యెహెజ్కేలు 31
31
దేవదారు వృక్షంవంటి అష్షూరు
1చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం మూడవ నెల మొదటి రోజున యెహోవా మాట నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 2“నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోకు మరియు అతని ప్రజలకు ఈ విషయాలు తెలియజేయుము,
“‘గొప్పతనంలో
నీవు ఎవరిలా ఉన్నావు?
3మిక్కిలి ఉన్నతంగా పెరిగి తన అందమైన కొమ్మలతో దట్టమైన నీడనిస్తూ
లెబానోనులో పెరిగిన కేదారు వృక్షం అష్షూరు రాజ్యమే.
దాని తల మేఘాల్లో ఉంది!
4మంచి నీటివనరు చెట్టును బాగా పెరిగేలా చేసింది.
లోతైన నది అది ఎత్తుగా పెరగటానికి దోహదమిచ్చింది.
చెట్టు నాటబడిన ప్రాంతంలో నదులు ప్రవహించాయి.
దాని కాలువలే అక్కడి పొలాల్లో ఉన్న చెట్లకు నీటిని అందజేశాయి
5ఆ వృక్షం అలా మిగిలిన చెట్లన్నిటిలో పొడవుగా పెరిగింది.
దానికి ఎన్నో కొమ్మలు పెరిగాయి.
నీరు పుష్కలంగా ఉంది.
అందువల్ల దాని కొమ్మలు విస్తరించాయి.
6కావున పక్షులన్నీ దాని
కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి.
ఆ ప్రాంతంలో జంతువులన్నీ దాని
చల్లని నీడలో తమ పిల్లల్ని పెట్టాయి.
గొప్ప రాజ్యాలన్నీ
ఆ చెట్టు నీడలో నివసించాయి!
7ఆ విధంగా ఆ చెట్టు తన గొప్పతనంలోను,
తన పొడవైన కొమ్మలతోను,
ఎంతో ఆందంగా కన్పించింది.
ఎందువల్ల ననగా దానివేళ్ళు నీరు బాగా అందేవరకు నాటుకున్నాయి!
8దేవుని ఉద్యానవనంలో ఉన్న కేదారు వృక్షాలు
కూడా ఈ చెట్టంత పెద్దగా లేవు.
దీనికి ఉన్నన్ని కొమ్మలు సరళ వృక్షాలకు కూడా లేవు.
అక్షోట (మేడి) చెట్లకు అసలిటువంటి కొమ్మలే లేవు.
దేవుని ఉద్యానవనంలో
ఇంత అందమైన చెట్టేలేదు.
9అనేకమైన కొమ్మలతో
ఈ చెట్టును నేను అందమైనదిగా చేశాను.
ఏదెనులో దేవుని ఉద్యానవనంలో ఉన్న చెట్లన్నీ
దీనిపట్ల అసూయ చెందాయి!’”
10కావున నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఈ చెట్టు విస్తరించి పొడవుగా పెరిగింది. దాని తలని మబ్బుల్లో పెట్టుకుంది. దాని ఎత్తు చూసుకొని అది గర్వపడింది. 11అందువల్ల ఒక పరాక్రమశాలియగు రాజు ఆ చెట్టును ఉంచుకొనేలా చేస్తాను. అది చేసిన చెడ్డ పనులకు ఆ పాలకుడు దానిని శిక్షిస్తాడు. అతని చెడు తనంవల్ల నేను ఆ చెట్టును నాతోటనుండి తీసుకొంటిని. 12దేశాలన్నిటిలో క్రొత్తవాళ్లు, చాలా క్రూరులయిన వాళ్లు దానిని నరికి పడవేశారు. ఆ చెట్టు కొమ్మలు కొండల మీదను, లోయలలోను చెల్లా చెదరుగా పడవేశారు. ఆ దేశం గుండా ప్రవహించే నదులలో విరిగిన కొమ్మలు కొట్టుకు పోయాయి. ఆ చెట్టు క్రింద నీడ ఇక ఏ మాత్రం లేకపోవటంతో వివిధ దేశాల ప్రజలంతా దానిని వదిలిపెట్టారు. 13ఇప్పుడు పక్షులు పడిపోయిన ఆ చెట్టు మీదే నివసిస్తాయి. దాని పడిపోయిన కొమ్మలమీద ఆడవి జంతువులన్నీ నడుస్తాయి.
14“ఆ నీటి ప్రక్కనున్న ఏ చెట్టూ ఇక మీదట గర్వపడదు. అవి ఆకాశాన్నంటుకోవాలని తాపత్రయ పడవు. ఆ నీరును పీల్చే బలమైన చెట్లలో ఏ ఒక్కటీ పొడవుగా ఉన్నానని గొప్పలు చెప్పుకోదు. ఎందువల్లనంటే అవన్నీ చనిపోవటం ఖాయం. అవన్నీ పాతాళ లోకంలోకి పోతాయి. అవి (వారు) మృతి చెందిన వారితో పాతాళంలో కలవటం తధ్యం.”
15నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఆ చెట్టు పాతాళానికి వెళ్లిన రోజున ప్రజలంతా సంతాపం పొందేలా చేశాను. అగాధమైన సముద్రంలో దాన్ని కప్పివేశాను. దాని నదులన్నిటినీ నిలుపు జేశాను. నీరంతా ప్రవహించటం ఆగిపోయింది. లెబానోను దాని కొరకు దుఃఖించేలా చేశాను. ఆ మహావృక్షం కొరకు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ విచారంతో క్రుంగిపోయాయి. 16ఆ చెట్టు పడిపోయేలా నేను చేశాను. అది పతనమయినప్పుడు వచ్చిన శబ్దంతో దేశాలు భయంతో వణికిపోయాయి. ఆ వృక్షం మృతుల స్థానానికి వెళ్లేలా చేశాను. అది మృతులతో కలిసి ఉండటానికి పాతాళానికి చేరింది. గతంలో ఏదెనులో ఉన్న అన్ని చెట్లు, లెబానోనులో ఉన్న శ్రేష్ఠమైన చెట్లు ఆ నీటిని పీల్చాయి. ఆ చెట్లు పాతాళ లోకంలో ఓదార్చబడ్డాయి. 17అవును. మృతుల స్థానానికి మహా వృక్షంతో పాటు మిగిలిన చెట్లు కూడ పోయాయి. యుద్ధంలో హతులైన ప్రజలను అవి కలిశాయి. ఆ మహా వృక్షం మిగిలిన చెట్లను బలపర్చింది. దేశాల మధ్య ఆ మహా వృక్షం యొక్క నీడలో ఆ చెట్లు నివసించాయి.
18“కావున ఈజిప్టూ, ఏదెనులో నిన్ను ఏ చెట్టుతో పోల్చను? ఆ చెట్లన్నీ పెద్దవీ, బలిష్ఠమయినవీ. ఏదెనులోని చెట్లతో పాటు నీవు అధోలోకానికి పోతావు. విదేశీయులతోను#31:18 విదేశీయులు అక్షరాల సున్నతి సంస్కారంలేని జనులు. యుద్ధంలో మరణించిన వారితోను కలిసి నీవు మృత్యుస్థానంలో పడివుంటావు.
“ఫరోకు మరియు అతని ప్రజలందరికీ ఇది సంభవిస్తుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
Currently Selected:
యెహెజ్కేలు 31: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International