యెహెజ్కేలు 10
10
యెహోవా మహిమ దేవాలయమును వదలుట
1తరువాత నేను కెరూబు దూతల తలలపైవున్న పాత్రవైవు చూశాను. అది స్వచ్చమైన నీలపు మణిగా కనబడింది. ఆ పాత్రమీద సింహాసనం వంటిది ఒకటుంది. అక్కడ నుండి దేవుణ్ణి చూడవచ్చు. 2నారబట్టలు వేసుకున్న వ్యక్తితో దేవుడు ఇలా అన్నాడు: “నీవు కెరూబు చక్రాల మధ్య ప్రాంతంలోకి రమ్ము. కెరూబు దూతల మధ్య నుండి కొన్ని మండే నిప్పు కణికెలను తీసుకో. ఆ నిప్పును నీ చేతిలో పట్టుకొని వెళ్లి, దానిని యెరూషలేము నగరంపై విసిరివేయి.”
ఆ వ్యక్తి నా ప్రక్క నుండి వెళ్లాడు. 3ఆ వ్యక్తి మేఘంలోకి ప్రవేశించినప్పుడు ఆలయానికి దక్షిణానవున్న ప్రదేశంలో కెరూబు దూతలు నిలబడ్డారు. మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మిఉంది. 4పిమ్మట దేవుని మహిమా ప్రకాశం కెరూబు దూతల మీదినుండి పైకి లేచింది. ఆ దూతలు ఆలయం గడపమీద నిలబడి ఉన్నారు. పిమ్మట ఆలయాన్ని మేఘం నింపి వేసింది. యెహోవా తేజస్సు ఆలయ ఆవరణాన్నంతా ఆవరించింది. 5ఆ తరువాత కెరూబుల రెక్కల ధ్వని వెలుపలి ఆవరణమంతా వినబడ్డది. సర్వశక్తి మంతుడైన దేవుడు మాట్లాడినప్పుడు వచ్చే ఆ శబ్దం ఉరుములాంటి స్వరంలా గంభీరంగా ఉంది. రెక్కల చప్పుడు చాలా దూరంలో గల బయటి ఆవరణ వరకు వినవచ్చింది.
6నారబట్టలు ధరించిన వ్యక్తికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీవు కెరూబుల మద్య చక్రాల నడిమి ప్రాంతంలోకి వెళ్లి, మండే నిప్పును తీసుకొని రమ్ము. కావున ఆ వ్యక్తి ఒక చక్రం ప్రక్కగా నిలబడ్డాడు. 7కెరూబులలో ఒకరు తన చేయిచాపి వాటి మధ్యనున్న మండే నిప్పును తీశాడు. ఆ నిప్పును ఆ వ్యక్తి చేతిలో వేశాడు. దానిని తీసుకొని ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. 8(కెరూబుల రెక్కల క్రింద మానవుల చేతుల వంటివి ఉన్నాయి.)
9అక్కడ నాలుగు చక్రాలున్నట్లు నేనప్పుడు చూశాను. ప్రతి కెరూబుల ప్రక్క ఒక చక్రం చొప్పున ఉన్నాయి. చక్రాలు స్వచ్చమైన విలువైన రాయిగా కనిపించాయి. 10మొత్తం నాలుగు చక్రాలున్నాయి. అవన్నీ ఒకే రీతిగా కన్పించాయి. ఒక చక్రంలో మరి యొకటి ఉన్నట్లు అవి కన్పించాయి. 11కదిలినప్పుడు ఆ నాలుగూ ఒకేసారి ఏ దిశలోనైనా వెళ్ళగలిగినవి. కాని కెరూబులు కదలినప్పుడు అటు ఇటు తిరిగేవారు కాదు. తమ తలలు చూస్తున్న దిశలోనే వారు కదలి వెళ్లేవారు. వారు కదలినప్పుడు అటు ఇటు తిరుగలేదు. 12వారి శరీరాల నిండా కన్నులున్నాయి. వారి వీపుల మీద. చేతుల మీద, వారి రెక్కల మీద. వారి చక్రాల మీద కన్నులున్నాయి. అవును, నాలుగు చక్రాల మీద కన్నులున్నాయి! 13నేను విన్నది ఈ చక్రాలనే. వీటినే “చక్రాల మధ్యనున్న స్థలం” అంటారు.
14-15ప్రతి కెరూబుకూ నాలుగు ముఖాలున్నాయి. మొదటి ముఖం కెరూబు ముఖం.#10:14-15 కెరూబు ముఖం గిత్తదూడ ముఖం. యెహెజ్కే. 1:10 లో వివరించబడింది. యెహెజ్కే. 10:22 చూడండి. రెండవ ముఖం మనుష్య ముఖం. మూడవది సింహపు ముఖం. నాల్గవది గద్దముఖం. ఈ కెరూబు దూతలు నేను కెబారు కాలువ వద్ద దర్శనంలో చూచిన జీవులే.
పిమ్మట కెరూబు గాలిలోకి పైకి లేచారు. 16వాటితో పాటు చక్రాలు లేచాయి. కెరూబులు రెక్కలు లేపి గాలిలోకి ఎగిరినప్పుడు చక్రాలు తమ దిశను మార్చలేదు. 17కెరూబులు గాలిలోకి ఎగిరినప్పుడు చక్రాలు వారితో వెళ్లాయి. కెరూబు దూతలు నిలకడగా ఉన్నప్పుడు చక్రాలు కూడా అలానే ఉండేవి. ఎందువల్లనంటే ఆ జీవియొక్క ఆత్మ (శక్తి) అంతా చక్రాలలోనే ఉంది.
18తరువాత యోహోవా మహిమ ఆలయ గుమ్మం మీది నుండి పైకిలేచి, కెరూబుల మీదికి వచ్చి అగింది. 19అప్పుడు కెరూబులు తమ రెక్కలు విప్పి గాలిలోకి ఎగిరిపోయారు. వారు దేవాలయాన్ని వదిలి వెళ్లటం నేను చూశాను! చక్రాలు వారితో వెళ్లాయి. తరువాత వారు ఆలయపు తూర్పు ద్వారం వద్ద ఆగారు. ఇశ్రాయేలు దేవుని మహిమ గాలిలో వారిపై నిలిచింది.
20అప్పుడు నేను కెబారు కాలువవద్ద దర్శించిన ఇశ్రాయేలు దేవుని మహిమ క్రింద ఉన్న జీవులను గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ జీవులే కెరూబు దూతలని నేను తెలుసుకొన్నాను. 21ప్రతి జీవికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు మరియు మానవుల చేతులను పోలినటువంటివి వాటి రెక్కల క్రింద ఉన్నాయి. 22కెరూబుల ముఖాలు నేను కెబారు కాలువ వద్ద దర్శించిన జీవుల ముఖాల మాదిరిగానే ఉన్నాయి. అవన్నీ అవి పోయే దిక్కు వైపే తిన్నగా చూస్తూ ఉన్నాయి.
Currently Selected:
యెహెజ్కేలు 10: TERV
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International