YouVersion Logo
Search Icon

1 రాజులు 13

13
దేవుడు బేతేలుకు వ్యతిరేకంగా పలుకుట
1ఒక రోజు యూదా దేశపువాడైన ఒక దైవజనుడ్ని బేతేలు నగరానికి వెళ్లమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దైవజనుడు అక్కడికి వెళ్లే సరికి రాజైన యరొబాము బలిపీఠం వద్ద నిలబడి ధూపం వేస్తూ వున్నాడు. 2ఆ బలిపీఠానికి వ్యతిరేకంగా మాట్లాడమని యెహోవా దైవజనునికి ఆజ్ఞ ఇచ్చాడు. అతను ఇలా చెప్పాడు:
“బలిపీఠమా, నీకు యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘దావీదు వంశంలో యోషీయా అనువాడొకడు జన్మిస్తాడు. ఈ యాజకులు ఇప్పుడు కొండలపై, గుట్టలపై ఆరాధిస్తున్నారు కాని ఓ బలిపీఠమా, యోషీయా ఈ యాజకులను నీ మీద పెట్టి, వారిని చంపుతాడు. ఇప్పుడా యాజకులు నీ మీద ధూపం వేస్తున్నారు. కాని యోషీయా నీమీద మానవుల అస్తికలను తగులబెడతాడు. అప్పుడు నీవు దేనికీ ఉపయోగపడవు.’”
3ఇవి జరిగి తీరుతాయనటానికి దైవజనుడు ఒక సూచనఇచ్చాడు. “యెహోవా ఈ సూచన నాకు తెలియజెప్పాడు. ఈ బలిపీఠం నిలువునా పగిలిపోతుంది. దాని మీది బూడిద కిందికి పడి పోతుంది” అని ప్రవక్త అన్నాడు.
4బేతేలులో వున్న బలిపీఠాన్ని గురించి దైవజనుడు చెప్పిన సమాచారాన్ని రాజైన యరొబాము విన్నాడు. అతడు తన చేతిని బలిపీఠం మీదినుంచి తీసి ప్రవక్తవైపు చూస్తూ, “అతనిని నిర్బంధించండి!” అని అన్నాడు. రాజు అలా అన్నదే తడవుగా అతని చేయి చచ్చుపడిపోయింది. దానిని అతడు కదల్చలేక పోయాడు. 5అంతే గాకుండా, బలిపీఠం ముక్కలై పోయింది. దాని మీది బూడిద కిందికి పడిపోయింది. దేవుని సమాచారంగా ఆ దైవజనుడు దీనినే చెప్పాడు. 6అప్పుడు యరొబాము దైవజనునితో, “దయచేసి నా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. నా చేతిని బాగు చేయమని యెహోవాను అడుగు” అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకొరకు దైవజనుడు యెహోవాను ప్రార్థించాడు.
తక్షణమే రాజు చేయి స్వస్థపడింది. అది పూర్వపు చేయిలా ఆరోగ్యవంతంగా వుంది.
7అప్పుడు రాజు ఆ దైవజ్ఞుడితో, “దయచేసి నాతో నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయి. నేను నీకు ఒక కానుక సమర్పించదలిచాను” అని అన్నాడు.
8అది విన్న ప్రవక్త రాజుతో, “నేను నీతో నీ ఇంటికి రాను! నీవు నీ రాజ్యంలో సగంభాగం నాకిచ్చినా నేను నీతో రాను! ఈ స్థలంలో నేనేదీ తినను, త్రాగను. 9ఏదీ తినకూడదని త్రాగరాదని యెహోవా ఆజ్ఞ. నేనిక్కడికి వచ్చిన బాట వెంట మళ్లీ ప్రయాణం చేయవద్దని కూడా యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అని అన్నాడు. 10అందువల్ల అతడు మరో మార్గాన తిరుగు ప్రయాణం సాగించాడు. బేతేలుకు వచ్చిన బాట వెంట తను తిరిగి వెళ్లలేదు.
11ఆ రోజులలో బేతేలు నగరంలో వృద్ధుడైన ఒక ప్రవక్త నివసిస్తూ వుండేవాడు. ఆ వృద్ద ప్రవక్త యొక్క కుమారులు దైవజనుడు వచ్చి బేతేలు నగరంలో చేసినదంతా తమ తండ్రితో చెప్పారు. రాజైన యరొబాముతో ఆ దైవజనుడు చెప్పినదంతా కూడా వారు తమ తండ్రికి వివరించారు. 12అయితే “అతడు ఏ మార్గాన వెళ్లాడని” వృద్ధ ప్రవక్త అడిగాడు. యూదానుండి వచ్చిన దైవజనుడు వెళ్లిన దారిని తమ తండ్రికి అతని కుమారులు చూపించారు. 13వృద్ధ ప్రవక్త తన కుమారులతో అతని గాడిదపై గంత వేయమని చెప్పాడు. వారతిని గాడిదపై గంత వేయగా, దానిపై ఎక్కి ప్రవక్త ప్రయాణమై వెళ్లాడు.
14ఆ వృద్ధ ప్రవక్త దైవజనుడిని వెతుక్కుంటూ పోయాడు. దైవజనుడు ఒక సింధూర వృక్షం కింద కూర్చుని వుండటం వృద్ద ప్రవక్త చూశాడు. “యూదానుండి వచ్చిన దైవజనుడవు నీవేనా?” అని వృద్ధ ప్రవక్త అడిగాడు.
“అవును నేనే” అన్నాడు దైవజనుడు.
15“అయితే దయచేసి నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయండి” అంటూ వృద్ధ ప్రవక్త అడిగాడు.
