YouVersion Logo
Search Icon

1 రాజులు 20

20
బెన్హదదు, అహాబు యుద్ధానికి తలపడుట
1బెన్హదదు సిరియా రాజు, అతడు తన సైన్యాలన్నిటినీ సమీకరించాడు. తనతో ముప్పై ఇద్దరు రాజులున్నారు. వారికి రథాలు, గుర్రాలు వున్నాయి. వారు సమరియను (షోమ్రోను) ముట్టడించి యుద్ధం చేశారు. 2ఇశ్రాయేలు రాజైన అహాబు వద్దకు సిరియా రాజు దూతలను పంపాడు. 3వారు బెన్హదదు మాటగా అహాబుతో ఇలా అన్నారు: “నీవు నీ యొక్క వెండి బంగారాలను నాకు ఇచ్చేయాలి. అంతేగాక నీ భార్యలను, పిల్లలను కూడ తప్పక నాకు ఇచ్చేయాలి.”
4ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “నా యజమానియైన ఓ రాజా, నేను నీ వాడనని ఒప్పుకుంటున్నాను. నాకున్నప్రతిదీ నీకు చెందినదే.”
5దూతలు మరల అహాబు వద్దకు వచ్చారు. వారు బెన్హదదు తరుపున ఇలా అన్నారు, “నీవు నీ వెండి బంగారాలను, నీ భార్యలను, పిల్లలను నాకు ఇవ్వాలని నేనింతకు ముందే చెప్పాను. 6నేనిప్పుడు నా మనుష్యులను పంపి నీ భవనాన్ని, నీ కింది పాలకుల ఇండ్లను వెదికించాలనుకుంటున్నాను. నా మనుష్యలకు ఏది నచ్చితే అది తీసుకుని వస్తారు.”
7ఇది విని, రాజైన అహాబు తన దేశంలో వున్న పెద్దల (నాయకుల)తో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. వారితో ఇలా అన్నాడు: “చూడండి! బెన్హదదు కయ్యానికి సిద్దమవుతున్నాడు. నా భార్యలను, పిల్లలను, నా వెండి బంగారాలను నేనతనికి ఇవ్వాలని ముందుగా చెప్పాడు. అవన్నీ ఇవ్వటానికి నేను ఒప్పుకున్నాను. కాని ఇప్పుడతను సర్వం తీసుకోవాలని చూస్తున్నాడు.”
8ఇది విన్న పెద్దలు (నాయకులు), ఇతర ప్రజలు “బెన్హదదును లెక్క చేయవద్దనీ, అతను చెప్పినట్లు చేయవద్దనీ” అన్నారు.
9బెన్హదదుకు తిరుగు సమాధానంలో అహాబు ఇలా అన్నాడు: “నేను నీవు ముందు చెప్పిన విధంగా చేస్తాను. కాని నీవు రెండవసారి ఆజ్ఞ ఇచ్చినట్లుగా నేను చేయజాలను.”
రాజైన బెన్హదదు మనుష్యులు ఈ సమాచారాన్ని అతనికి అందజేశారు. 10బెన్హదదు నుంచి మరో వర్తమానం తీసుకుని దూతలు మళ్లీ వచ్చారు. ఆ సమాచారం ఇలా వుంది, “నేను షోమ్రోనును పూర్తిగా నాశనం చేస్తాను. ఆ నగరంలో ఏదీ మిగిలి వుండదని నేను ప్రమాణం చేసి చెబుతున్నాను! నా మనుష్యులు గుర్తుగా#20:10 మనుష్యులు గుర్తుగా హెబ్రీలో గుప్పెడు మట్టి కూడ అని శబ్దార్థం. ఇంటికి తెచ్చుకోవటానికి కూడ అక్కడ ఏమీ మిగలదు. నేనిది చేయకపోతే దేవుడు నన్ను సర్వనాశనం చేయుగాక!”
11రాజైన అహాబు ప్రత్యుత్తరమిస్తూ “బెన్హదదుకు ఇలా చెప్పండి. కవచాన్ని ధరించువాడు దానిని ధరించి విప్పిన వానివలె గొప్పలు చెప్పరాదు”#20:11 కవచాన్ని … చెప్పరాదు “నిజమైన సైనికుడు యుద్ధం ముగిసినాక గొప్పతనం చెప్పుకుంటాడు గాని, యుద్ధానికి ముందు కాదు” అని పాఠాంతరం. అని చెప్పమన్నాడు.
