యెహెజ్కేలు 40
40
నూతన ఆలయం
1మేము బందీలుగా ఉన్న తరువాత ఇరవై ఐదవ సంవత్సరం ఆదిలో ఆ నెల (అక్టోబరు), పదవ రోజున యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. అంటే ఇది ఆ రోజుకు బబులోను (బాబిలోనియా) వారు యెరూషలేమును వశపర్చుకున్న తరువాత పద్నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఒక దర్శనంలో యెహోవా నన్నక్కడికి తీసికొని వెళ్లాడు.
2ఒక దర్శనంలో దేవుడు నన్ను ఇశ్రాయేలు రాజ్యానికి తీసుకొని వెళ్లాడు. చాలా ఎత్తయిన ఒక పర్వతం దగ్గర ఆయన నన్ను దించాడు. ఆ పర్వతం మీద ఒక నగరంలా కన్పించే ఒక దివ్య భవంతి ఉంది. ఆ నగరం దక్షిణ దిశగా ఉంది. 3యెహోవా నన్నక్కడికి తీసుకొని వచ్చాడు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. మెరుగుదిద్దిన కంచులా అతడు మెరుస్తున్నాడు. ఆ మనిషి చేతిలో గుడ్డతో చేసిన కొలతతాడు#40:3 కొలతతాడు స్థలాలను కొలిచే తాడు లేక దారం అని పాఠాంతరం. మరియు కొలతబద్ద ఉన్నాయి. అతడు ద్వారం వద్ద నిలబడ్డాడు. 4ఆ మనిషి నాతో అన్నాడు, “నరపుత్రుడా నీ కళ్లను, చెవులను శ్రద్ధగా ఉపయోగించు. ఈ వస్తువులను చూడు. నేను చెప్పేది విను. నేను చూపించే ప్రతిదాని పట్ల నీవు శ్రద్ధ వహించు. ఎందుకనగా నేను ఇవన్నీ నీకు చూపించే నిమిత్తమే నీవిక్కడకు తేబడ్డావు. నీవు చూసినదంతా ఇశ్రాయేలు వంశం వారికి చెప్పాలి.”
5ఆలయ ఆవరణ చుట్టూ నేనొక గోడ చూశాను. ఆ మనిషి చేతిలో కొలత బద్ద ఉంది. దాని పొడవు ఆరు మూరలు. ఆ మనిషి గోడ యొక్క మందాన్ని కొలిచాడు. దాని మందం పది అడుగుల ఆరంగుళాలు. తరువాత అతడు గోడ ఎత్తు కొలవగా అది పది అడుగుల ఆరంగుళాలు ఉంది.
6పిమ్మట ఆ మనిషి తూర్పు ద్వారం వద్దకు వెళ్లాడు. అక్కడ దాని మెట్లెక్కి ద్వారపు గడప వెడల్పు కొలవగా అది పది అడుగుల ఆరంగుళాలు ఉంది. మరియొక గడప వెడల్పు కూడ పది అడుగుల ఆరంగుళాలే ఉంది. 7అక్కడ ఒక గది ఉంది. దాని పొడవు, వెడల్పులు ఒక్కొక్కటి పది అడుగుల ఆరంగుళాలు. గదుల మధ్య ఖాళీస్థలం ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళాలు ఉంది. లోపలి వైపుకు తిరిగి ఉన్న ముఖ మండపం దిశలో ఉన్న ద్వారం యొక్క గడప వెడల్పు పది అడుగుల ఆరంగుళాలు. 8ఆలయానికి ప్రక్కనున్న ద్వార ముఖ మంటపాన్ని ఆ మనిషి కొలిచాడు. దాని వెడల్పు పది అడుగుల ఆరంగుళాలు. 9పిమ్మట అతడు ద్వార మండపాన్ని కొలవగా అది ఎనిమిది మూరలున్నది. ద్వారపు రెండు ప్రక్కలనున్న గోడను కొలిచాడు. ఒక్కొక్క ప్రక్క రెండు మూరల మందం ఉంది. ముఖ మంటపం ద్వారానికి చివర కోవెలదిశగా ఉంది. మండప ద్వారం లోపలి వైపున ఉంది. 10ద్వారానికి ఇరు వైపుల మూడేసి చిన్న గదులున్నాయి. ఈ మూడు చిన్న గదుల నాలుగు ప్రక్కల గోడలూ ఒకే కొలతలో ఉన్నాయి. ద్వారపు కమ్మెలు రెండు ప్రక్కలా ఒకే కొలతలో ఉన్నాయి. 11ద్వారపు ప్రవేశ మార్గం పది మూరల వెడల్పు, పదమూడు మూరల నిడివి కలిగి ఉంది. 12ప్రతి గది ముందు ఒక లోతైన గోడ ఉంది. ఆ గోడ ఎత్తు ఆరు మూరలు. దాని మందం ఆరు మూరలు. గదులు చతురస్రాకారంలో ఉన్నాయి. ప్రతి గోడ ఆరు మూరలపొడుగు కలది.