16కాని దైవజనుడిలా అన్నాడు: “నేను నీతో రాలేను. నీతో ఈ ప్రదేశంలో అన్నపానాదులు తీసుకోలేను. 17‘అక్కడ నీవేదీ తినరాదు; తాగరాదు. నీవు వెళ్లిన దారిన తిరిగి రాకూడదు; అని కూడ యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు.’”
18“కాని నేను కూడా నీలాగే ఒక ప్రవక్తను” అన్నాడు ఆ వృద్ధ ప్రవక్త. అతడు ఒక అబద్ధం కూడా చెప్పాడు. “యెహోవా యొక్క దేవదూత నావద్దకు వచ్చాడు. ఆ యెహోవా యొక్క దేవదూత నిన్ను నా ఇంటికి తీసుకుని వెళ్లమని, నాతో నీవు భోజనాదులు చేసేలా అనుమతివ్వమనీ అన్నాడు” అని చెప్పాడు.
19ఈ మాటలు నమ్మి ఆ దైవజనుడు వృద్ధ ప్రవక్త ఇంటికి వెళ్లాడు. అతనితో కలిసి భోజనాదికములు చేశాడు. 20వారు బల్లవద్ద కూర్చునివుండగా, యెహోవా వృద్ధ ప్రవక్తతో మాట్లాడాడు. 21ఆ వృద్ధ ప్రవక్త యూదా దేశపు దైవజనునితో ఇలా అన్నాడు: “ప్రభువాజ్ఞ నీవు పాటించలేదని ఆయన అన్నాడు! యెహోవా ఆదేశించిన దానిని నీవు చేయలేదు. 22ఈ ప్రదేశంలో నీవు ఏమీ తినరాదనీ, త్రాగరాదనీ యెహోవా ఆజ్ఞాపించాడు. కాని నీవు తిరిగి వచ్చి భోజనాదికాలు నిర్వర్తించావు. అందువల్ల నీ శవం నీ పితరుల సమాధిలో ఉంచబడదు.”
23దైవజనుడు భోజనం ముగించాడు. వృద్ధ ప్రవక్త గాడిదపై గంత వేయగా, దైవజనుడు దానిపై వెళ్లాడు. 24తను ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో ఒక సింహం దైవజనుని మీదపడి చంపేసింది. దైవజనుని శరీరం బాటపై పడివుంది. గాడిద, సింహం శవం పక్కన నిలబడివున్నాయి. 25కొందరు ఆ దారిన పోతూ, శవం పక్కన సింహం నిలబడివుండటం చూశారు. వృద్ధ ప్రవక్త వున్న నగరానికి వచ్చి, వారు దారిలో చూసినదంతా చెప్పారు.
26ఆ వృద్ధ ప్రవక్తే యూదా దేశాపు దైవజనుని వెనుకకు తీసుకొని వచ్చాడు. వృద్ధ ప్రవక్త జరిగినదంతావిని, “ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. అందువలన యెహోవా ఒక సింహాన్ని అతనిని చంపటానికి పంపాడు. ఇది చేస్తానని యెహోవా చెప్పియున్నాడు” అని అన్నాడు. 27“తన గాడిదపై గంతవేయమని” తన కుమారులతో ప్రవక్త చెప్పాడు. తన కుమారులు గాడిదపై గంతవేశారు. 28వృద్ధ ప్రవక్త దానిపై వెళ్లి శవం బాటపై పడివుండటం చూశాడు. గాడిద, సింహం ఇంకా శవం పక్కన నిలబడి వున్నాయి. పైగా ఆ సింహం శవాన్ని తినటం గాని, గాడిదను గాయపర్చటం గాని చేయలేదు.
29వృద్ధ ప్రవక్త శవాన్ని తన గాడిదపై వేశాడు. దైవజనుని మృతికి సంతాపం తెలియజేయటానికి శవాన్ని ప్రవక్త వెనుకకు తీసుకుని వచ్చాడు. 30శవాన్ని ప్రవక్త తన కుటుంబానికి సంబంధించిన సమాధిలో పెట్టాడు. వృద్ధ ప్రవక్త అతని మృతికి సంతాపం తెలియజేశాడు. ఆ ప్రవక్త, “ఓ నా సహోదరుడా, నీ మరణానికి మిక్కిలి విలపిస్తున్నాను” అని అన్నాడు. 31వృద్ధ ప్రవక్త దైవజనుని శవాన్ని పాతిపెట్టాడు. తరువాత తన కుమారులతో ఇలా అన్నాడు: “నేను చనిపోయినప్పడు నా శవాన్ని ఇదే సమాధిలో ఉంచండి. నా ఎముకలను అతని అస్థికల పక్కనే ఉంచండి. 32యెహోవా అతని ద్వారా చెప్పిన మాటలు నిజమయి తీరుతాయి. యెహోవా బేతేలులోని బలిపీఠానికి, సమరియ పట్టణాలలోని ఉన్నత స్థలాలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి అతనిని ఉపయోగించుకున్నాడు.”
33రాజైన యరొబాములో ఏమీ మార్పు రాలేదు. అతడు చెడ్డ పనులు చేస్తూనే వున్నాడు. వేర్వేరు వంశాల నుండి మనుష్యులను అతడు యాజకులుగా#13:33 వేర్వేరు … యాజకులుగా ధర్మశాస్త్ర ప్రకారం లేవీ వంశం వారినే యాజకులుగా నియమించాలి. ఎంపిక చేస్తూనే వున్నాడు. ఈ యాజకులు ఉన్నత ప్రదేశాలలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు. ఎవరు యాజకుడు కావాలనుకుంటే వారికా అవకాశం ఇవ్వబడింది. 34ఇది ఒక మహా పాపమై తన రాజ్యం సర్వ నాశనం కావటానికి ప్రధాన కారాణమయ్యింది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in