YouVersion Logo
Search Icon

ఎజ్రా 4

4
దేవాలయ పునర్నిర్మాణానికి విరోధులు
1-2ఆ ప్రాంతంలో నివసించే చాలామంది యూదా, బెన్యామీను జాతీయులకు విరోధులు. చెర నుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు దేవాలయం నిర్మిస్తున్నారని విన్న ఆ శత్రువులు జెరుబ్బాబెలు దగ్గరకీ, వంశ పెద్దల దగ్గరికీ వచ్చి, “నిర్మాణంలో మీకు మమ్మల్ని తోడ్పడనివ్వండి. మేమూ మీలాంటివాళ్లమే. మీ దేవుణ్ణి సహాయం నిమిత్తం మేమూ అర్థిస్తాము. అష్షూరు రాజైన ఏసర్హద్దోను మమ్మల్ని ఇక్కడికి తెచ్చినప్పట్నుంచీ మేము మీ దేవునికే బలులు సమర్పించాము” అన్నారు.
3కాని, జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలుకు చెందిన ఇతర వంశాల పెద్దలూ వాళ్లకి ఇలా సమాధానం చెప్పారు: “కుదరదు, మా దేవుని ఆలయ నిర్మాణంలో మాకు తోడ్పడే అవకాశం మీకు లేదు. యెహోవాకు ఆలయ నిర్మాణం చేసే హక్కు మాది మాత్రమే. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. ఇది పారశీక రాజు కోరేషు మాకు ఇచ్చిన ఆజ్ఞ.”
4ఈ మాటలతో వాళ్లకి కోపం వచ్చింది. దానితో వాళ్లు యూదులకు ఇబ్బందులు కలిగించ నారంభించారు. దేవాలయం నిర్మించకుండా యూదులను వాళ్లు నిరుత్సాహపరచి, నిరోధించసాగారు. 5వాళ్లు ప్రభుత్వాధికారులకు లంచాలిచ్చి, వాళ్లు యూదా ప్రజలకు వ్యతిరేకంగా పని చేసేలా చూశారు. ఆ అధికారులు యూదుల దేవాలయ నిర్మాణ పథకాలను భగ్నం చేసేందుకు నిరంతరం కృషిచేశారు. కోరెషు పారశీక రాజుగా వున్నకాలంలో దర్యావేషు పారశీక రాజు అయ్యేంత వరకూ వాళ్ల యీ ప్రయత్నం కొనసాగింది.
6యూదులను అడ్డుకొనేందుకుగాను ఆ శత్రువులు పారశీక రాజుకి లేఖలు సైతం వ్రాశారు. అహష్వేరోషు#4:6 అహష్వేరోషు సుమారు క్రీ.పూ. 485–465 సంవత్సరాల్లో పారశీక రాజు. రాజు అయిన ఏడాది వాళ్లొక లేఖ వ్రాశారు.
యెరూషలేము పునర్నిర్మాణానికి విరోధులు
7ఆ తరువాత అర్తహషస్త#4:7 అర్తహషస్త క్రీ. పూ. సుమారు 465–424 సంవత్సరాల్లో పారశీక రాజు అయిన అహష్వేరోషు కొడుకు. పారశీకానికి కొత్తగా రాజు అయిన కాలంలో, వాళ్లలో కొందరు యూదులమీద నిందారోపణలు చేస్తూ లేఖలు వ్రాశారు. అలా వ్రాసినవాళ్లు: బిష్లాము, మిత్రదాతు, టాబెయేలు, ఆ బృందానికి చెందిన ఇతరులు. వాళ్లు అర్తహషస్తకు ఆ లేఖలు అరమేయికు#4:7 అరమేయిక్ బబులోను సామ్రాజ్యంలో అధికార భాష. భాషలో, అరమేయికు లిపిలో వ్రాశారు.
8 # 4:8 8వ వచనం ఇక్కడ మూలభాష హెబ్రీనుండి అరమాయికకు మరుతుంది. అప్పుడు ప్రాంతీయాధికారి రెహూమూ, కార్యదర్శి షిమ్షయి కూడా యెరూషలేము ప్రజలకి వ్యతిరేకంగా ఒక లేఖ వ్రాసి, పారసీక రాజు అర్తహషస్తకి పంపారు. ఆ లేఖలో వాళ్లిలా వ్రాశారు.
9ప్రాంతీయాధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయీ, న్యాయమూర్తులు, టర్పెలాయేలు, పారశీకం, అర్కె, బబులోను, సూసాకి చెందిన ఏలాము మరియు ఇతర ప్రాంతాల ప్రజలమీది ముఖ్యాధికారులు, 10గొప్పవాడైన బలవంతుడైన అషురుబానిపాలు సమరియా నగరానికీ, యూఫ్రటీసు నదికి పశ్చిమ ప్రాంతాలకూ తరలించిన ప్రజల మహజరు.
11అర్తహషస్త ప్రభువుకి, యూఫ్రటీసు నదియొక్క పశ్చిమాన నివసించే తమ దాసులు చేసుకున్న విన్నపం:
12అర్తహషస్త మహారాజుగారికి, తమరు తమవద్ద నుంచి పంపివేసిన యూదులు ఇక్కడికి చేరుకున్నారు. ఆ యూదులు ఇప్పుడా నగరాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. యెరూషలేము ఒక చెడ్డ నగరం. ఆ నగర ప్రజలు ఎల్లప్పుడూ ఇతర రాజుల మీద తిరగబడుతూవచ్చారు. ఇప్పుడు యూదులు పునాదులు కట్టుదిట్టంచేసి, ప్రాకారాలు కడుతున్నారు.#4:12 ప్రాకారాలు కడుతున్నారు నగర రక్షణ చేసుకునే మార్గాల్లో యిదొకటి. యూదులు రాజుకి వ్యతిరేకంగా తిరుగుబాటు సన్నాహాలు చేస్తున్నట్లు స్ఫురింపచేయడం యీ వ్యక్తుల సంకల్పం.