13ఆ మనిషి ద్వారపు కొలతలను ఒక గది పైకప్పునుండి ఎదురుగానున్న మరి యొక గది పైకప్పు వరకు కొలిచాడు. అది ఇరవై ఐదు మూరలుంది. 14అతడు ప్రక్కనున్న గోడల ముందు భాగంతో బాటు, మంటపం ముందున్న ప్రక్క గోడలతో సహా కొలిచాడు. దాని పొడవు మొత్తం అరవై మూరలు. దాని వెడల్పు ముప్పయి అడుగులు. మండపం చుట్టూ ఆవరణ ఉంది. 15మండపం బయటి ద్వారం నుండి లోపలి ద్వారం వరకు ఏభై మూరలు ఉన్నాయి. 16కాపలా గదులకు పైన, ప్రక్క గోడల పైన, మంటపం మీద చిన్న కిటికీలు ఉన్నాయి. ఆ కిటికీల పెద్ద భాగాలు ద్వారాన్ని చూస్తున్నాయి. ద్వారానికి ఇరువైపుల ఉన్న గోడల మీద ఖర్జూరచెట్లు చెక్కబడి ఉన్నాయి.
బయటి ప్రాంగణం
17పిమ్మట ఆ మనుష్యుడు నన్ను బయటి ఆవరణలోకి తీసుకొని వచ్చాడు. అక్కడ గదులు, బాటలు రాళ్ళతో చేయబడ్డ వాటిని చూశాను. గోడలనానుకొని ఉన్న ఆ గదులు బాటకు ఎదురుగా ఉన్నాయి. అవి ఆవరణ చుట్టూ ఉన్నాయి. ముందు భాగంలో చదును చేసిన బాట మీద ముప్పయి గదులున్నాయి. 18ద్వారం ఎంత పొడవుగా ఉందో చదును బాట కూడ అంత పొడవుంది. ఆ దారి ద్వారపు లోపలికొస వరకు చేరివుంది. ఇది దిగువ చదునుబాట. 19పిమ్మట ఆ మనుష్యుడు క్రింది ద్వారం నుండి లోపలి ఆవరణ వరకు గల దూరాన్ని కొలిచాడు. అది తూర్పున, ఉత్తరాన నూరు మూరలు ఉంది.
20ఉత్తర దిశకు ఉన్న వెలుపలి ఆవరణ ద్వారం యొక్క పొడవు వెడల్పులను ఆ మనిషి కొలిచాడు. 21ఈ ద్వారం దాని రెండు ప్రక్కల ఉండే మూడేసి గదులు దాని ఆవరణ, మొదటి ద్వారం ప్రక్కనే ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు ఉంది. 22దాని కిటికీలు, దాని మండపం, ఖర్జూరపు చెట్ల చెక్కడాలు, తూర్పు ద్వారపు కొలతల పనితనం వలెనే ఉన్నాయి. ద్వారం వరకు ఏడు మెట్లున్నాయి. ద్వార మండపం లోపలికి ఉంది. 23లోపలి ఆవరణలో అడ్డంగా ఉత్తర ద్వారానికి ఎదురుగా ఒక ద్వారం ఉంది. అది తూర్పు ద్వారం వలెనే ఉంది. ఆ మనిషి ఈ లోపలి ద్వారం నుంచి ఆ వెలుపలి ద్వారం వరకు కొలవగా అది ద్వార ద్వారానికి నూరు మూరల వెడల్పు ఉంది.
