1 సమూయేలు 3
3
దేవుడు సమూయేలును పిలుచుట
1ఆ రోజుల్లో యెహోవా ఎవరితోనూ ప్రత్యక్షంగా తరచు మాట్లాడేవాడు కాడు. స్వప్న దర్శనాలూ చాలా తక్కువే. ఏలీ పర్యవేక్షణలో బాలకుడైన సమూయేలు యెహోవా సేవలో ఉన్నాడు.
2ఏలీ కళ్లు బలిహీనమై ఇంచుమించు గుడ్డివాడైపోయాడు. ఒకరోజు అతడు పడుకుని వున్నాడు. 3సమూయేలు యెహోవా పవిత్ర గుడారంలో పడుకున్నాడు. దేవుని పవిత్ర పెట్టె#3:3 దేవుని … పెట్టె దీనిని “ఒడంబడిక పెట్టె” (మందసము) అని కూడ అంటారు. ఇశ్రాయేలీయులు సీనాయి ఎడారిలో ఉన్న రోజులనుంచి జరిగిన అనేక విషయాలు దీనిలో భద్ర పర్చబడ్డాయి. కూడా గుడారంలోనే వుంది. గుడారంలో యెహోవా దీపం ఇంకా వెలుగుతూనే వుంది. 4యెహోవా సమూయేలును పిలిచాడు. “ఇక్కడే వున్నాను” అంటూ 5(ఏలీ తనను పిలిచాడని అనుకొని) సమూయేలు ఏలీ వద్దకు పరుగున పోయాడు. “మీరు పిలిచారుగా అందుకే, వచ్చాను” అన్నాడు.
“నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.
సమూయేలు పోయి పడుకున్నాడు. 6దేవుడు మళ్లీ, “సమూయేలూ!” అని పిలిచాడు. సమూయేలు ఏలీ వద్దకు వెళ్లి, “నేనిక్కడే ఉన్నాను, నన్ను పిలిచారా?” అని అడిగాడు.
“నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.
7సమూయేలుకు ఇంకా యెహోవాతో అనుభవంలేదు. అతనితో యెహోవా ఇంతవరకూ ప్రత్యక్షంగా మాట్లాడి వుండలేదు.#3:7 మాట్లాడి వుండలేదు అంటే దేవుని వాణి సమూయేలుకు ఇంకా తెలియపర్చబడలేదు.
8మూడవసారి యెహోవా సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ వద్దకు వెళ్లి, “నేను ఇక్కడే వున్నాను; నన్ను పిలిచారా?” అని అన్నాడు.
యెహోవా ఆ బాలుని పిలుస్తున్నాడని అప్పుడు ఏలీకి అర్థమయింది. 9ఏలీ సమూయేలుతో, “నీవు పోయి పడుకో. మళ్లీ ఎవరైనా నిన్ను పిలిస్తే ‘యెహోవా, సెలవియ్యండి! నేను తమ దాసుణ్ణి. నేను వింటున్నాను’” అని చెప్పమన్నాడు.
తరువాత సమూయేలు వెళ్లి పక్కమీద పడుకున్నాడు. 10యెహోవా వచ్చి అక్కడ నిలిచాడు. “సమూయేలూ!, సమూయేలూ” అంటూ మునుపటిలా పిలిచాడు.
“చెప్పండి, నేను మీ దాసుడను. నేను వింటున్నాను” అన్నాడు సమూయేలు.
11యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “చూడు, నేను ఇశ్రాయేలులో ఒక కార్యం నిర్వహించదలిచాను. దీనిని గురించి విన్న ప్రతి ఒక్కడూ ఆశ్చర్యపోతాడు.#3:11 దీనిని … ఆశ్చర్యపోతాడు ఇది విన్న ప్రతివాని చెవులూ గింగురుమంటాయి అని శబ్దార్థం. 12నేను ఏలీకి, అతని కుటుంబానికి ఏది చేస్తానని చెప్పివున్నానో అదంతా అప్పుడు చేస్తాను. మొదటినుంచి చివరి వరకు అంతా చేసి తీరుతాను. 13తన వంశాన్ని శాశ్వతంగా శిక్షిస్తానని ఏలీతో చెప్పాను. అలా ఎందుకు చేయదలిచానంటే తన కుమారులు దైవదూషణ చేసినట్లు, అకృత్యాలకు పాల్పడినట్లు ఏలీకి తెలుసు. అయినా వారిని అదుపులో పెట్టలేక పోయాడు. 14అందువల్ల ఏలీ వంశం ఎన్ని బలులు, ధాన్యార్పణలు సమర్పించినా వారి పాపాన్ని మాపుకో లేరని నిశ్చితంగా చెప్పి ఉన్నాను.”
15తెల్లవారేవరకూ సమూయేలు పక్కమీదే ఉన్నాడు. ఆ తరువాత లేచి దేవాలయ ద్వారం తెరిచాడు. దర్శనం గూర్చి ఏలీతో చెప్పటానికి సమూయేలు భయపడ్డాడు
16కాని ఏలీ, “కుమారుడా సమూయేలూ” అని పిలిచాడు.
“ఇక్కడే ఉన్నానయ్యా” అన్నాడు సమూయేలు.
17“యెహోవా నీతో ఏమన్నాడు? నాతో ఏమీ దాచవద్దు. ఆయన నీకు చెప్పిన సమాచారంలో నీవు ఏమి దాచినా దేవుడు నిన్ను బాగా శిక్షిస్తాడు” అని అన్నాడు.
18దానితో సమూయేలు ఉన్నది వున్నట్లు ఏలీకి ఏమీ దాచకుండా చెప్పాడు.
అది విన్న ఏలీ, “ఆయన యెహోవా. ఆయనకు ఏది మంచిదనిపిస్తే అది చేయనీ” అన్నాడు.
19సమూయేలు పెరుగుతూ వుండగా యెహోవా అతనికి తోడై ఉండెను. యెహోవా సమూయేలుతో చెప్పిన వర్తమానాలను ఎన్నడూ అబద్ధం కానీయలేదు. 20అందువల్ల దానునుండి, బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు దేశమంతా సమూయేలును యెహోవా యొక్క నిజమైన ప్రవక్తగా గుర్తించింది. 21షిలోహులో యెహోవా సమూయేలుకు దర్శనమిస్తూ వచ్చాడు. మాటలోనే సమూయేలుకు యెహోవా ప్రత్యక్షమయ్యేవాడు.
Currently Selected:
1 సమూయేలు 3: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International