యెహెజ్కేలు 12
12
యెహెజ్కేలు బంధీగా వదలుట
1తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 2“నరపుత్రుడా, నీవు తిరుగుబాటుదారుల మధ్య వున్నావు. వారు ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా వుంటున్నారు. నేను వారి కొరకు చేసిన పనులను చూడటానికి వారికి కళ్ళున్నాయి. అయినా వాటినివారు చూడలేరు. వారిని నేను చేయమని చెప్పిన విషయాలను వినటానికి వారికి చెవులున్నాయి. అయినా వారు నా ఆజ్ఞలను వినరు. ఎందువల్లనంటే వారు తిరుగుబాటుదారులు. 3కావున, నరపుత్రుడా, నీ సామాన్లు సర్దుకో. నీవొక సుదూర దేశానికి పోతున్నట్లు నటించు. ప్రజలిదంతా చూసేలా నీవు చేయాలి. బహుశః వారు నిన్ను చూడవచ్చు. కాని వారు మిక్కిలి తిరుగుబాటుదారులు.
4“ప్రజలు నిన్ను చూసే విధంగా నీ సామాన్లు పగటిపూట బయటకు తీసుకొని వెళ్ళు. మళ్లీ సాయంత్రం నీవొక బందీవలె దూరదేశానికి వెళ్తున్నట్లు ప్రవర్తించు. 5మళ్లీ ఆ జనులు గమనిస్తూ వుండగా గోడకు కన్నం పెట్టి, దాని గుండా నీవు బయటికి వెళ్లు. 6రాత్రిపూట నీ సామాను సంచి భుజం మీద వేసుకొని బయలుదేరు. నీవు ఎక్కడికి వెళ్ళుతున్నావో నీకే తెలియని విధంగా నీ ముఖాన్ని కప్పుకోవాలి. జనులు నిన్ను గమనించేందుకు నీవీ పనులు చేయాలి. ఎందువల్లనంటే ఇశ్రాయేలు వంశానికి ఒక ఆదర్శంగా నేను నిన్ను వినియోగించుకుంటున్నాను!”
7కావున నేను (యెహెజ్కేలు) యెహోవా ఆజ్ఞ ప్రకారం చేశాను. పగటివేళ నా సంచులు తీసుకొని నేనొక దూరదేశానికి వెళ్లి పోతున్నట్లు నటించాను. ఆ సాయంత్రం నా చేతులతో గోడకు కన్నం వేశాను. రాత్రివేళ నా సంచి చంకకు తగిలించుకొని బయలు దేరాను. ఈ పనులన్నీ ప్రజలు గమనించే విధంగా చేశాను.
8మరునాటి ఉదయం యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 9“నరపుత్రుడా, ఇశ్రాయేలీయులైన ఆ తిరుగుబాటుదారులు నీవు ఏమి చేస్తున్నావని నిన్ను అడిగారా? 10వారి ప్రభువగు యెహోవా ఈ విషయాలు చెప్పాడని తెలియజేయి. ఈ విషాద సమాచారం యెరూషలేము నాయకునకు (పాలకుడు), అక్కడ నివసిస్తున్న ఇశ్రాయేలీయులందరికీ సంబంధించినది. 11‘మీ అందరికీ నేను (యెహెజ్కేలు) ఒక ఆదర్శం అనీ, నేను చేసి చూపించినవి మీకు తప్పక జరుగుతాయని’ చెప్పుము. మీరు తప్పక దూరదేశాలకు బలవంతాన బందీలుగా తీసుకొని పోబడతారు. 12మీ నాయకుడు (పాలకుడు) రాత్రి పూట గోడకు కన్నం వేసి దొంగచాటుగా బయటకు పారిపోతాడు. ప్రజలతనిని గుర్తు పట్టకుండా, అతడు తన ముఖాన్ని కప్పుకుంటాడు. అతడెక్కడికి వెళ్ళుచున్నాడో అతని కన్నులు చూడలేవు. 13అతడు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాడు. కాని నేను (దేవుడు) అతనిని పట్టుకుంటాను! అతడు నా వలలో చిక్కుకుంటాడు. నేనతనిని కల్దీయుల రాజ్యమైన బబులోను (బాబిలోనియా)కు తీసుకొని వస్తాను. కాని అతడు మాత్రం తనెక్కడికి పోతున్నాడో చూడలేడు. శత్రువు అతని కన్నులను పీకి గుడ్డివాణ్ణి చేస్తాడు అప్పుడు అక్కడ అతడు చనిపొతాడు. 14రాజ వంశీయులను ఇశ్రాయేలు చుట్టూ ఉన్న అన్యదేశాలలో నివసించేలా వారిని ఒత్తిడి చేస్తాను. అతని సైన్యాన్ని చెల్లా చెదురు చేస్తాను. శత్రు సైన్యాలు వారిని తరిమి కొడతాయి. 15అప్పుడా ప్రజలు నేను యెహోవాను అని తెలుసుకొంటారు. నేనే వారిని అన్యదేశాలలో విసిరి వేశానని తెలుసుకొంటారు. ఇతర దేశాలకు పోయేలా వారిని నేనే ఒత్తిడి చేశానని తెలుసుకొంటారు.
