1 సమూయేలు 24
24
దావీదు సౌలును అవమానపరచుట
1సౌలు ఫిలిష్తీయులను తరిమివేసిన పిమ్మట, “దావీదు ఏన్గెదీ ఎడారిలో ఉంటున్నట్లు” ప్రజలు అతనికి చెప్పారు.
2కనుక సౌలు ఇశ్రాయేలు అంతటినుండీ మూడువేలమందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి, వారిని తీసుకొని వెళ్లి దావీదు కొరకు, అతని అనుచరుల కొరకు వెతకటం మొదలు పెట్టాడు. అడవి మేక బండలు అనే చోట వారు వెదికారు. 3సౌలు బాట ప క్కగావున్న గొర్రెల మంద వద్దకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలోకి కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్లాడు. ఆ గుహలోనే చాలా లోపల దావీదు, అతని మనుష్యులు దాగివున్నారు. 4సౌలును చూసి దావీదు అనుచరులు అతనితో “యెహోవా చెప్పిన రోజు ఇదే. ‘నీ శత్రువును నీకు అప్పగిస్తాను కనుక ఇప్పుడు నీ శత్రువును నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు అని యెహోవా నీతో చెప్పాడు గదా!’” అన్నారు.
అప్పుడు దావీదు మెల్లగా సౌలు వద్దకు పాకుతూ వెళ్లి, సౌలు అంగీని ఒక కొన కోసివేశాడు. సౌలు దావీదును గమనించలేదు. 5కానీ తర్వాత సౌలు అంగీని కోసివేసినందుకు దావీదు బాధపడ్డాడు. 6“నా యజమానికి నేను ఇలాంటి పని చేయకుండా యెహోవా నన్ను నివారించునుగాక! సౌలు యెహోవా నియమించిన రాజు. సౌలు యెహోవాచే అభిషేకింపబడిన రాజు గనుక సౌలుకు వ్యతిరేకంగా నేను ఏమీ చేయకూడదు” అని దావీదు తన మనుష్యులతో అన్నాడు. 7కోపోద్రేకులైన తన మనుష్యులను అదుపు చేయటానికి దావీదు ఈ మాటలు చెప్పాడు. దావీదు వారిని సౌలు మీదికి పోనియ్యలేదు.
సౌలు గుహ వదిలి తన దారిన వెళ్లిపోయాడు. 8అతని వెనుకనే దావీదు బయటికి వచ్చి, “రాజా నా ప్రభూ” అని కేక వేసాడు. సౌలు వెనుదిరిగి చూశాడు. దావీదు వంగి నమస్కరించాడు. 9“దావీదు నీకు హాని చేయ చూస్తున్నాడని ప్రజలు చెబితే నీవెందుకు ఆ మాటలు వింటున్నావు? 10యెహోవా ఈ రోజున గుహలో నిన్ను నాకు ఎలా అప్పగించాడో నీ కళ్లతో నీవే చూశావు. కానీ నిన్ను చంపటానికి నేను నిరాకరించాను. నేను నీపట్ల కనికరము చూపాను. ‘సౌలు యెహోవా చేత అభిషేకించబడిన రాజు. నా యజమానికి నేను కీడు చేయను’ అని నేననుకున్నాను. 11ఇదిగో నీ రాజవస్త్రం ముక్క నా చేతిలో ఉంది చూడు! దీనిని నీ అంగీ నుండి ఒక మూల కోశాను. నిన్ను నేను చంపగలిగి ఉండేవాడిని కానీ చంపలేదు. ఇప్పుడైనా నీవు అర్థం చేసుకో. నేను నీకు ఏ కీడూ తలపెట్టలేదు. నేను నీ ఎడల ఏ తప్పూ చేయలేదు. కాని నీవు మాత్రం నన్ను చంపే ప్రయత్నంలో వెంటాడుతున్నావు. 12యెహోవాయే న్యాయం తీర్చును గాక! నీవు నాపట్ల తలపెట్టిన కీడుకు యెహోవా నిన్ను శిక్షించవచ్చును. కాని నాకై నేను నీతో పోరాడను. 13దుష్టులనుండి దుష్టకార్యాలే వస్తాయనే ఒక పాత సామెత ఉంది.
‘కానీ నేను దుర్మార్గం ఏమీ చేయలేదు.’
“నేను దుర్మార్గుడిని కాదు. నేను నీకు హాని చేయను. 14ఇంతకూ నీవు తరుముచున్నది ఎవరిని? ఇశ్రాయేలు రాజు పోరాడేందుకు వస్తున్నది ఎవరిమీదికి? నిన్ను గాయపర్చే వారినెవరినో నీవు వెంటాడటం లేదు! ఏదో ఒక చచ్చిన కుక్కనో, లేక ఈగనో నీవు తరుము తున్నట్టుగా ఉంది. 15యెహోవాయే న్యాయమూర్తిగా ఉండి నీకూ నాకూ మధ్య న్యాయం తీర్చును గాక! యెహోవా నన్ను బలపర్చి నేను నిర్దోషినని నిరూపిస్తాడు. ఆయన నన్ను నీ బారినుండి రక్షిస్తాడు” అని రాజైన సౌలుతో దావీదు చెప్పాడు.
16దావీదు తన మాట ముగించగానే, సౌలు “దావీదూ! నా కుమారుడా, అది నీ స్వరమేనా?” అంటూ ఏడ్వటం మొదలుపెట్టాడు. సౌలు చాలా ఏడ్చాడు. 17“అవును నీవు చెప్పింది వాస్తవమే. నేనే తప్పు చేశాను. నీవు నాపట్ల చాలా మంచితనం చూపించావు. కాని నేనే నీపట్ల చెడుగా ప్రవర్తించాను. 18నీవు చేసిన మంచి పనులన్నీ నాకు నీవు చెప్పావు. యెహోవా నన్ను నీ వద్దకు తీసుకుని వచ్చాడు. అయినా నీవు నన్ను చంపలేదు. 19ఇది నీవు నా శత్రువు కాదని నిరూపిస్తుంది. శత్రువు చేజిక్కినపుడు మంచితనంతో ఎవరూ విడిచి పెట్టరు. శత్రువుకు ఎవరూ మేలు చేయరు. ఈ రోజు నీవు నాపట్ల ఇంత మంచిగా ప్రవర్తించినందుకు యెహోవా నీకు ప్రతిఫలం దయచేయును గాక! 20నీవు ఖచ్చితంగా రాజువు అవుతావని నాకు తెలుసు. ఇశ్రాయేలు రాజ్యాన్ని నీవు పరిపాలిస్తావు. 21ఇప్పుడు నాకొక మాట ఇవ్వు. యెహోవా నామం పేరిట నీవు నా సంతతి వారిని హతమార్చనని మాటయివ్వు. నా తండ్రి వంశం నుంచి నా పేరు తుడిచివేయనని నీవు నాకు ప్రమాణం చేసి చెప్పు.” అన్నాడు సౌలు.
22కనుక సౌలుకు దావీదు వాగ్దానం చేసాడు. సౌలు కుటుంబాన్ని నాశనం చేయనని దావీదు వాగ్దానం చేశాడు. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వెళ్లాడు. దావీదు తన అనుచరులతో కొండ స్థలాలకు వెళ్లిపోయాడు.
Currently Selected:
1 సమూయేలు 24: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International