12రాజైన బెన్హదదు ఇతర పాలకులతో కలిసి తన డేరాలో వున్నాడు. ఆ సమయంలో అతని దూతలు తిరిగి వచ్చి రాజైన అహాబు ఇచ్చిన సమాధానాన్ని అతనికి అందజేశారు. రాజైన బెన్హదదు నగరాన్ని ముట్టడించటానికి సన్నద్ధులు కండని తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. కావున వారంతా తమ తమ స్థానాలకు వెళ్లారు.
13అదే సమయంలో ఒక ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: “ఆ పెద్ద సైన్యాన్ని నీవు చూస్తున్నావు గదా! దేవుడనైన నేను నీవు ఆ మహా సైన్యాన్ని ఈ రోజు ఓడించేలా చేస్తాను. అప్పుడు నేనే నిత్యుడనైన యెహోవానని నీవు గుర్తిస్తావు.”
14“వారిని ఓడించటానికి నీవు ఎవరిని ఉపయోగిస్తావు?” అని అహాబు అడిగాడు. “యువకులైన ప్రభుత్వాధికారులను” అని యెహోవా సెలవిస్తున్నాడని ప్రవక్త అన్నాడు. “ప్రధాన సైన్యాన్ని ఎవరు నడుపుతారు?” అని రాజు అడిగాడు.
“నీవే” అని ప్రవక్త అన్నాడు.
15కావున అహాబు యువ ప్రభుత్వాధికారులను సమాయత్తపరచాడు. వారు రెండు వందల ముప్పై రెండుమంది ఉన్నారు. ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ రాజు సమీకరించాడు. వారంతా ఏడు వేల మందివున్నారు.
16మధ్యాహ్నమయ్యింది. రాజైన బెన్హదదు, అతనికి తోడుగా ఉన్న మొప్పైరెండు మంది పాలకులు వారి గుడారాలలో బాగా మద్యపానం చేసి మైకంలో వున్నారు. ఈ సమయంలో రాజైన అహాబు దండయాత్ర మొదలయ్యింది. 17యువ ప్రభుత్వాధికారులు ముందుగా ఎదుర్కొన్నారు. రాజైన బెన్హదదు మనుష్యులు అతనితో షోమ్రోను నుండి కొందరు సైనికులు బయటికి వచ్చినట్లు చెప్పారు. 18“అయితే వారు యుద్ధానికి వస్తూ వుండవచ్చు. లేదా వారు సంధి నిమిత్తమై వస్తూ వుండవచ్చు. ఏది ఏమైనా వారిని సజీవంగా పట్టుకోండి” అని బెన్హదదు అన్నాడు.
19రాజైన అహాబు యొక్క యువసైనికులు దండయాత్రను నడుపుతున్నారు. ఇశ్రాయేలు సైన్యంవారిని అనుసరిస్తూవుంది. 20ఇశ్రాయేలు అధికారులలో ప్రతియొక్కడూ తనని ఎదుర్కొన్న శత్రువును చంపివేశాడు. కావున అరామునుండి వచ్చినవారు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం వారిని తరిమికొట్టింది. రాజైన బెన్హదదు ఒక రథాశ్వము నెక్కి తప్పించుకున్నాడు.
21రాజైన అహాబు తన సైన్యాన్ని నడిపించి అరాము సైనికుల గుర్రాలను, రథాలను స్వాధీన పర్చుకున్నాడు. ఆ విధంగా రాజైన అహాబు చేతిలో సిరియను సైన్యం ఘోర పరాజయం పొందింది.
22అప్పుడు ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “ఆరాము రాజైన బెన్హదదు రాబోయే వసంతకాలం నాటికి మళ్లీ నీమీదికి యుద్ధానికి వస్తాడు. ఇప్పుడు నీవు నీ నివాసానికి వెళ్లి నీ సైన్యాన్ని బాగా బలపర్చుకో. అతని దండయాత్ర నుంచి నిన్ను నీవు రక్షించుకోవటానికి తగిన వ్యూహాలు సిద్ధం చేయి.”
