YouVersion Logo
Search Icon

1 సమూయేలు 12

12
రాజు విషయం సమూయేలు మాట్లాడుట
1సమూయేలు ఇశ్రాయేలు ప్రజలనుద్దేశించి ఇలా అన్నాడు: “మీరు నన్ను కోరినదంతా చేశాను. మీకు ఒక రాజు కావాలంటే ఇచ్చాను. 2ఇప్పుడు మీకు నాయకత్వం వహించటానికి ఒక రాజు ఉన్నాడు. నేను తల నెరసి ముసలివాడనై పోయాను. నా కుమారులు మీతోనే ఉన్నారు. నా చిన్ననాటి నుంచీ మీకు నేను ఆధిపత్యం వహించాను. 3ఇప్పుడు నేను మీ సమక్షంలోనే ఉన్నాను. నేనేదైనా తప్పు చేసివుంటే మీరు నాకు వ్యతిరేకంగా వాటిని దేవునికి, ఆయన ఏర్పరచిన రాజుకు చెప్పండి. నేను ఎవరి ఎద్దునే గాని, గాడిదనే గాని దొంగిలించానా? నేనెవరినైనా భాధించటంగాని, మోసగించటంగాని జరిగిందా? నేనెప్పుడైన డబ్బుగాని, ఒక జత చెప్పులుగాని తప్పుపని చేయటానికి తీసుకున్నానా? ఇటువంటి పనులేవైనా చేసి ఉంటే నేను వాటిని తిరిగి ఇచ్చి తప్పు సరిదిద్దుకుంటాను.”
4“నీవు మమ్ములను మోసం చేయలేదు; బాధపెట్టనూ లేదు. నీవు ఎవరి వద్దా లంచాలు కూడ తీసుకోలేదు” అని ఇశ్రాయేలు జనం అన్నారు.
5“యెహోవా, ఆయన ఎంపిక చేసిన రాజు కూడ ఈ రోజు మీరు చెప్పిన దానిని విన్నారు. మీరు నాలో ఏ తప్పూ కనుగొనలేదనే దానికి వారిద్దరూ సాక్షులు” అన్నాడు సమూయేలు. అంతట ప్రజలు, “అవును! ఇది సత్యం” అని చెప్పారు.
6అప్పుడు ప్రజలనుద్దేశించి సమూయేలు, “ఆ దేవుడే సాక్షి. ఆయనే మోషేను, అహరోనును ఎంపికచేసాడు. మీ పూర్వీకులను ఈజిప్టు నుండి ఆయనే విముక్తులను చేసాడు. 7మీరంతా ఇప్పుడు ఇక్కడ నిలబడండి. ఆ యెహోవా మీ కోసం, మీ పూర్వీకుల సంక్షేమం కోసం చేసిన పనులను వివరిస్తాను.
8“యాకోబు వెళ్లిన తర్వాత ఈజిప్టు ప్రజలు ఆయన వంశీకుల జీవితాన్ని కష్టతరం చేశారు. కావున వారు యెహోవా సహాయం అర్థించారు. వారి మొర ఆలకించిన యెహోవా మోషేను, అహరోనును అక్కడికి పంపించాడు. వారిద్దరూ మీ పూర్వీకులను ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చి ఈ ప్రాంతానికి నడిపించారు.
9“కానీ మీ పూర్వీకులు వారి దేవుడైన యెహోవాను మర్చిపోయారు. అప్పుడు యెహోవా వారిని హాసోరు పట్టణ సైన్యాధిపతి సీసెరాకు బానిసలయ్యేలా చేశాడు. తరువాత ఫిలిష్తీయులకు, మోయాబు రాజుకు కూడ యెహోవా వారిని బానిసలు కానిచ్చాడు. వారంతా మీ పూర్వీకులకు వ్యతిరేకంగా పోరాడారు. 10అయితే మీ పూర్వీకులు సహాయంకోసం యెహోవాకు మొరపెట్టారు. ‘మేము పాపం చేసాము. మేము యెహోవాను విడిచిపెట్టి బయలు, అష్తారోతు అనే బూటకపు దేవతలను సేవించాము. అయితే ఇప్పుడు మమ్మల్ని మా శత్రువుల బారినుండి రక్షించు. మేము నిన్ను సేవిస్తాము’ అని చెప్పారు.
