YouVersion Logo
Search Icon

ఎజ్రా 9

9
యూదేతరులతో మిశ్రమ వివాహాలు
1మేమీ పనులన్నీ ముగించాక ఇశ్రాయేలు నాయకులు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు: “ఎజ్రా, ఇశ్రాయేలీయులు తమ చుట్టూ వున్నవారితో తమని తాము వేరుగా నిలుపుకోలేదు. యాజకులు, లేవీయులు సైతం తమ ప్రత్యేకతను కాపాడుకోలేదు. కనాను, హిత్తీ, పెరిజ్జీ, యెబూషీ, అమ్మోను, మెయాబు, ఈజిప్టు అమోరీ జాతులవారు చేసే పాపపు పనులతో ఇశ్రాయేలీయులు చెడుగా ప్రభావితులవుతున్నారు. 2ఇశ్రాయేలీయులు మన చుట్టూ వున్న ఆయా జాతులవారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు తమ ప్రత్యేకతను నిలుపుకొని వుండవలసింది. కాని. వాళ్లు తమ చుట్టూవున్న ఇతర జాతీయులను పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు నాయకులు, ముఖ్య అధికారులు ఈ విషయంలో చెడ్డ విధానాన్ని అనుసరించారు.” 3ఈ విషయాలు విన్న నేను నా మనో దుఃఖాన్ని తెలిపేందుకు అంగీని, పైవస్తాన్ని చింపుకున్నాను. నా జుట్టు, గడ్డం పీక్కున్నాను. కలత చెంది దిగ్భ్రాంతుడనై నేను కూర్చుండి పోయాను. 4అప్పుడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే ప్రతి ఒక్కడూ భయకంపితుడయ్యాడు. చెరనుంచి తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులు దేవుని పట్ల నమ్మక ద్రోహులుగా వ్యవహారించినందుకు వాళ్లందరూ భయపడ్డారు. సాయంత్రపు బలివరకు కలతచెందిన నేను మాటలాడక అక్కడే కూర్చుండిపోయాను. అందరూ నా చుట్టూ మూగారు.
5సాయంత్రపు బలివేళ అవడంతో, నేను లేచి నిలబడ్డాను. నా అంగీ, పై వస్త్రమూ చీలికలు పేలికలైవున్నాయి. యెహోవా దేవునివైపు చేతులు చాపి ప్రార్థిస్తూ, మోకరిల్లాను. 6అప్పుడు నేనిలా ప్రార్థించాను:
“ఓ దేవా, ఎక్కువ సిగ్గుచేత, కలవరపాటుచేత నేను నీవైపు ముఖము ఎత్తలేకపోతున్నాను. మా పాపాలు, దోషాలు మా తలల ఎత్తును మీరిపోయి ఆకాశాన్ని అంటుతున్నాయి. 7మా పూర్వీకుల నాటినుంచి నేటి మా తరందాకా మేము అనేకానేక పాపాలు చేశాము. అందుకే మా రాజులూ, యాజకులూ శిక్షింపబడ్డారు. విదేశాల రాజులు మా పైన దాడి చేసి మా ప్రజలను బందీలుగా తీసుకుపోయారు. ఆ రాజులు మా సంపదను కొల్లగొట్టి, మమ్మల్ని అవమానానికి గురిచేశారు. ఈ నాటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.