24పిమ్మట ఆ మనిషి నన్ను దక్షిణానికి తీసుకొని వెళ్లాడు. అక్కడ నేను దక్షిణ ద్వారం చూశాను. అతడు ద్వారపు కమ్మీలను, మండపాన్ని కొలిచాడు. ఈ కొలతలు ఇతర ద్వారాల కొలతల మాదిరిగానే ఉన్నాయి. 25ద్వారానికి, మండపానికి చుట్టూ మిగతా వాటి మాదిరే కిటికీలున్నాయి. ద్వారం ఏభై మూరల పొడవు, ఇరవై ఐదు మూరల వెడల్పు ఉంది. 26ద్వారం వరకు ఏడు మెట్లున్నాయి. దాని మండప ద్వారం లోపల చివర వరకూ ఉంది. ద్వారానికి అటూ ఇటూ ఖర్జూరపు చెట్ల చెక్కడపు పనితనం ఉంది. 27లోపలి ఆవరణ యొక్క దక్షిణ దిశన ఒక గుమ్మం ఉంది. ఒక ద్వారానికి, మరొక ద్వారానికి మధ్య దూరాన్ని ఆ మనిషి కొలిచాడు. దాని వెడల్పు నూట డెబ్బై ఐదు అడుగులు.
లోపలి ఆవరణం
28తరువాత నన్నతడు దక్షిణ ద్వారం గుండా లోపలి ఆవరణలోకి తీసుకొని వచ్చాడు. ఇతర గుమ్మాల మాదిరిగానే దక్షిణ ద్వారం కొలతలు కూడ ఉన్నాయి. 29దక్షిణ ద్వారపు గదులు, దాని ద్వారపు కమ్మీలు, దాని మండపం కొలతలు కూడ ఇతర గుమ్మాల కొలతలవలెనే ఉన్నాయి. ద్వారానికి, మండపానికి చుట్టూ కిటికీలున్నాయి. ద్వారం పొడవు ఏభై మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు ఉన్నాయి. లోపలి ఆవరణ చుట్టూ మండపాలున్నాయి. 30మండపం పొడవు ఇరవై ఐదు మూరలు, వెడల్పు ఐదు మూరలు కలిగి ఉంది. 31మరియు దాని మండప ద్వారం వెలుపలి ఆవరణ తరువాత ఉంది. దాని ద్వారానికి ఇరు ప్రక్కలనున్న గోడల మీద ఖర్జూరపు చెట్ల చెక్కడపు పనితనం ఉంది. దానిని ఎక్కటానికి ఎనిమిది మెట్లున్నాయి.
32ఆ మనిషి నన్ను తూర్పు దిశన ఉన్న లోపలి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. అతడు గుమ్మాన్ని కొలిచాడు. అది ఇతర గుమ్మాల మాదిరే కొలతలు కలిగిఉంది. 33తూర్పు ద్వారపు గదులు, ప్రక్కగోడలు, మండపం ఇతర ద్వారాల మాదిరే కొలతలు కలిగి ఉన్నాయి. ద్వారానికి, మండపానికి చుట్టూ కిటికీలున్నాయి. ద్వారం పొడవు ఏభై మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు కలిగి ఉంది. 34దాని మండపం ద్వారానికి చివర వెలుపలి ఆవరణ వైపుకు ఉంది. దాని ఇరు ప్రక్కల ఉన్న గోడల మీద ఖర్జూరపు చెట్లు చెక్కబడి ఉన్నాయి. దానికి ఎనిమిది మెట్లున్నాయి.
35పిమ్మట ఆ మనిషి నన్ను ఉత్తర ద్వారం వద్దకు తీసుకొని వచ్చాడు. అతడు దానిని కొలిచాడు. దీని కొలతలు కూడా ఇతర ద్వారాలవలె ఉన్నాయి. 36ఇతర ద్వారాల, గదుల, మండపాల కొలతల మేరకే అది కూడా ఉంది. ద్వారం మరియు మండపం చుట్టూ కిటికీలున్నాయి. అది యాభై మూరల పొడవు, ఇరవై ఐదు మూరలు వెడల్పు కలిగి ఉంది. 37దాని మండపం ద్వారానికి చివర వెలుపలి ఆవరణ వైపున ఉంది. ఆ రెండు గొడల మీద ఖర్జూరపు చెట్లు చెక్కబడ్డాయి. దానికి ఎనిమిది మెట్లున్నాయి.