11“యెరుబ్బయలు (గిద్యోను) బెదానను (బారాకు) యెఫ్తా, సమూయేలును పంపి, మీ చుట్టూ ఉన్న శత్రువులనుండి యెహోవా మిమ్మల్ని రక్షించాడు. మీరు క్షేమంగా జీవిస్తున్నారు. 12కానీ అమ్మోనీయుల రాజైన నాహాషు మీమీద యుద్ధానికి రావటం మీరు చూచినప్పుడు, మీకు మీ దేవుడైన యెహోవా రాజుగా ఉన్నప్పటికీ ‘మమ్ము పాలించటానికి మాకు ఒక రాజు కావాలని’ మీరు కోరుకున్నారు! 13మీరు ఎంపిక చేసుకొన్న రాజు మీరు కోరుకున్న రాజు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. మీమీద ఒక రాజును యెహోవా నియమించాడు. 14మీరు యెహోవాను ఘనపరచి, ఆయనను సేవించాలి. ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మీరు పోరాడకూడదు. మరియు మీరు, మిమ్మల్ని పాలిస్తున్న రాజు, మీ దేవుడైన యెహోవాను వెంబడించాలి. మీరు ఆ పనులు చేస్తే, అప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. 15కానీ మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, ఆయన ఆజ్ఞలను తిరస్కరిస్తే, ఆయన మీకు వ్యతిరేకి అవుతాడు. ప్రభువు మిమ్మల్ని, మీ రాజును సర్వనాశనం చేస్తాడు.
16“ఇప్పుడు మీరు నిశ్శబ్ధంగా, నిశ్చలంగా నిలబడండి మీ కళ్లముందే యెహోవా చేసే ఒక మహిమాన్విత కార్యం చూడండి. 17ఇప్పుడు గోధుమ పంట#12:17 గోధుమ పంట ఇది వర్షాలు లేని కాలం కోతకు వచ్చింది. ఫెళఫెళమనే ఉరుములు, మెరుపులతో వర్షం కురిపించుమని నేను దేవుని ప్రార్థిస్తాను. అప్పుడు మీరు రాజు కావాలని అడిగి, యెహోవాపట్ల ఎంత పాపం చేశారో మీరే తెలుసుకుంటారు,” అని వివరంగా చెప్పాడు.
18అలా చెప్పి, సమూయేలు యెహోవాను ప్రార్థించాడు. అదే రోజున యెహోవా ఉరుములతో కూడిన వర్షం పంపించాడు. దానితో యెహోవా అనిన, సమూయేలు అనిన ప్రజలకు విపరీతమైన భయం ఏర్పడింది. 19ప్రజలు సమూయేలుతో, “నీ సేవకులమైన మాకోసం దేవుడైన యెహోవాను ప్రార్థించు. మమ్మల్ని చనిపోనీయవద్దు. మా పాపాల మూటకుతోడు రాజు కావాలని అడిగే దురాచారాన్ని కూడ సంతరించుకున్నాం” అని వాపోయారు.
20భయపడవద్దని సమూయేలు వారికి ధైర్యం చెప్పాడు. “మీరు తప్పు చేసిన మాట నిజమే. అయినా యెహోవాకు దూరం కావద్దు. మీ హృదయ పూర్వకంగా యెహోవాకు సేవ చేయండి. 21విగ్రహాలు వట్టి బొమ్మలే. అవి మీకు సహాయం చేయలేవు. కావున వాటిని పూజించవద్దు. విగ్రహాలు మీకు సహాయము చెయ్యలేవు, కాపాడనూలేవు. విగ్రహాలు కేవలం వ్యర్థము!
22“అయితే యెహోవా తన ప్రజలను విడిచి పెట్టడు. యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొనేందుకు ఆనందించాడు. అందుచేత తనమంచి పేరుకోసం ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. 23కావున మీ కోసం ప్రార్థన చేయకుండా నేను మాని వేస్తే అది నా తప్పు అవుతుంది. ఒకవేళ నేను అలా మానివేస్తే యెహోవాకు విరుద్ధంగా పాపం చేసినవాణ్ణి అవుతాను. సరైన మంచి జీవన మార్గాన్ని నేను మీకు ప్రబోధిస్తాను. 24అయితే మీరు యెహోవా ఎడల భయభక్తులతో ఉండాలి. మీ పూర్ణ హృదయంతో మీరు వాస్తవంగా ఆయనను సేవించాలి. ఆయన మీ కోసం చేసిన ఆశ్చర్యకరమైన పనులన్నీ జ్ఞాపకం చేసుకోండి! 25మీరు మొండి వైఖరితో చెడుచేస్తూనే ఉంటే ఆయన మిమ్మల్నీ, మీ రాజునూ చీపురుతో ఊడ్చి పారవేసినట్లు విసిరేస్తాడు” అని సమూయేలు వారికి వివరించి చెప్పాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for 1 సమూయేలు 12