8“చివరికి ఇప్పుడు, దేవా, నీవు మాపట్ల దయ చూపావు. మాలో కొద్దిమంది చెరనుంచి తప్పించుకొని ఈ పవిత్ర ప్రాంతంలో నివసించడాన్ని సాధ్యంచేశావు. ప్రభువా, నీవు మాకు కొత్త జీవితం, దాస్యములో నుంచి విముక్తి ప్రసాదించావు. 9మేము బానిసలుగా వున్నమాట నిజమే, కాని, నీవు మమ్మల్మి శాశ్వతంగా బానిసలుగా ఉండనియ్యవు. నీవు మాపట్ల దయ చూపావు. పారసీక ప్రభువులు మాపట్ల దయ చూపేలా నీవు చేశావు. నీ దేవాలయం ధ్వంసం చేయబడింది. కాని, నీవు మాకు నూతన జీవితం ప్రసాదించి, మేము నీ ఆలయాన్ని తిరిగి నిర్మించి, దాన్ని సరికొత్తదానిలా మలచగలిగే అవకాశం మాకు కల్పించావు. దేవా! యూదా, యెరూషలేములకు రక్షణగా ప్రాకారం కట్టేందుకు నీవు మాకు తోడ్పడ్డావు.
10“ఇప్పుడు దేవా, నీకు మేము చెప్పగలిగింది ఏముంది? మేము మళ్లీ నీ మాట పాటించడం మానేశాం! 11దేవా, నీవు నీ సేవకులైన నీ ప్రవక్తల ద్వారా ఆ ఆదేశాలను మాకు ఇచ్చావు. నీవు ఇలా అన్నావు, ‘మీరు స్వంతం చేసుకొని, నివసించబోయే ప్రాంతం అపవిత్రమైన భూమి. అక్కడ నివసిస్తూ వచ్చిన మనుష్యులు చేసిన చెడ్డపనుల మూలంగా అది అపవిత్రమైనది. వాళ్లు ఈ దేశంలో అన్నిచోట్లా ఇలాంటి చెడ్డపనులు చాలా చేశారు. వాళ్లు తమ పాపాలతో ఈ దేశాన్ని అపవిత్రం చేశారు. 12అందుకని, ఇశ్రాయేలీయులారా, మీ బిడ్డలు వారి బిడ్డలను పెళ్లి చేసుకోకుండా చూడండి. మీరు వాళ్లతో కలవకండి! నా ఆదేశాలను పాటించండి, వారితో శాంతి ఒప్పందం చేయకండి. అప్పుడు మీరు శక్తి కలిగి, దేశంలోని మంచి వాటిని ఆనందంగా అనుభవించగలుగుతారు. అప్పుడు మీరు ఈ దేశాన్ని నిలుపుకొని, దాన్ని మీ బిడ్డలకు సంక్రమింప జేయగలుగుతారు.’
13“మనకి వాటిల్లిన కష్టాలకు మన చెడ్డక్రియలే కారణం. మనం పాపాలు చేశాం, మన దోషాలు అనేకమైనవి. అయితే, ఓ దేవా, నీవు మమ్ముల్ని శిక్షించ వలసినంతగా శిక్షించలేదు. మేము ఘోరమైన పాపాలు ఎన్నో చేశాము. మమ్మల్ని నీవు ఇంకెంతో కఠినంగా శిక్షించియుండవలసింది. మాలో కొందర్ని దాస్యంలో సహితం తప్పించుకోనిచ్చావు. 14నీ ఆదేశాలను భంగ పరచకూడదని మేము తెలుసుకున్నాము. మేము వాళ్లను పెళ్లి చేసుకోకూడదు. వాళ్లు చేసేవి చాలా చెడ్డ పనులు. దేవా, మేమా చెడ్డవాళ్లతో పెళ్లి కొనసాగించినట్లయితే, నీవు మమ్మల్ని నాశనం చేస్తావని మాకు తెలుసు! అప్పుడిక ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కడూ ప్రాణాలతో మిగిలివుండడు.
15“యెహోవా, ఇశ్రాయేలు ప్రజల దేవా, నీవు నీతి మంతుడవై యున్నావు. మాలో కొందర్ని ప్రాణాలతో మిగిల్చావు. మా దోషం కారణంగా, మాలో ఒక్కడుకూడా నీ ముందు నిలిచేందుకు అర్హుడుకాడు.”

Currently Selected:

ఎజ్రా 9: TERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in