కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12
12
పవిత్రాత్మ వరాలు
1సోదరులారా! పరిశుద్ధాత్మ యిచ్చే వరాలను గురించి మీరు తెలుసుకోవాలని నా అభిప్రాయము. 2మీరు క్రీస్తులో విశ్వాసులు కానప్పుడు ఏదో ఒక విధంగా ప్రేరేపింపబడి త్రోవతప్పి, మాట్లాడలేని విగ్రహాల వైపుకు మళ్ళారు. ఇది మీకు తెలుసు. 3అందువల్ల నేను చెప్పేదేమిటంటే, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేవాడెవ్వడూ, “యేసు శాపగ్రస్తుడని” అనడు. అదే విధంగా ఆత్మ ద్వారా మాత్రమే “యేసే ప్రభువు” అని అనగలడు.
4దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు. 5ప్రభువు ఒక్కడే కాని, ఆయనకు ఎన్నో విధాలుగా సేవ చేయవచ్చు. 6దేవుడు నలుగురిలో పలువిధాలుగా పని చేస్తాడు. దేవుడు ఒక్కడే అయినా ఆయన అన్నీ చేస్తాడు. అందరిలో చేస్తాడు.
7దేవుడు ప్రతీ ఒక్కరిలో తన ఆత్మ ఉండేటట్లు చేసాడు. ఇది మనము చూస్తున్నాము. అందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన ఉద్దేశ్యం. 8ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడే వరాన్ని, ఆ ఆత్మ ద్వారానే బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడు. 9అదే పరిశుద్ధాత్మ ద్వారా ఒకనికి విశ్వాసము ఇచ్చాడు. మరొకనికి వ్యాధులు నయం చేసే వరము నిచ్చాడు. 10ఒకనికి అద్భుతాలు చేయు శక్తిని, మరొకనికి ప్రవచించే శక్తిని ఇచ్చాడు. ఒకనికి ఆత్మలను గుర్తించే శక్తిని, మరొకనికి రకరకాల భాషల్లో మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఇంకొకనికి వాటి అర్థాలను విడమర్చి చెప్పే శక్తినిచ్చాడు. 11ఆ ఒక్క ఆత్మయే అన్నీ చేస్తున్నాడు. ఆయన తన యిచ్ఛానుసారం ప్రతీ ఒక్కనికి వరాల్ని ఇస్తాడు.
ఒకే శరీరం, అనేక అవయవాలు
12శరీరంలో అనేక భాగాలు ఉన్నా అవి కలిసి ఒక దేహంగా పని చేస్తాయి. క్రీస్తు కూడా అంతే. 13అంటే మనమంతా ఒక ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది, ఒక శరీరంలో ఐక్యం అయ్యాము. మనము యూదులమైనా, గ్రీకులమైనా, బానిసలమైనా, బానిసలము కాకపోయినా, మనకందరికీ ఒకే ఆత్మ యివ్వబడినాడు.
14మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి కాదు. 15ఒకవేళ, కాలు, “నేను చేతిని కాను, కనుక నేను ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 16అదే విధంగా ఒకవేళ చెవి, “నేను కన్నును కాను. కనుక ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 17శరీరమంతా కన్నైపోతే దేనితో వింటాం? శరీరమంతా చెవియైతే దేనితో వాసన చూస్తాం? 18కాని నిజానికి దేవుడు ఈ శరీరంలోని ప్రతి అవయవాన్ని తాను అనుకొన్న విధంగా అమర్చాడు. 19అన్ని అవయవాలు ఒక అవయవంగా మారితే శరీరం ఉండదు. 20నిజానికి శరీరంలో అనేక భాగాలు ఉన్నా శరీరం ఒక్కటే.
21కన్ను చేతితో, “నీవు నాకు అవసరం లేదు” అని అనలేదు. అదే విధంగా శిరస్సు పాదాలతో, “మీరు నాకు అవసరం లేదు” అని అనలేదు. 22సున్నితంగా కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి. 23ముఖ్యం కాదనుకొనే భాగాలను మనము ప్రత్యేకంగా కాపాడుతాము. బహిరంగపరచలేని భాగాల పట్ల మనము ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాము. 24బహిరంగపరచగల భాగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపనవసరం లేదు. కాని దేవుడు శరీరానికి సంబంధించిన భాగాల్ని ఒక చోట చేర్చి ప్రాముఖ్యత లేని భాగాలకు ప్రాముఖ్యత కలిగించాడు. 25శరీరంలో చీలికలు ఉండరాదని, దాని భాగాలు పరస్పరం శ్రద్ధ చూపుతూ ఉండాలని, ఆయన ఉద్దేశ్యం. 26ఒక భాగానికి కష్టం కలిగితే ప్రతీయొక భాగం దానితో సహా కష్టం అనుభవిస్తుంది. ఒక భాగానికి గౌరవం లభిస్తే మిగతా భాగాలన్నింటికీ దానితో సహా ఆనందం కలుగుతుంది.
27మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. 28దేవుడు సంఘంలో ఉన్నవాళ్ళందర్నీ తమతమ స్థానాల్లో ఉంచాడు. మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తల్ని, మూడవ స్థానంలో బోధించే వాళ్ళను, ఆ తర్వాత మహత్కార్యాలను చేసేవాళ్ళను, వాళ్ళ తర్వాత వ్యాధులు నయం చేసే శక్తి గలవాళ్ళను, ఇతరులకు సహాయం చేసేవాళ్ళను, పరిపాలించేవాళ్ళను, తమకు తెలియని భాషల్లో మాట్లాడగల శక్తి గలవాళ్ళను ఉంచాడు. 29వీళ్ళలో అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధించేవాళ్ళు కారు, అందరూ అద్భుతాలు చేసేవాళ్ళు కారు. 30వీళ్ళలో అందరికి వ్యాధులు నయం చేసే శక్తి లేదు. తెలియని భాషలో మాట్లాడే శక్తి లేదు. ఆ మాటలకు అర్థం విడమర్చి చెప్పే శక్తి లేదు. 31కనుక మీ హృదయాలను ముఖ్యమైన వరాల వైపుకు మళ్ళించండి. ఏది ఏమైనా అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం చూపిస్తాను.
Currently Selected:
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International