యెషయా 38
38
హిజ్కియా జబ్బు
1ఆ కాలంలో హిజ్కియాకు జబ్బు చేసింది. అతనికి దాదాపు మరణ పరిస్థితి ఏర్పడింది. ఆమోజు కుమారుడు యెషయా ప్రవక్త అతన్ని చూడటానికి వెళ్లాడు. “నేను ఈ సంగతులు నీతో చెప్పాలని యెహోవా నాకు చెప్పాడు. ‘త్వరలోనే నీవు మరణిస్తావు. కనుక నీవు చనిపోయినప్పుడు నీ కుటుంబం వారు ఏం చేయాలో నీవు వారితో చెప్పాలి. నీవు మళ్లీ బాగుపడవు’ అని యెషయా రాజుతో చెప్పాడు.”
2హిజ్కియా దేవాలయపు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అతడు చెప్పాడు, 3“యెహోవా, నేను నీ యెదుట ఎల్లప్పుడూ నమ్మకమైన పవిత్ర హృదయంతో జీవించానని దయచేసి జ్ఞాపకం చేసికొనుము. నీవు మంచివి అనే పనులే నేను చేశాను.” తర్వాత హిజ్కియా గట్టిగా ఏడ్వటం మొదలు బెట్టాడు.
4యెహోవా దగ్గర్నుండి యెషయా ఈ సందేశాన్ని స్వీకరించాడు; 5“హిజ్కియా దగ్గరకు వెళ్లి అతనితో చెప్పు, నీ పూర్వీకుడైన దావీదు దేవుడు, యెహోవా చెప్పే సంగతులు ఇవి, ‘నీ ప్రార్థనలు నేను విన్నాను, నీ దుఃఖపు కన్నీళ్లు నేను చూశాను. నేను నీ ఆయుష్షు పదిహేను సంవత్సరాలు ఎక్కువ చేస్తాను. 6అష్షూరు రాజు నుండి నిన్ను నేను కాపాడుతాను. నిన్ను, ఈ పట్టణాన్ని నేను రక్షిస్తాను.’”
7యెహోవా చెప్పిన వాటిని చేస్తాడని నీకు చూపించేందుకు యిదే సంకేతం. 8“చూడు, ఆహాజు మెట్ల మీద ఉన్న ఎండ గడియారము నీడను పది అడుగులు వెనుకకు వెళ్లేటట్టు నేను చేస్తున్నాను. దిగిపోయిన సూర్యుని నీడ పది అడుగులు వెనుకకు వెళ్తుంది.”
హిజ్కియా పాట
9హిజ్కియా రోగమునుండి స్వస్థత పొందినప్పుడు వ్రాసిన గీతం:
10నేను వృద్ధుడనయ్యేంత వరకు బ్రతుకుతానని నాలో నేను అనుకొన్నాను.
కానీ నేను పాతాళ ద్వారాలగుండా వెళ్లాల్సిన సమయం అది. ఇప్పుడు నేను నా సమయమంతా అక్కడే గడపాలి.
11కనుక నేను చెప్పాను: “సజీవుల దేశంలో ప్రభువైన యెహోవాను నేను మరల చూడను.
భూమిమీద మనుష్యులు జీవించుట నేను మరల చూడను.
12నా ఇల్లు, నా గొర్రెల కాపరి గుడారం లాగివేయబడి నానుండి తీసివేయబడుతుంది.
మగ్గమునుండి ఒకడు బట్టను చుట్టి కత్తిరించినట్టు నా పని అయిపోయింది.
ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొనివచ్చావు.
13రాత్రి అంతా నేను సింహంలా గట్టిగా అరిచాను.
అయితే సింహం ఎముకలు నమిలినట్టు నా ఆశలు అణగ ద్రొక్కబడ్డాయి.
ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చావు.
14నేను గువ్వలా మూల్గాను.
నేను పక్షిలా ఏడ్చాను.
నా కళ్లు క్షీణించాయి
కానీ నేను ఆకాశం తట్టు చూస్తూనే ఉన్నాను.
నా ప్రభువా, నాకు కష్టాలు ఉన్నాయి.
నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుము.”
15నేనేం చెప్పగలను?
జరిగేదేమిటో నా ప్రభువు నాకు చెప్పాడు.
నా యజమాని దానిని జరిగిస్తాడు.
నా ఆత్మలో నాకు ఈ కష్టాలు కలిగాయి.
కనుక ఇప్పుడు నేను జీవితాంతం దీనుడనుగా ఉంటాను.
16నా ప్రభూ, నా ఆత్మ మరల జీవించేట్టుగా ఈ కష్ట సమయాన్ని ఉపయోగించు
నా ఆత్మ బలపడి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేయుము.
నేను బాగుపడేందుకు సహాయం చేయి.
మరల జీవించేందుకు నాకు సహాయం చేయుము.
17చూడండి, నా కష్టాలు తొలగి పోయాయి.
ఇప్పుడు నాకు శాంతి ఉంది.
నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు.
నీవు నన్ను సమాధిలో మురిగి పోనివ్వలేదు.
నీవు నా పాపాలన్నీ క్షమించావు.
నీవు నా పాపాలను దూరంగా పారవేశావు.
18చచ్చినవాళ్లు నీకు స్తుతులు పాడరు.
పాతాళంలోని ప్రజలు నిన్ను స్తుతించరు.
చచ్చినవాళ్లు సహాయం కోసం నిన్ను నమ్ముకోరు. వారు భూగర్భంలోనికి వెళ్తారు, మరల ఎన్నటికీ మాట్లాడరు.
19నేడు నాలాగే బ్రతికి ఉన్న మనుష్యులే
నిన్ను స్తుతించేవారు.
నీవు నమ్మదగిన వాడవని ఒక తండ్రి తన పిల్లలతో చెప్పాలి.
20కనుక నేను అంటాను: “యెహోవా నన్ను రక్షించాడు
కనుక మా జీవిత కాలమంతా మేము యెహోవా ఆలయంలో పాటలు పాడి, వాయిద్యాలు వాయిస్తాం.”
21అప్పుడు యెషయా, “నీవు అంజూరపు పండ్లను దంచి, నీ పుండ్ల మీద వేయాలి, అప్పుడు, నీవు స్వస్థపడతావు” అని హిజ్కియాతో చెప్పాడు.
22కానీ హిజ్కియా, “నేను బాగవుతానని రుజువు చేసేందుకు యెహోవా దగ్గర్నుండి వచ్చే గురుతు ఏమిటి? నేను యెహోవా మందిరానికి వెళ్ల గలుగుతానని రుజువుచేసే సంకేతం ఏమిటి?” అని యెషయాను అడిగాడు.
Currently Selected:
యెషయా 38: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International