బలులను సిద్ధపరిచే గదులు
38ద్వారం వద్ద తలుపువున్న ఒక గది మండపానికి చేరువగా ఉంది. యాజకులు దహన బలులు ఇవ్వటానికి బలి పశువులను కడిగే చోటు ఇదే. 39ద్వార మండపంలో ప్రతి ప్రక్క రెండు బల్లలున్నాయి. అపరాధ పరిహారార్థ బలులు ఇవ్వటానికి తగిన జంతువులను ఈ బల్లల మీదనే వధిస్తారు. 40మరియు ద్వార మండపానికి అవతలి ప్రక్కన కూడా రెండు బల్లలున్నాయి. 41గోడల లోపల నాలుగు బల్లలున్నాయి. గోడల బయట నాలుగు బల్లలున్నాయి. మొత్తం అక్కడ ఎనిమిది బల్లలున్నాయి. ఈ బల్లల మీదనే యాజకులు బలి పశువులను వధిస్తారు. 42దహన బలుల నిమిత్తం నాలుగు చెక్కిన రాతి బల్లలు ఉన్నాయి. ఈ బల్లలు ఒక్కొక్కటి రెండడుగుల ఏడున్నర అంగుళాల పొడవు; రెండడుగుల ఏడున్నర అంగుళాల వెడల్పు; ఒక అడుగు తొమ్మిది అంగుళాల ఎత్తు కలిగి ఉన్నాయి. దహన బలులకు, ఇతర బలులకు వినియోగించే జంతువులను చంపటానికి తగిన పనిముట్లను యాజకులు ఈ బల్లల మీదనే ఉంచుతారు. 43మూడంగుళాల మాంసపు కొక్కెములు ఆలయమంతటా ఉంచ బడ్డాయి. అర్పణకు ప్రత్యేకించిన మాంసాన్ని బల్లల మీద ఉంచుతారు.
యాజకుల గదులు
44లోపలి ఆవరణలోకి వెళ్లే ద్వారం బయట రెండు గదులున్నాయి. ఒకటి ఉత్తర ద్వారం వద్ద ఉంది. అది దక్షిణానికి చూస్తూ ఉంది. రెండవ గది దక్షిణ ద్వారం వద్ద ఉంది. అది ఉత్తరానికి చూస్తూంది. 45ఆ మనిషి నాతో ఇలా అన్నాడు: “దక్షిణానికి చూసే ఈ గది దేవాలయ సేవలో ఉంటూ పనిమీద ఉన్న యాజకులు ఉండటానికి ప్రత్యేకించబడింది. 46కాని ఉత్తరానికి చూస్తూవున్న గదిని విధులకు వచ్చి బలిపీఠం వద్ద పనిచేసే యాజకులు ఉండటానికి ఇవ్వబడింది. ఈ యాజకులంతా సాదోకు సంతతివారు. లేవీయులలో సాదోకు సంతతివారు మాత్రమే యెహోవాకు బలులు తెచ్చి సేవచేయటానికి అర్హులు.”
47ఆ మనుష్యుడు లోపలి ఆవరణను కొలవగా అది ఖచ్చితమైన సమ చదరంగా ఉంది. దాని పొడవు, వెడల్పులు ప్రతి ఒక్కటి నూట డెబ్బై ఐదు అడుగులు ఉంది. బలిపీఠం ఆలయానికి ముందున్నది.
ఆలయ మండపం
48ఆ మనుష్యుడు నన్ను ఆలయ మండపానికి తీసుకొనివచ్చాడు. అతడు మండపం యొక్క రెండు ప్రక్కలనున్న గోడలను కొలిచాడు. ప్రతి ప్రక్క గోడలు ఐదు మూరల దళం, మూడు మూరల వెడల్పు కలిగి ఉన్నాయి. వాటి మధ్య పద్నాలుగు మూరల స్ధలం ఉంది. 49మండపం పొడవు పన్నెండు మూరలు, వెడల్పు ఇరవై మూరలు, మండపం చేరటానికి పది మెట్లు ఉన్నాయి. గోడలకు ప్రక్కగా అటు ఒకటి, ఇటు ఒకటి రెండు స్తంభాలున్నాయి.
Currently Selected:
యెహెజ్కేలు 40: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International