బెన్హదదు తిరిగి యుద్ధానికి వచ్చుట
23రాజైన బెన్హదదు సేవకులు కొందరు వచ్చి అతనికి ఇలా సలహా ఇచ్చారు, “ఇశ్రాయేలు దేవతలు కొండ దేవతలు. మనం యుద్ధం పర్వత ప్రాంతంలో నిర్వహించాం. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. కావున ఈ సారి మనం మైదాన ప్రాంతంలో యుద్ధం నిర్వహించాలి. అప్పుడు మనం గెలుస్తాం. 24ఇప్పుడు నీవొకటి చేయాలి. ఈ ముప్పది యిద్దరు పాలకులను సైన్యాలను నడిపించేందుకు అనుమతించద్దు. వారి స్థానంలో దళాధిపతులను నియమించు. 25తర్వాత నీవు పోగొట్టుకున్నటువంటి సైన్యాన్ని మళ్లీ నీవు భర్తీ చేయాలి. పూర్వపు సైన్యంలో వున్నట్లుగా గుర్రాలను, రథాలను మళ్లీ సేకరించు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యాన్ని మైదాన ప్రాంతంలో మనం ఎదుర్కొందాం. అప్పుడు విజయం మనదే!” బెన్హదదు వారి సలహా పాటించాడు. వారు చెప్పిందంతా చేశాడు.
26వసంత కాలం వచ్చే సరికి బెన్హదదు అరాము ప్రజలను సమీకరించాడు. ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి అతడు ఆఫెకు నగరానికి వెళ్లాడు.
27ఇశ్రాయేలీయులు కూడా యుద్ధానికి తయారైనారు. ఇశ్రాయేలు ప్రజలు అరాము సైన్యంతో పోరాడటానికి వెళ్లారు. అరాము సైనికులు దిగిన చోటికి ఎదురుగానే ఇశ్రాయేలు సైనికులు మకాంవేశారు. అరామీయులు ఆ ప్రదేశాన్నంతా ఆక్రమించియుండగా, ఇశ్రాయేలీయులు కేవలం రెండు మేకల మందలవలెవున్నారు.
28ఇశ్రాయేలు రాజు వద్దకు దైవజనుడొకడు వర్తమానాన్ని తెచ్చాడు. యెహోవా ఇలా చెప్పాడు: “అరాము ప్రజలు ప్రభువునైన నన్ను ఒక కొండ దేవతగా చిత్రీకరించారు. నేను లోయలకు కూడ దేవుడనేనని వారు భావించలేదు. కావున నీవు ఈ పెద్ద సైన్యాన్ని ఓడించేలా చేస్తాను. అప్పుడు సర్వత్రా నేనే ప్రభువునని నీవు తెలుసుకుంటావు.”
29ఇరు సైన్యాలు ఎదురెదురుగా ఏడు రోజుల పాటు మోహరించి వున్నాయి. ఏడవరోజు యుద్ధం మొదలయ్యింది. ఇశ్రాయేలీయులు ఒక్క రోజులో ఒక లక్ష మంది అరాము సైనికులను చంపేశారు. 30మిగిలిన వారు ఆఫెకు నగరానికి పారిపోయారు. నగర ప్రాకారపు గోడ విరిగి పడగా ఇరవై ఏడువేల మంది సైనికులు చనిపోయారు. బెన్హదదు కూడ నగరానికి పారిపోయాడు. అతడొక గదిలో దాక్కున్నాడు. 31ఈ లోపు కొందరు సేవకులు అతనితో ఇలా అన్నారు: “ఇశ్రాయేలు రాజులు కనికరం చూపనున్నట్లు మేము విన్నాం. మనం గోనెబట్టలు ధరించి, తాళ్లు తలకు చుట్టుకుని#20:31 గోనె బట్టలు … చుట్టుకుని ఇలా చేసిన వారు అల్పస్థితిలోను, అణకువతోను వున్నట్లు; వారు లొంగి పోవడానికి సిద్ధంగా వున్నట్లు గుర్తు. ఇశ్రాయేలు రాజు వద్దకు వెళ్దాం. బహుశః అతడు మనల్ని బ్రతకనివ్వొచ్చు.”
32వారు గోనెపట్టలు చుట్టుకుని, తలపై తాళ్లు వేసుకున్నారు. వారు ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, “మీ సేవకుడు బెన్హదదు దయచేసి తనను బ్రతకనివ్వమని అడుగుతున్నాడు” అని చెప్పారు.
“అయితే అతడింకా బ్రతికే వున్నాడా? అతడు నా సహోదరుడే!” అన్నాడు అహాబు.
33బెన్హదదు మనుష్యులు రాజైన అహాబు నిజంగా దయచూపి బెన్హదదును చంపనని నిరూపించే విధంగా ఏదైనా చెప్పాలని కోరుకున్నారు. ఎప్పుడయితే బెన్హదదును నా సహోదరుడని అహాబు అన్నాడో, వచ్చిన మనుష్యులు వెంటనే,
“అవును! బెన్హదదు నీ సోదరుడే!” అని అన్నారు. “అతనిని నా వద్దకు తీసుకుని రండి” అని అహాబు అన్నాడు. తరువాత బెన్హదదు రాజైన అహాబు ముందుకు వచ్చాడు. అహాబు అతనిని తనతో తన రథం ఎక్కమన్నాడు.
