఆ ఎద్దును ఈ బలిపీఠం మీద చంపి దహించు. నీ అర్పణను దహించేందుకు అషేరా స్తంభపు కట్టెను ఉపయోగించు.”
27కనుక గిద్యోను తన సేవకులు పది మందిని తీసుకొని యెహోవా చేయమని చెప్పినట్టు చేశాడు. కాని తన కుటుంబము వారు, పట్టణము వారు తాను చేస్తున్న దానిని చూస్తారేమోనని గిద్యోను భయపడ్డాడు. తాను ఏమి చేయాలని తనతో యెహోవా చెప్పాడో దానినే గిద్యోను చేశాడు. కానీ అతడు ఆ పనిని పగలు కాక రాత్రివేళ చేశాడు.
28మరునాడు ఉదయాన్నే ఆ పట్టణ ప్రజలు మేల్కొన్నారు. బయలు బలిపీఠం పాడుచేయబడి ఉండటం వారు చూశారు. అషేరా స్తంభం నరకబడి ఉండటం కూడా వారు చూశారు. అషేరా స్తంభం బయలు బలిపీఠానికి పక్కగా వుంది. గిద్యోను కట్టిన బలిపీఠాన్ని కూడా ఆ మనుష్యులు చూశారు. ఆ బలిపీఠం మీద అర్పించబడిన ఎద్దును వారు చూశారు.
29ఆ పట్టణస్తులు ఒకర్నొకరు చూసి, “మన బలిపీఠాన్ని ఎవరు పడగొట్టారు? మన అషేర స్తంభాన్ని ఎవరు నరికి వేసారు?” అని చెప్పుకొన్నారు. వారు ఎన్నో ప్రశ్నలు వేసుకొని, ఆ పనులు చేసినదెవరో తెలిసికొనేందుకు ప్రయత్నించారు.
“యోవాషు కుమారుడైన గిద్యోను ఈ పని చేసాడు” అని వారితో ఎవరో చెప్పారు.
30కనుక ఆ పట్టణస్తులు యోవాషు దగ్గరకు వచ్చారు, “నీవు నీ కుమారుని బయటకు తీసుకురా! అతడు బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు. ఆ బలిపీఠం పక్కనే ఉన్న అషేరా స్తంభాన్ని అతడు నరికి వేసాడు. కనుక నీ కుమారుడు చావాల్సిందే” అని వారు యోవాషుతో చెప్పారు.
31అప్పుడు యోవాషు తన చుట్టూరా ఉన్న జనంతో మాట్లాడాడు: “మీరు బయలు పక్షాన ఉంటారా? మీరు బయలును కాపాడుతారా? ఎవడైనా బయలు పక్షం వహిస్తే ఉదయానికల్లా వాడు చంపబడునుగాక. ఒకవేళ బయలు నిజంగా దేవుడైతే, వాని బలిపీఠాన్ని ఎవరైనా పడగొట్టుతున్నప్పుడు తనను తానే కాపాడుకోవాలి” అని యోవాషు చెప్పాడు. 32“ఒకవేళ బయలు బలిపీఠాన్ని గిద్యోను పడగొట్టియుంటే అతనితోనే బయలును వాదించమనండి.” అని యోవాషు చెప్పాడు. కనుక ఆ రోజున యోవాషు గిద్యోనుకు యెరుబ్బయెలు#6:32 యెరుబ్బయెలు అనగా వాదించువాడు అని అర్థం. అని ఒక కొత్త పేరు పెట్టాడు.
గిద్యోను మిద్యాను ప్రజలను ఓడించటం
33మిద్యాను, అమాలేకు తూర్పు ప్రాంతపు ఇతర ప్రజలు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేసేందుకు సమావేశమయ్యారు. ఆ ప్రజలు యోర్దాను నది దాటి వెళ్లి యెజ్రెయేలు లోయలో నివాసం చేశారు. 34యెహోవా ఆత్మ గిద్యోను మీదికి వచ్చి అతనికి గొప్ప శక్తిని ఇచ్చింది. అబీయెజెరు కుటుంబం తనను వెంబడించేందుకు గిద్యోను ఒక బూర ఊదాడు. 35మనష్షే వంశం మనుష్యులందరి దగ్గరకు గిద్యోను వార్తాహరులను పంపించాడు. ఆయుధాలు తీసుకుని యుద్ధానికి సిద్ధం కావాలని ఆ వార్తాహరులు మనష్షే మనుష్యులతో చెప్పారు. ఆషేరు, జెబూలూను, నఫ్తాలి వంశాలకు కూడా గిద్యోను వార్తాహరులను పంపించాడు. వార్తాహరులు అదే సందేశం తీసుకుని వెళ్లారు. కనుక ఆ వంశాల వారు కూడా గిద్యోనును, అతని మనుష్యులను కలుసుకొనటానికి వెళ్లారు.
36అప్పుడు గిద్యోను దేవునితో చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు నీవు నాకు సహాయం చేస్తానని చెప్పావు. నాకు ఋజువు చూపు! 37నేను కళ్ళెంలో గొర్రెచర్మం ఉంచుతాను. చుట్టూరా ఉన్న నేల అంతా పొడిగా ఉండి, ఆ చర్మం మీద మాత్రమే మంచుపడివుంటే, అప్పుడు నీవు చెప్పినట్టే ఇశ్రాయేలును రక్షించేందుకు నీవు నన్ను వాడుకొంటావని నేను తెలుసుకొంటాను.”
38సరిగ్గా అలాగే జరిగింది. మరునాడు ఉదయాన్నే గిద్యోను లేచి ఆ గొర్రెచర్మాన్ని పిండాడు. ఆ గొర్రె చర్మం నుండి ఒక పాత్ర నిండుగా అతడు నీళ్లు పిండాడు.
39అప్పుడు గిద్యోను దేవునితో, “నా మీద కోపగించకు. మరొక్క విషయం నిన్ను అడుగనియ్యి. గొర్రెచర్మంతో నిన్ను మరొక్కసారి పరీక్షించనియ్యి. ఈసారి దాని చుట్టూరా ఉన్న నేల మంచుతో తడిసి గొర్రెచర్మం మాత్రం పొడిగా ఉండనియ్యి” అని చెప్పాడు.
40ఆ రాత్రి దేవుడు సరిగ్గా అలాగే చేసాడు. గొర్రెచర్మం మాత్రం పొడిగా ఉంది, కానీ దాని చుట్టూరా నేల మంచుతో తడిసి ఉంది.
Currently Selected:
న్యాయాధిపతులు 6: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International