16“కాని కొద్దిమంది ప్రజలను మాత్రం బ్రతక నిస్తాను. రోగాలవల్ల గాని, ఆకలిచేత గాని లేక యుద్ధం వల్ల గాని వారు చనిపోరు. వారు నాపట్ల చేసిన భయంకర నేరాలను గురించి ఇతర ప్రజలకు తెలియజెప్పటానికిగాను వారిని నేను బ్రతకనిస్తాను. పిమ్మట వారు నేను యెహోవానని తెలుసుకొంటారు.”
భయంతో వణకుట
17ఆ పిమ్మట మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 18“నరపుత్రుడా, నీవు చాలా భయపడినవానిలా వ్యవహరించాలి. నీవు ఆహారం తీసుకొనే సమయంలో వణకాలి. నీవు నీరుతాగేటప్పుడు వ్యాకుల పడుతున్నట్లు, భయపడుతున్నట్లు ప్రవర్తించాలి. 19ఈ విషయాలు నీవు సామాన్య ప్రజలకు తెలియజెప్పాలి. నీవు ఇలా అనాలి: ‘యెరూషలేము ప్రజలకు, ఇశ్రాయేలులో ఇతర ప్రాంతాల ప్రజలకు మన ప్రభువైన యెహోవా చేపుతున్నాడు, మీరు మీ ఆహారం తీసుకొనేటప్పుడు మిక్కిలి కలత చెందుతారు. మీరు నీరు తాగేటప్పుడు. భయకంపితులవుతారు. ఎందువల్లనంటే, మీ దేశంలో అన్ని వస్తువులూ సర్వనాశనం చేయబడతాయి! అక్కడ నివసిస్తున్న ప్రజలందరి పట్ల శత్రువు చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు. 20మీ నగరాలలో చాలా మంది ప్రజలు నివసిస్తున్నారు. కాని ఆ నగరాలన్నీ నాశనం చేయబడతాయి. మీ దేశం యావత్తూ నాశనం చేయబడుతుంది! అప్పుడు నేనే యెహోవానని మీరు గుర్తిస్తారు.’”
నాశనం వస్తుంది
21యెహోవా వాక్కు నాకు మరల వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 22“నరపుత్రుడా, ఇశ్రాయేలును గురించి ఎందుకు ఈ పాట పాడుకుంటారు?
‘ఆపద త్వరలో రాదు,
దర్శనాలు నిజం కావు.’
23“వారి ప్రభువైన యెహోవా ఆ పాటను ఆపుచేయిస్తాడని ప్రజలకు చెప్పు. ఇశ్రాయేలును గురించి ఆ మాటలు వారిక ఎన్నడూ పలుకరు. ఇప్పుడు వారీ పాటపాడతారు.
‘ఆపద ముంచుకు వస్తూ ఉంది,
స్వప్న దర్శనాలన్నీ నిజమై తీరుతాయి.’
24“నిజానికి ఇకమీదట ఇశ్రాయేలులో అసత్య దర్శనాలు ఉండవు. నీజం కాని భవిష్యత్తును చెప్పే తాంత్రికులు మరి ఉండబోరు. 25ఎందువల్లనంటే, నేనే యెహోవాను. నేను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పి తీరుతాను. అది తప్పక జరిగి తీరుతుంది! నేను కాలయాపన చేయను. ఆ కష్టాలు త్వరలో మీ కాలంలోనే రాబోతున్నాయి. ఓ తిరుగుబాటు ప్రజలారా, నేను ఏదైనా చెప్పితే అది జరిగేలా చేస్తాను.” ఇవీ నా ప్రభువైన యెహోవా చెప్పిన మాటలు.
26మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 27“నరపుత్రుడా, నేను నీకిచ్చిన దర్శనాలు భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతాయని ఇశ్రాయేలు ప్రజలు అనుకొంటున్నారు. ఇప్పటి నుంచి చాలా సంపత్సరాల తరువాత జరుగబోయే విషయాలను గురించి నీవు మాట్లాడుతున్నావని వారనుకుంటున్నారు. 28కావున నీవు వారికి ఈ విషయాలు చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: నేనిక ఎంతమాత్రం ఆలస్యం చేయను. నేనేదైనా జరుగుతుందని చెప్పితే అది తప్పక జరిగి తీరుతుంది!’” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
Currently Selected:
యెహెజ్కేలు 12: TERV
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International