13అంతేకాదు అర్తహషస్త మహాప్రభూ, యెరూషలేము నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యెరూషలేము ప్రజలు తమ వృత్తిపన్నులు చెల్లించడం నిలిపేస్తారు. తమ గౌరవార్థం డబ్బు పంపడం మానేస్తారు. వాళ్లు సుంకం పన్నులు చెల్లించడం కూడా మానేస్తారు. ఏలినవారికి ఆ సొమ్మంతా నష్టమవుతుంది.
14ప్రభువుల పట్ల మాకు బాధ్యతవుంది. తమకీ నష్టాలు వాటిల్లడం మేము చూడలేము. అందుచేతనే తమకీ విషయాలు తెలియజేసుకుంటున్నాము.
15అర్తహషస్త మహారాజా, తమకు పూర్వం రాజ్యమేలిన రాజులు వ్రాయించిన చరిత్ర పత్రాలు తమరు పరిశీలించండి. ఆ పత్రాలవల్ల యెరూషలేము ఎల్లప్పుడూ యితర రాజులకు వ్యతిరేకంగా తిరుగబడినట్లు తమకు తెలియవస్తుంది. ఇతర రాజులకూ, రాజ్యాలకూ వీళ్ల తిరుగుబాట్లు పెద్దకీడుగా పరిణమించాయి. ప్రాచీనకాలం నుంచి యీ నగరంలో అనేక తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి! యెరూషలేము నాశనం చేయబడినది సరిగ్గా అందుకే!
16అర్తహషస్త మహారాజా, ఈ నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతంమీద తమకు అదుపు తప్పిపోతుందని తమకు తెలియజేయాలని కోరుకుంటున్నాము.
17అప్పుడు అర్తహషస్త రాజు వాళ్లకి ఇలా సమాధానం ఇచ్చాడు:
ప్రాంతీయాధికారి రెహూముకి, కార్యదర్శి షిమ్షయికి, సమరియాలోను, యూఫ్రటీసు నదికి పశ్చిమాన మీతో బాటు నివసించేవారికి,
శుభాకాంక్షలు.
18మీరు మాకు పంపిన లేఖను అనువదించి మాకు వినిపించారు. 19నా వెనుకటి రాజుల పత్రాలు గాలించవలసిందిగా నేను ఆదేశించాను. ఆ పత్రాలు చదివి వినిపించారు. రాజులకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసిన సుదీర్ఘ చరిత్ర యెరూషలేముకు ఉన్నట్లు మేము కనుగొన్నాము. యెరూషలేములో తరచూ పితూరీలు, తిరుగుబాట్లు సంభవించాయి. 20యెరూషలేమునూ, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతమంతటినీ శక్తిసంపన్నులైన రాజులు పాలించారు. పన్నులు, రాజుల గౌరవార్థం కానుకలు, సుంకం పన్నులు ఆ రాజులకు చెల్లింపబడ్డాయి.
21ఇప్పుడిక మీరు చేయవలసినది, వాళ్లని పని నిలిపివేయవలసినదిగా ఆజ్ఞ జారీ చేయడం. యెరూషలేము పునర్నిర్మాణం జరగకుండా మీరా ఆజ్ఞ ఇవ్వాలని నా ఆదేశం. 22ఈ వ్యవహారంలో అశ్రద్ధ జరగకుండా మీరు జాగ్రత్తవహించాలి. మనం యెరూషలేము పునర్నిర్మాణాన్ని కొనసాగనివ్వరాదు. అదే జరిగితే మాకింక యెరూషలేమునుంచి ఎంత మాత్రమూ డబ్బు ముట్టదు.
23అర్తహషస్త రాజు పంపిన ఈ లేఖ నకలు రెహూముకీ, కార్యదర్శి షిమ్షయికీ, వాళ్లతోవున్న ఇతర ప్రజలకు అందింది. దాన్ని చదివిన మీదట వాళ్లు వెంటనే యెరూషలేములోని యూదుల వద్దకు వెళ్లారు. ఆ యూదుల చేత నిర్మాణపు పనిని వాళ్లు బలవంతాన నిలిపివేయించారు.
దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోవుట
24దానితో, యెరూషలేములోని యెహోవా దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోయింది.#4:24 దేవాలయ … నిలిచిపోయింది అహష్వేరోషు కాలంలో దేవాలయ నిర్మాణం కృషి నిలిపివేయబడిన ఘటనకి యిది ప్రస్తావన. అంతేగాని, అర్తహషస్త కాలంలో నగర ప్రాకారాల నిర్మాణ కృషి నిలిపివేయబడిన దానికి కాదు ప్రస్తావన. పారసీక రాజు దర్యావేషు పాలన రెండవ సంవత్సరం#4:24 దర్యావేషు … రెండవ సంవత్సరం క్రీ.పూ. 520. దాకా తిరిగి ఈ నిర్మాణ కృషి కొనసాగలేదు.

Currently Selected:

ఎజ్రా 4: TERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in