34బెన్హదదు అతనితో ఇలా అన్నాడు: “అహాబూ, నా తండ్రి నీ తండ్రి వద్ద నుండి తీసుకున్న పట్టణాలన్నిటినీ నేను నీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి షోమ్రోనులో చేసిన విధంగా, దమస్కులో నీవు కొన్ని వీధులను నిర్మించి, వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు.” అది విన్న అహాబు,
“నీవు ఇందుకు ఒప్పుకుంటే నేను నిన్ను వదిలి పెడతాను” అని అన్నాడు. తరువాత ఆ రాజులిద్దరూ ఒక శాంతి ఒడంబడిక కుదుర్చుకున్నారు. రాజైన అహాబు రాజైన బెన్హదదును స్వేచ్ఛగా వదిలాడు.
ఒక ప్రవక్త అహాబుకు వ్యతిరేకంగా మాట్లాడుట
35ప్రవక్తలలో ఒకడు మరో ప్రవక్తతో, “నన్ను కొట్టు!” అని అన్నాడు. యెహోవా వలన ప్రేరేపించబడి అతనలా అన్నాడు. కాని ఆ రెండవ ప్రవక్త అతనిని కొట్ట నిరాకరించాడు. 36అందుచే మొదటి ప్రవక్త ఇలా అన్నాడు; “నీవు యెహోవా ఆజ్ఞను పాటించలేదు. నీవు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లగానే ఒక సింహం నిన్ను చంపేస్తుంది.” ఆ రెండవ ప్రవక్త ఆ ప్రదేశం వదిలి వెళ్లగానే ఒక సింహం వచ్చి అతనిని చంపేసింది.
37మొదటి ప్రవక్త మరో వ్యక్తి వద్దకు వెళ్లి, “నన్ను కొట్టు!” అన్నాడు.
ఈ వ్యక్తి వానిని కొట్టాడు. ప్రవక్తకు బాగా దెబ్బతగిలింది.
38అందుచే ఆ ప్రవక్త ఒక బట్టతో తన ముఖం కప్పుకున్నాడు. దానివల్ల అతనెవరైనదీ ఎవ్వరూ గుర్తు పట్టలేదు. ప్రవక్త వెళ్లి రాజు కొరకు బాటపై నిలబడ్డాడు. 39రాజు వచ్చినప్పుడు ప్రవక్త అతనితో ఇలా అన్నాడు: “నేను యుద్ధం చేయటానికి వెళ్లాను. మనలో ఒకడు శత్రుసైనికునొకణ్ణి నా వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ శత్రు సైనికునికి కాపలా వుండమనీ, వాడు గనుక పారిపోతే అతని స్థానంలో నేను నా ప్రాణాలను ఇవ్వవలసి వుంటుందనీ మన సైనికుడు నాతో చెప్పాడు. లేదా రెండు మణుగుల#20:39 రెండు మణుగులు ఆంగ్ల కొలమానం ప్రకారం డెబ్బై ఐదు పౌనులని అర్థం. వెండి చెల్లించవలసి వుంటుందని అన్నాడు. 40కాని నేను వేరే పనిలో నిమగ్నమై వుండగా ఆ శత్రుసైనికుడు పారిపోయాడు.”
ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “నీవా సైనికుని ఒదిలిపెట్టిన నేరం చేసినట్లు ఒప్పుకున్నావు. దానికి సమాధానం కూడా నీకు తెలుసు. ఆ వ్యక్తి చెప్పినట్లే నీవు చేయాలి.”
41అప్పుడా ప్రవక్త తన ముఖము మీది బట్టను తీసేశాడు. ఇశ్రాయేలు రాజు వానిని చూచి, అతడు ప్రవక్తలలో ఒకడని తెలుసుకున్నాడు. 42ప్రవక్త యెహోవా వర్తమానాన్ని రాజుకిలా చెప్పాడు: “చంపబడాలని నేను నిర్దేశించిన వ్యక్తిని నీవు వదిలి పెట్టావు. కావున వాని స్థానంలో నీ ప్రాణం తీసుకోబడుతుంది. అతని ప్రజల స్థానంలో నీ ప్రజలు చనిపోవలసి వుంటుంది.”
43రాజు షోమ్రోనులో వున్న తన ఇంటికి వెళ్లి పోయాడు. అతని మనస్సు బాగా కలత పడింది. అతడు చింతాక్రాంతుడయ్యాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in